• వెంటనే వారికి ఋణమాఫీ చేయాలి
  • ప్రజల చేతిలో రాజకీయ అస్త్రంగా జాగృతి

-రైతు సంఘర్షణ సభలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

వందల మంది రైతులతో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం 

పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళనకు

(గద్వాల)

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కి వారిని మోసం చేస్తున్న దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల ఋణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి 15 లక్షల మంది రైతులకు ఋణమాఫీ ఎగ్గొట్టిందన్నారు. రైతు ఋణమాఫీకి సంబంధించిన లెక్కలపై చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల్ పట్ణణంలో జరిగిన రైతు సంఘర్షణ సభలో పాల్గొని ఆమె మాట్లాడారు. నడిగడ్డ సీడ్ పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రావల్సిన బకాయిలను ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా రైతులకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ ఇవ్వకపోతే గద్వాల్ లో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రైతులతో కలిసి దీక్ష చేపడతామన్నారు. రైతులకు కరెంట్, యూరియా సప్లయ్ చేయటం కూడా ప్రభుత్వానికి చేతకావటం లేదని ఎద్దెవా చేశారు. యూరియా కోసం యాప్ లో బుక్ చేసుకోవాలని ప్రభుత్వం రూల్ పెట్టటాన్ని ఆక్షేపించారు. ముందు రైతులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ఆ తర్వాత యాప్ లో బుక్ చేసుకునే విధానం తేవాలన్నారు. రైతు భరోసాను ఈ ముఖ్యమంత్రి ఎన్నికల కోసం ఇచ్చే గిఫ్ట్ చేసేశారంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందు రైతు భరోసా వేస్తామంటూ నిసిగ్గుగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రభుత్వానికి రైతులు గుర్తు వస్తున్నారన్నారు. అటు అడవిలో అన్నలకు, ఇటు రైతన్నలకు మాత్రమే అందరూ భయపడతారని గుర్తు చేశారు. ఐతే అన్నలను కేంద్రం అమానవీయంగా చంపుతుంటే…రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా ఇబ్బంది పెడుతోందని కవిత విమర్శించారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని…రైతన్నలను తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు.  రైతన్నలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Farmers gather in Gadwal demanding loan waiver and pending dues

నడిగడ్డ ప్రజలకు మోసం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్.

గద్వాల్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని కవిత ఎద్దెవా చేశారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని ఆమె గుర్తు చేశారు. రాజకీయాలు చేయాలంటే నిజాయితీ, ధైర్యం ఉండాలన్నారు. దమ్ముంటే గద్వాల్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని వ్యక్తి ప్రజలకు ఏమీ మంచి చేస్తారో ఆలోచించాలని అన్నారు. ఇక నడిగడ్డకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. తుమ్మిళ్ల, నెట్టంపాడు పనులను చూస్తుంటే నత్తలు కూడా సిగ్గుపడుతాయని ఎద్దెవా చేశారు. కృష్ణ, తుంగభద్ర నదులు మనల్ని దాటుకొని వెళ్తున్నా సరే ఇక్కడి ప్రజలకు నీళ్లు రావటం లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. ఇలా అయితే నడిగడ్డ రైతు ఎప్పుడు బాగుపడేదని ప్రశ్నించారు. 

ప్రభుత్వాన్ని నిలదీసే వజ్రాయుధమవుతాం

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేందుకు త్వరలోనే పార్టీతో మీ ముందుకు వస్తున్నానని మీ ఆశీర్వాదం కావాలంటూ ప్రజలను కోరారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తున్నానని అది ప్రజలకు వజ్రాయుధం అవుతుందని కవిత అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జాగృతి నేత గవినోళ్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో వడ్డెపల్లి మున్సిపాలిటీని గెలుచుకున్నామని…గద్వాల్ నుంచే జాగృతి జైత్రయాత్ర మొదలైందని చెప్పారు. ఎవరు గెలిచినా సరే వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లే పిచ్చి రాజకీయాలు జిల్లాలో నడుస్తున్నాయని విమర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మూటలతో వస్తారని…వాళ్లు ఇచ్చింది తీసుకుని ప్రజల కోసం పనిచేసే వాళ్లకే ఓటు వేయాలని కవిత పిలుపునిచ్చారు. మీ నెత్తికొట్టి  సంపాదించిన సొమ్మును కచ్చితంగా తీసుకోండని ప్రజలకు సూచించారు. గద్వాల్ లో అత్త, అల్లుడే కాకుండా కొత్త నాయకత్వం రాబోతుందని అన్నారు. నడిగడ్డ ప్రజల కోసం పోరాడుతున్న నడిగడ్డ పోరాట హక్కుల సమితి ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ ను ఆశీర్వదించాలని కోరారు. 

Police stop farmers at Gadwal Collectorate during protest

కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

రైతు సంఘర్షణ సభ అనంతరం రైతుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు పెద్ద ఎత్తున రైతులు వెంట రాగా కవిత కలెక్టరేట్ కు బయలు దేరారు. అయితే కలెక్టరేట్ లోపలకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు కలెక్టరేట్ గేట్ కు తాళం వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కవిత సహా రైతులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం రైతులతో కలిసి కలెక్టరేట్ లోకి వెళ్లి కలెక్టర్ సంతోష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.