పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థాయిని పెంచాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. హైదరాబాద్-వరంగల్ ప్రధాన రహదారిపై ఉన్న ఈ ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల స్థాయికి పెంచాలని కోరారు. జాగృతి జనంబాటలో భాగంగా యాదాద్రి-భువనగిరి జిల్లాలో పర్యటించిన కవిత ఆలేరులోని సీ హెచ్ సీని సందర్శించారు. రోగులు, వైద్యులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాన రహదారిలో ఉన్న ఈ ఆరోగ్య కేంద్రానికి రోజూ ఎన్నో ప్రమాద ఘటన బాధితులు వస్తుంటారని చెప్పారు. అత్యవసర వైద్య సేవలకు అనుగుణంగా ఇక్కడ వసతులు లేవని తెలిపారు. నిధులు మంజూరైనా ఎందుకు ఆసుపత్రిని అభివృద్ధి చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయడం అభినందనీయమన్నారు. పడకలు సరిపోకున్నా వరండాలో వసతి ఏర్పాటు చేసి రోగులకు వైద్యం చేస్తున్నారని చెప్పారు. సిబ్బంది అంకితభావానికి ప్రభుత్వ సహకారం తోడైతే రోగులకు మంచి వైద్యం అందుతుందని కవిత అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నేతలు సుజిత్ రావు, సయ్యద్ ఇస్మాయిల్, శివారెడ్డి, నరేశ్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.