తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ | హైదరాబాద్

ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వీరభద్రరావు మండిపడ్డారు. సోమవారం బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో టీజేటీఎఫ్ కోశాధికారి ఘనపురం దేవేందర్, రాష్ట్ర నాయకులు ఎస్ కే మస్తాన్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. 2023 జులైలో ఇవ్వాల్సిన డీఏ ను ఇప్పుడు ప్రకటించి ఉద్యోగులకు ఏదో చేశామని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పెండింగులో ఉన్న మిగిలిన డీఏలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఉద్యోగులకు డీఏ ఇవ్వడం వారి హక్కు మాత్రమే తప్ప ఎలాంటి అదనపు ప్రయోజనం కాదు అన్న విషయం గుర్తించాలన్నారు. ఉద్యోగులకు రూ. 1కోటి ప్రమాద బీమాపై స్పష్టత ఇవ్వాలని, ప్రీమియం ఎవరు చెల్లిస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకుండా, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇవ్వడం లాంటి కీలక సమస్యలను పక్కన పెట్టి ఒక్క డీఏతో సరిపెట్టడం తగదన్నారు. వెంటనే ఉద్యోగుల అన్ని సమస్యలు  పరిష్కరించాలని డిమాండ్ చేశారు .