250 గజాల స్థలం ఇవ్వకపోతే భూ పోరాటాలు తప్పవు .
ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్.| జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ అన్నారు. ముఖ్యంగా ఉద్యమకారులకు ఇస్తానన్న 250 గజాల భూమిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాగృతి కార్యాలయంలో శనివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇస్తానన్న 250 గజాల స్థలం విషయంలో ఇప్పటికే కవితక్క కరీంనగర్ లో భూపోరాటం ప్రారంభించారని గుర్తు చేశారు. మిగతా జిల్లాల్లో కూడా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఉద్యమకారులు గుర్తించాలని కోరారు. తప్పకుండా కవితక్క ఆయా ప్రాంతాలకు వచ్చి భూ పోరాటం చేసి ఉద్యమకారులకు స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటారన్నారు. అదే విధంగా ఉద్యమకారులకు న్యాయం చేసే విషయంలో కవితక్క చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు జరిగిన అన్యాయన్నే ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని రూప్ సింగ్ మండిపడ్డారు. ఉద్యమకారుల సమస్యల విషయంలో రాష్ట్రంలోని అన్ని ఉద్యమకారుల సంఘాలతో కలిసి జాగృతి పనిచేస్తుందన్నారు. తెలంగాణలో ఉద్యమంలో పాల్గొని ఆగమైన యూనివర్సిటీ విద్యార్థులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఉద్యమకారులు కోరారు. తప్పకుండా వారందరికీ కవితక్క అండగా ఉంటారని రూప్ సింగ్ భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల పోరాట సమితి స్టేట్ సెక్రటరీ అనిల్ కుమార్, మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. మల్లేశ్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారస్వామి, తెలంగాణ ఉద్యమాలు-మన తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమకారుల జేఏసీ వైస్ ప్రెసిడెంట్ సాజీదా బేగం, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు గుండా యాదగిరి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు భోగె పద్మ, తెలంగాణ ఉద్యమ నాయకులు కె. జానకీ రెడ్డి, కుతాడి రవికుమార్, ప్రసన్న, ధనలక్ష్మీ, వనజ తదితరులు పాల్గొన్నారు.









