-కల్వకుంట్ల కవిత

మణుగూరులో పర్యటన | (మణుగూరు)

కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి అంకితభావంతో పనిచేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. జాగృతి జనంబాటలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన కవిత గురువారం మణుగూరులో బస చేశారు.

మణుగూరులో ఇటీవల మృతి చెందిన జాగృతి నాయకురాలు మల్లీశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణికి పుట్టినిల్లు అయిన కొత్తగూడెంకు రావటం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కొత్తగూడెంలో పుట్టిన వారికి హైదరాబాద్ రావల్సిన అవసరం లేదని అనుకునే వాళ్లమన్నారు. అన్ని కంపెనీలు, ఉద్యోగాలు వాళ్లకు ఉంటాయని గతంలో భావించేవాళ్లమని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, చాలా కంపెనీలు మూత పడ్డాయని తెలిపారు. పెద్ద కంపెనీలు కొత్తగా ఉద్యోగులను తీసుకోవటం లేదని, స్థానికులకు అవకాశాలు రావటం లేదని విమర్శించారు. ఇండస్ట్రియల్ కారిడార్ లో కొత్త కంపెనీలు రావటం లేదు. 

కొత్తగూడెంలో ఉన్న 12 లక్షల మంది ప్రజల అభివృద్ది కోసం మంచి కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. అందులో భాగంగానే రెండు రోజులు ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి జనంబాట నిర్వహిస్తున్నమని తెలిపారు. 

సింగరేణి కార్మికుల సమస్యలపై హెచ్ఎంఎస్, జాగృతి కలిసి పోరాటం చేస్తున్నాయని కవిత చెప్పారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ను ముట్టడిస్తేనే మెడికల్ బోర్డు పెట్టారని గుర్తు చేశారు. కానీ ఆ మెడికల్ బోర్డు కార్మికులను మోసం చేసే విధంగా ఉందని ఆరోపించారు.