నైతికత లేని బీఆర్ఎస్
ఆ పార్టీ రాజ్యాంగం ఒక జోక్
తెలంగాణ కోసం కుటుంబాన్ని వదిలి కష్టపడ్డా
నా పోరాటం ఆస్తుల కోసమంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది
శాసన మండలిలో కవిత ప్రసంగం
భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న కవిత | హైదరాబాద్
బీఆర్ఎస్ అప్రజాస్వామ్య పద్ధతులు, అణచివేత ధోరణికి విసుగు చెంది ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఒక వ్యక్తిగా ఇక్కన్నుంచి వెళ్తున్నాను..మళ్లీ ఓ శక్తిగా తిరిగి చట్టసభల్లో అడుగుపెడతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురయ్యాక తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత సోమవారం తెలంగాణ శాసన మండలి సమావేశాలకు హాజరయ్యారు. 4 నెలల కింద తన పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ ను కోరారు. ఈ సందర్భంగా తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించారు. సుమారు 34 నిమిషాల పాటు సాగిన కవిత ప్రసంగంలో కొన్నిసార్లు ఉద్విగ్నానికి గురయ్యారు.
తెలంగాణ అస్థిత్వ పోరాటం
” ఏ బీఆర్ఎస్ పార్టీ ద్వారా పదవి వచ్చిందో ఆ పార్టీలోనే నేను చేయాల్సిన పనులకు కట్టుబాట్లు ఎదురయ్యాయి. అలాంటి సందర్భంలో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిలో కొనసాగటం నైతికత కాదు. నేను 20 ఏళ్లుగా ప్రజా జీవితంలోనే ఉన్నాను. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ గార్ల స్ఫూర్తితో అందరిలాగే నేను ఉద్యమంలోకి 2006 లో వచ్చాను. అప్పటికే టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీగా ఎదిగింది. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారు. అయినా సరే నేను సొంతంగా జాగృతి అనే సంస్థ ద్వారా పోరాటం ప్రారంభించాను. మహిళలను, యువ మిత్రులను ఉద్యమంలోకి తీసుకొచ్చే అనేక కార్యక్రమాలు చేశాను. మన పండుగ గౌరవం కాపాడాలని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించే కార్యక్రమాలు చేశాను. బతుకమ్మ మన ఆత్మగౌరవ ప్రతీకగా ముందుకు వెళ్లాం. ప్రత్యేక పరిశోధక బృందాన్ని ఏర్పాటు చేసి 3 వేల ఏళ్ల తెలంగాణ చరిత్ర సాక్ష్యాలతో పుస్తకాలను వెలువరించాం. అప్పుడు మీడియాలో, సినిమాల్లో తెలంగాణ యాస, భాషకు జరుగుతున్న అవమానంపై ఫైట్ చేశాం. అప్పటి పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ మహనీయుల చరిత్ర లేకపోవటాన్ని ప్రశ్నించాం. అప్పటి శ్రీ కృష్ణకమిటీకి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వివరాలు ఇచ్చాం. శ్రీ కృష్ణ కమిటీ ఫైనల్ రిపోర్టులో కూడా మేము చెప్పిన అంశాలు నిజమేనని చెప్పింది. అంతే కాకుండా 8 ఏళ్ల పాటు బాలికల హక్కులు, గిరిజన హక్కుల కోసం ఫైట్ చేశాం. తెలంగాణలో ఉన్న సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు రావాలని కూడా పోరాటం చేశాం.”

తెలంగాణ రాష్ట్ర సాధనలో నా పాత్ర
” 2004 ఆగస్టులో అమెరికా నుంచి నేను వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వచ్చాను. కేసీఆర్ స్ఫూర్తితో ఎంతో మంది తమ ఉద్యోగాలకు రిజైన్ చేసి అప్పటికే ఉద్యమంలోకి వచ్చారు. వారి లాగే స్ఫూర్తి పొంది నేను కూడా ఉద్యమంలోకి వచ్చాను. ఆ తర్వాత మనందరం కూడా పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం పోరాటం చేశాం. 2013, 2014 తెలంగాణ ఉద్యమంలో కీలక సంఘటనలు జరిగాయి. తెలంగాణ కోసం మాట్లాడాలంటూ పిలిస్తే కుటుంబ సమేతంగా మేమంతా ఢిల్లీ వెళ్లాం. అక్కడ రెండు నెలల పాటు మమ్మల్ని ఏ కాంగ్రెస్ నాయకుడు పలుకరించలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్లు, ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు కూడా తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటన్నది చెబుతున్నా. గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ తెలంగాణ కోసం నేను ఉద్యమం చేశాను. ఢిల్లీలో రెండు నెలల పాటు కాంగ్రెస్ నాయకులు పట్టించుకోని సందర్భంలో ఫెర్నాండెజ్ గారితో కేసీఆర్ గారికి మీటింగ్ ఏర్పాటు చేయించాను. ఆ మరుసటి రోజే సోనియాగాంధీ ఒక్కరోజులోనే ఏడెనిమిది సార్లు సంప్రదింపులు జరిపారు. 2013 ఆగస్ట్, సెప్టెంబర్ లో మనమంతా కూడా నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్లు భయపడుతూ ఉన్నాం. ఆంధ్రా లాబీ కారణంగా తెలంగాణ ఏర్పాటు ఎక్కడ ఆగిపోతుందోనని భయపడ్డాం. దీపం చుట్టూ చేతులు పెట్టి కాపాడుకున్నట్లు తెలంగాణ ఏర్పాటు ఆగిపోకుండా కాపాడుకున్నాం. ఆ తర్వాతే పార్లమెంట్ లోని రెండు సభల్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యింది. అందులో నా పాత్ర కూడా ఉంది.”
ఎంపీగా శక్తిమేర కృషి
“తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనంపై చర్చ జరిగినప్పటికీ విలీనం కాలేదు. బీఆర్ఎస్ ఇండిపెండెంట్ గానే పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. నిజానికి నేను ఓ ఇంటర్నేషనల్ ఎన్జీఓను నడపాలని అనుకున్నానే తప్ప రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లే నాకు పిలిచి నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. ఏ మహిళైనా సరే పిల్లలను వదిలి రాజకీయాల్లోకి రావాలంటే ఆలోచిస్తుంది. నాలుగు నెలల పాటు నా జీవిత భాగస్వామితో చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా టికెట్ అడుక్కొని గెలవలేదు. నిజామాబాద్ లో మొత్తం ఎమ్మెల్యే స్థానాలు కూడా బీఆర్ఎస్ గెలిచింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినప్పుడు తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఉంటుందని సంతోషపడ్డాం. ఆ తర్వాత కూడా విభజన అంశాలపై, హైకోర్టు సాధించుకోవటానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల కోసం పోరాటం చేశాం. ఏ రోజు కూడా నేను పదవులు, రాజకీయం కోసం వెళ్లలేదు. నాకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో నా శక్తికి మించి పనిచేసేందుకు కృషి చేశాను. పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వే లైన్ 30 ఏళ్లు పెండింగులో ఉంటే ఎంపీ అయ్యాక ఆ రైల్వే లైన్ ను పూర్తి చేయించాను.”
స్వరాష్ట్రంలో బతుకమ్మకు ఆటకాలు
“జాగృతి పేరుతో 8 ఏళ్ల పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాం. కానీ తెలంగాణ ఏర్పడిన మొదటి బతుకమ్మ 2014 నుంచే నా మీద ఆంక్షలు మొదలయ్యాయి. ఒక పార్టీలో అంతర్గతంగా ఆంక్షలు ఏ విధంగా ఉంటాయో చెబుతాను. మొదటి రోజు నుంచే నన్ను కట్టిడి చేస్తూ నా భావ ప్రకటనను హరించారు. నా వద్దకు ఎప్పుడు కూడా పెద్దవాళ్లు, కాంట్రాక్టర్లు పనుల కోసం రాలేదు. అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, సింగరేణి కార్మికులు, టీచర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చేవారు. వారందరికీ కూడా నావంతుగా ఎంత వీలైతే అంత వారికోసం పనిచేశాను. పార్టీ ఛానెల్ గానీ, పార్టీ పేపర్ గానీ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. అయినా ధైర్యంతో ముందుకు వెళ్లాను. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతో దేశానికి, తెలంగాణకు నష్టమని కేసీఆర్ అన్నారు. కానీ తెలంగాణ వచ్చాక కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయకపోగా పెంచి పోషించారు. ప్రశ్నించటం నేర్పిన బీఆర్ఎస్ పార్టీయే నేను ప్రశ్నిస్తే నాపై కక్ష గట్టింది. కక్ష గట్టి కుట్ర చేసి మరీ నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. రాష్ట్ర స్థాయి నిర్ణయాల్లో ఎప్పుడు కూడా నా పాత్ర లేదు. ధర్నా చౌక్ ను తీసేయాలని నిర్ణయించినప్పుడు నేను ప్రశ్నించా. తెలంగాణ వచ్చాక ధర్నా చౌక్ ఎందుకు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి బేడీలు వేయటం బాధగా అనిపించింది. పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా. అమరజ్యోతి, సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, కలెక్టరేట్ల నిర్మాణంలో అవినీతి జరిగింది నిజం. సిద్ధిపేట, సిరిసిల్ల లో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయాయి. అక్కడే అలాంటి పరిస్థితి ఉంటే ఇంకా మిగతా వాటి గురించి ఏమీ చెప్పేది? నిజాన్ని సూటిగా మాట్లాడితే నన్ను నిర్లక్ష్యం చేశారు.”
ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్యం
“తెలంగాణ ఉద్యమకారుల పట్ల కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. వారికి న్యాయం చేయాలని…అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షలు సాయం చేయాలని కోరాను. 48 లక్షల మంది పెన్షన్లు ఇస్తామని గర్వంగా చెప్పుకుంటాం. కానీ లక్ష మంది ఉద్యమకారులకు మాత్రం కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేదు. 1969 ఉద్యమకారులను కూడా కనీసం గుర్తించలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న మన ట్యాగ్ లైన్ కు గండికొట్టుకుంటూ పోయాం. కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న అవినీతిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు లేవు. ఇసుక దందాల కారణంగా నేరెళ్ల లాంటి దురాగతాలు జరిగాయి. నేరెళ్ల ఘటనపై అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవటం లేదు. 10 ఏళ్లలో 100 సార్లు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కోసం అడిగాను. కానీ నిర్లక్ష్యం చేసి భోదన్ బిడ్డలకు అన్యాయం చేశారు. కేసీఆర్ కూతురిగా ఆయనను అడిగే ధైర్యం నాకు ఉంది. ఒకటి, రెండు అడిగినవి చేయకపోయినా పర్వాలేదు. కానీ కొంతమంది వరుసగా దురాగతలకు పాల్పడినా సరే పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలన్న నిర్ణయాన్ని నేను ఒప్పుకోలేదు. తెలంగాణలో ఏమీ పీకి కట్టలు కట్టామని దేశంలో పీకుతాం. తెలంగాణలో అవినీతి లేని పారదర్శక విధానాన్ని మనం చూడాలనుకున్నాం. అది జరగలేదు. లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు కడితే కేవలం కొత్తగా 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. అదే డబ్బులతో 25 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇవ్వవచ్చు. తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు పనులు చేసిన ఆంధ్రాకు చెందిన కంపెనీ వాళ్లు మాత్రం ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు.”
బీజేపీ దుర్మార్గం
“ఇక తెలంగాణను పదే పదే బీజేపీ మోసం చేస్తున్నది. ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేదు. విభజన హామీలు అమలు చేయలేదు. పైగా ఐటీఐఆర్ రాకుండా చేసి ఇక్కడి యువతకు అన్యాయం చేసింది. తెలంగాణ లో పెట్టుబడులు పెట్టే వారిని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరింది. అలాంటి బీజేపీ పై నేను ఎడతెగని పోరాటం చేశాను. కేసీఆర్ పై కక్షతో నన్ను జైల్లో పెట్టారు. ఆ సమయంలో నాకు పార్టీ అండగా లేదు. ఈడీ, సీబీఐలతో మూడేళ్లు ఒక్క దాన్నే ఫైట్ చేశాను. ఓ పోరాటంలో సహచరులు గాయపడి పడిపోతే భుజాన ఎత్తుకొని వెళ్తారు. కానీ నన్ను వదిలేశారు. అది ఏమాత్రం రాజ్యాంగ స్ఫూర్తి ఉన్న పార్టీ వ్యవహరించే తీరు కాదు. ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఘోష్ కమిటీ అని వేశారు. కేసీఆర్ ను విచారణ అంటూ ఎన్నో మాటలు అంటే ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడడు. అదే కేసీఆర్, కేటీఆర్ లను అంటే మాత్రం పార్టీ నాయకులు విమర్శలు చేస్తారు. పార్టీ అధినాయకుడిపై ఘోష్ కమిటీ అంటే నేను మాత్రమే జాగృతి ద్వారా ఫైట్ చేశాను. నేను హరీష్ రావు పేరు చెప్పిన రెండు గంటల్లో నన్ను సస్పెండ్ చేశారు. ఉరి తీసేవాళ్లను కూడా చివరి కోరిక ఏంటని అడిగే గొప్ప దేశం మనది. కానీ నన్ను మాత్రం అన్యాయం గా పార్టీ నుంచి వెళ్లగొట్టారు. అసలు బీఆర్ఎస్ పార్టీ కానిస్టిట్యూషన్ 8 పేజీలు ఉంటుంది. అది ఒక పెద్ద జోక్. నన్ను సస్పెండ్ చేసేందుకు రాత్రికి రాత్రే డిసిప్లీనరీ యాక్షన్ కమిటీ పుట్టుకొచ్చింది. నోటీసులు ఇవ్వకుండా, నా వివరణ అడగకుండా సస్పెండ్ చేశారు. ఒక పార్టీని నడిపే పద్దతి ఇది కానే కాదు. నా సస్పెన్షన్ పై లీగల్ గా ఛాలెంజ్ చేయవచ్చు. కానీ నైతికత లేని బీఆర్ఎస్ పై ఛాలెంజ్ చేయను. ఆ పార్టీకి దూరమవుతున్నందుకు సంతోషంగా ఉన్నా. నా సస్పెన్షన్ ను వాడుకునేందుకు కాంగ్రెస్ వాళ్లు ఇది ఆస్తుల పంచాయితీ అంటున్నారు. నాకు దైవ భక్తి ఎక్కువ. లక్ష్మీ నరసింహా స్వామి మా ఇంటి దేవుడు. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ దేవుడి మీద, నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా. నాది ఆత్మగౌరవ పోరాటమే.”
మహిళలకేది ప్రాధాన్యం
“ఇక మన రాష్ట్రంలో మహిళా ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. 17 ఎంపీ స్థానాలు ఉంటే ఒక మహిళ ఎంపీ మాత్రమే ఉన్నారు. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే మహిళ ఎమ్మెల్యేలు 8 మంది మాత్రమే. ఇక మండలిలో 40 మందిలో ముగ్గురు మాత్రమే మహిళా సభ్యులు. నేను వెళ్లిపోతే ఇద్దరే ఉంటారు. ఈ రాష్ట్రంలో మహిళల ప్రాతినిథ్యం 0.0003 శాతం మాత్రమే ఉంది. మరి ఆడవాళ్లకు కష్టాలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి. గతంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి.. మహిళలకు సమాన హక్కులు రావాలని అన్నారు. పార్టీలు కూడా రాజ్యాంగాన్ని మార్చుకొని మహిళలను ఎంకరేజ్ చేయాలి. మీరు అవకాశాలు ఇవ్వకపోతే మహిళలకు ఇంకెవరు అవకాశాలు ఇస్తారు? ఇప్పుడు నా దారి వేరైనా సరే నా లక్ష్యం మాత్రం ఒక్కటే. తెలంగాణ ప్రజలు బాగుండాలి. వారి కోసం నేను పనిచేస్తూనే ఉంటా.”
రాజీనామాను ఆమోదించండి
“గత సంవత్సరం సెప్టెంబర్ 3 న నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇచ్చాను.
పూర్తిగా ఛైర్మన్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ ఇచ్చినప్పటికీ మీరు ఆలోచించుకోవాలని కోరారు. నేను పూర్తి కాన్షియస్ గానే నా రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. నా రాజీనామాకు కారణాలను సభలో చెప్పేందుకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉంటే 40 మందికి మాత్రమే పెద్దల సభలో ఉండే అవకాశం ఉంటుంది. ఆ గౌరవం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అదే విధంగా నాకు ఓటు వేసిన నిజామాబాద్ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ వాళ్లు చేసిన తప్పులనే మీరు చేస్తే మాత్రం కచ్చితంగా ప్రజలు మీకు బుద్ది చెప్తారు. నేను నిజం, నైతికత వైపు నిలబడి ఉన్నా. పార్టీలో కొంతమంది సామాన్యులు, ఉద్యమకారుల సమస్యలు కేసీఆర్ కు చేరకుండా అడ్డుగోడ కట్టారు. ఏ పార్టీ అయినా సరే రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేయాలి. బీఆర్ఎస్ ఆ స్ఫూర్తితో లేదు. ఇవ్వాళ సభలో ప్రతిపక్షం లేనే లేదు. భవిష్యత్తులో మేము ప్రజల ఆకాంక్షలను ఫుల్ ఫిల్ చేస్తాం. ఈ సభ నుంచి నేను వ్యక్తిగా వెళ్తున్నా.. భవిష్యత్తులో శక్తిగాచట్టసభకు తిరిగి వస్తాను.”








