దోహాలో నిర్వహించిన ప్రవాస భారతీయ దివస్ లో అవార్డు ప్రదానం చేసిన ఎంబసీ అధికారులు

నందినికి కవిత అభినందనలు

గల్ఫ్ కార్మికులకు అందిస్తున్న సేవలకు గాను ప్రవాస భారతీయురాలు, తెలంగాణ జాగృతి ఖతార్ అడ్వైజరీ ఛైర్ పర్సన్ నందిని అబ్బగౌని ప్రతిష్ఠాత్మక నారీ శక్తి సమ్మాన్ అవార్డుకు ఎంపికైంది. ఖతార్ లోని భారతీయ దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివస్‌ దోహాలోని ఐసీసీ అశోక హాల్‌లో జరిగింది.

ప్రవాసీ భారతీయ దివస్‌ను ప్రతి సంవత్సరం ప్రవాస భారతీయుల సేవలను గుర్తిస్తూ జరుపుకుంటారు. ఈ ఏడాది వేడుకల్లో మహిళల శక్తి అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. భారతీయ సమాజానికి సేవలందిస్తున్న నందిని అబ్బగౌనిని  నారీశక్తి సమ్మాన్ పురస్కారానికి ఎంపిక చేసింది భారత ఎంబసీ. ఖతార్‌లో భారతీయ సమాజానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు ఈ గౌరవం లభించింది. భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆమె పాత్ర ప్రశంసనీయం అన్నారు ఖాతార్ లోని భారత ఎంబసీ అధికారులు.

భారత్–ఖతార్ మైత్రిని బలోపేతం చేయడంలో ఆమె కృషిని గుర్తించామన్నారు. పురస్కారం పొందడం పట్ల నందినిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభినందించారు. ఖతార్ లోని దోహా నగరంలోని ఐసీసీ అశోకా హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ దౌత్య కార్యాలయ అధికారులు, వివిధ రాష్ట్రాల సంఘాల నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు.

మహిళా సాధికారతకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు ప్రవాస భారతీయుల ఐక్యతను చాటాయి.