మీడియా సమావేశంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, కామెర నవీన్ కుమార్ | బంజారాహిల్స్–తెలంగాణ జాగృతి కార్యాలయం

బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని జాగృతి నాయకులు హెచ్చరించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో సోమవారం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్ సింగ్, నీటిపారుదల అధ్యయన కమిటీ సభ్యుడు కామెర నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్, ఎత్తరి మారయ్య, సురేందర్ జీ, డి. వీరన్న, శ్రీనివాస్ రావు, కోటేశ్వర్ రావు తదితరులు మీడియాతో మాట్లాడారు.

Telangana Jagruthi leaders warning RS Praveen Kumar

అధికారిగా అక్రమ దందాలు – ఎల్. రూప్ సింగ్

“ఈమధ్య బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కవితమ్మ పట్ల అనుచితంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు ఆయన చరిత్ర మొత్తం తెలుసు. గతంలో ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, తప్పుల నుంచి బయట పడేందుకే తన పదవికి రాజీనామా చేసిండు. మాయావతి కాళ్లు పట్టుకొని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, దళిత నాయకుడుగా రాష్ట్రంలో పార్టీకి గుర్తింపు తెస్తాడని నమ్మి మాయావతి ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక బీఆర్ఎస్ ను నోటికొచ్చినట్లు విమర్శించాడు. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ లోనే చేరి బీఎస్పీని నట్టేట ముంచాడు. ఇప్పుడు బీఆర్ఎస్ లో నమ్మదగిన వ్యక్తిగా కొనసాగుతున్నట్లు చేస్తున్నాడు. మాజీ ఐపీఎస్ గా, దళిత నేతగా బీఆర్ఎస్ కు మేలు చేస్తాడని బీఆర్ఎస్ కూడా నమ్ముతున్నది. కానీ గురుకులాల సెక్రటరీగా ఉండి ఆస్తులు కూడగట్టుకోవటానికి ఆయన అక్రమాలు, దందాలు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కవితమ్మ మీద విమర్శలు చేస్తున్నాడు. గాంధీ భవన్ నుంచో రేవంత్ రెడ్డి నుంచో వచ్చిన స్క్రిప్టును కవితమ్మ చదువుతున్నారంటు ఆయన కామెంట్లు చేస్తున్నారు. కానీ కవితమ్మకు ఆ ఖర్మ పట్టలేదు. ఆమె తెలంగాణ కోసం 20 ఏళ్లు పోరాటం చేసింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు ఆమె చేసిన కృషి తెలంగాణ ప్రజల ముందుంది. ప్రజలలో కవితకు వస్తున్న ఆదరణ చూడలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రాపకం కోసం మీరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నా.”

Press conference at Telangana Jagruthi office Banjara Hills

మెంటల్ బ్యాలన్స్ కోల్పోయిన ఆర్ఎస్ – కామెర నవీన్ కుమార్

“ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ వర్గం నుంచి వచ్చారో ఆ వర్గం బిడ్డలను ఎన్ కౌంటర్లు చేసి వాళ్ల రక్తం కళ్లచూసిండు. అయిన సరే గురుకులాల సెక్రటరీగా బడుగులు, ఎస్సీ, ఎస్టీల కోసం మంచి చేశారన్న గౌరవం మీ మీద ఉండేది. ఐపీఎస్ హోదాను అడ్డుపెట్టుకొని మీరు చేసిన అక్రమాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఒక ఎంపీ కూడా మీ మీద కేంద్రానికి కంప్లైంట్ చేశారు. దానిపై విచారణ జరిగితే అడ్డంగా దొరకటం ఖాయమని మీకు అర్థమైంది. ఏదైనా రాజకీయ అండ దొరికితే గానీ తప్పించుకోలేనని అర్థం చేసుకున్నారు. తనను తాను రక్షించుకోవటానికి లక్నోకు పోయి బీఎస్పీ అధినేత మాయావతి గారి కళ్లు పట్టుకొని బీఎస్పీలో చేరారు. కానీ దాన్ని కూడా తన త్యాగం అని చూపించుకునే ప్రయత్నం చేశారు. బీఎస్పీ అధ్యక్షుడిగా ఉండి సిర్పూర్ లో గెలిచేది నేనేనంటూ బిల్డప్ ఇచ్చారు. కానీ మీరు మూడో స్థానానికి పరిమితమై కనీసం ప్రజాదరణ పొందలేకపోయారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ నమ్మిన సిద్ధాంతం ఉంటే కాస్తయినా ప్రజాదరణ దక్కేది. రాజకీయ అవసరాల కోసం బీఎస్పీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు. బీఎస్పీలో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులను నీచాతి నీచంగా మాట్లాడారు. ఇప్పుడు అదే నోటితో మళ్లీ వాళ్లను పొగుడుతున్నారు. మీ రాజకీయ బాసులను రక్షించుకునేందుకు ఏమైనా మాట్లాడుకోండి. తప్పులేదు. కానీ ఈ క్రమంలో తెలంగాణ కోసం 20 ఏళ్లు ధారబోసిన కల్వకుంట్ల కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. గతంలో ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైల్లో ఉండి కవిత మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని వ్యాఖ్యనించారు. కానీ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయింది మీరే. ఐపీఎస్ అధికారి అయ్యిండి ఇంకో ఐపీఎస్ అధికారి మీద చేసిన వ్యాఖ్యలతో మీరే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినట్లు అర్థమవుతోంది. మీరు ఆరోపణలకు నోటీసులు ఇస్తే నేను ఫలానా వ్యక్తిని నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు అని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. వ్యవస్థను విమర్శించానని మీరు అంటున్నారు. అంటే మీరు చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పుకునే దమ్ము మీకు లేదు. అదే విధంగా నిన్న ఓ టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ కవితను రేవంత్ రెడ్డి ఆడిస్తున్నారని అంటున్నారు. ఖబడ్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మాట్లాడేది తెలంగాణ ఉద్యమ నాయకురాలి మీద అన్న విషయం మర్చిపోకండి. తెలంగాణ స్వీయ రాజకీయ అస్థిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ జాగృతి అనే గొప్ప రాజకీయ వేదికను కవిత ఏర్పాటు చేయబోతున్నారు. రాజకీయ అవసరాల కోసం మీరు గతంలో బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. రేపు ఏ పార్టీలో ఉంటారో గ్యారంటీ లేదు. సిర్పూర్ లో మళ్లీ కొనేరు కోనప్ప బీఆర్ఎస్ లో చేరారు. దీంతో మీకు అచ్చంపేట్ టికెట్ ఇస్తామంటే మీ క్యాడర్ ద్వారా సిర్పూర్ అంటూ నినాదాలు చేయించారు. సిర్పూర్ టికెట్ నీకు గ్యారంటీ లేదు. అందుకే రేపు బీజేపీ, కాంగ్రెస్ కు వెళ్లవనే గ్యారంటీ లేదు. బీఆర్ఎస్ లో మాత్రం నీకు పుట్టగతులు లేకుండా పోయాయన్నది వాస్తవం. అందుకే బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతానన్నట్లుగా ఇండికేషన్ ఇప్పించావ్. ఐపీఎస్ గా చేసిన అక్రమాల నుంచి తప్పించుకునేందుకు రాజీనామా చేశావ్. ఇప్పుడు నీ సీటుకోసం సొంత పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నావ్. గతంలో మేము తెలంగాణ ఉద్యమం చేస్తుంటే నీవు యూనివర్సిటీలో పిల్లలను కొట్టావ్. హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిగా ఉండి ఏం చేశారో కూడా మొత్తం తెలంగాణ సమాజానికి తెలుసు. గురుకులాలకు మంచి చేశారన్న పేరున్నప్పటికీ స్వేరో అనే ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నారన్న విమర్శలున్నాయి.. అయినా సరే వాటి లోతుల్లోకి మేము వెళ్లటం లేదు. రాజకీయంగా చేసే విమర్శలు హుందాగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఆడబిడ్డ మీద మాట్లాడేప్పుడు ఇంకా హుందాగా మాట్లాడాలి. కేసీఆర్, కేటీఆర్ ప్రాపకం కోసం మీరు ఏం మాట్లాడినా సరే మీకు సిర్పూర్ సీటు రాదు. మరొకసారి కవిత గారిపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే మాత్రం జాగృతి ఊరుకోదని హెచ్చరిస్తున్నాం.”