మహిళ విద్యావంతురాలైతే ఇంటిల్లిపాదీ విద్యావంతులైనట్లేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలంతా చదువుకుంటే సమాజమే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 

జాగృతి జనంబాటలో భాగంగా సూర్యపేట జిల్లాలో పర్యటిస్తున్న కవిత శనివారం తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి కేజీబీవీని సందర్శించారు.  సావిత్రీబాయి ఫూలే ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేజీబీవీ విద్యార్థినులతో సమావేశమైన కవిత మాట్లాడుతూ దాదాపు రెండు శతాబ్దాల కిందటే మహిళా విద్యకు పోరాడిన సావిత్రీబాయిని ఇప్పటికీ దేశం గుర్తుపెట్టుకుందని చెప్పారు. బాలికలు ధైర్యంగా ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పాటలు పాడి వినిపించారు. భవిష్యత్తులో ఎవరెవరు ఏమి కావాలనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఏ వృత్తిలో ఉన్నా సమాజానికి ఉపయోగపడే పనులు చేసి చిరస్థాయిగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోవాలని సూచించారు. ఈ సందర్భంగా టీచర్లను సత్కరించారు. విద్యార్ధులకు చాక్లెట్లు పంచారు.