సోయిలేని రేవంత్ సర్కార్

సాగు నీళ్లు కాదు అసలు తాగు నీళ్లకే దిక్కు లేని పరిస్థితి తెచ్చారు

కాళేశ్వరంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ల రాజకీయ డ్రామాలు

ఎగ్గొట్టటం, ఎదురుదాడి చేయటమే ఈ ప్రభుత్వ విధానం

గుంటనక్కలే నన్ను బీఆర్ఎస్ నుంచి పంపిచేశాయి

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కోరుట్లలో పాంచజన్య సంకల్ప సభ

టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ సీనియర్ నేత డాక్టర్ రఘు

(తెలంగాణ రక్షణసేన, కోరుట్ల)

అధర్మంపై యుద్ధానికి ముందు పాంచజన్యం పూరించిన శ్రీ కృష్ణుడి స్ఫూర్తితోనే  పేదల కోసం ఐదు కీలక అంశాలను పెట్టుకొని పాంచజన్యం పేరుతో రాజకీయ ప్రస్థానాన్ని  కొనసాగిస్తున్నానని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ముందుచూపు లేని రేంత్ సర్కార్ ను అడుగడుగునా ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదివారం డాక్టర్ రఘు బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ రక్షణసేనలో చేరిన సందర్భంగా జరిగిన పాంచజన్యం సంకల్పసభలో కవిత మాట్లాడారు. కోరుట్లలో డాక్టర్ రఘు సహా చాలా మంది సీనియర్ నేతలు టీఆర్ఎస్ లో చేరటం సంతోషంగా ఉందన్నారు. రఘు చేరికతో కోరుట్లలో టీఆర్ఎస్ కు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉండగా కొత్త పార్టీ అవసరముందా అనే ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుందని, కానీ ఉన్న పార్టీలు మనకు కావల్సిన పనులు చేసుంటే కొత్త పార్టీ అవసరమే ఉండేది కాదన్నారు.

ముందుచూపు లేని సర్కార్

భారత దేశాన్ని జంబూ ద్వీపం అంటారని, జంబూ అంటే నేరేడు పండు అని అర్థమన్నారు. 

ఈ ఏడాది నేరేడు విరగకాసిందని, నేరేడు విరగకాస్తే కరవు వస్తుందని సంకేతమని కవిత వివరించారు. ఏడు నెలల క్రితమే సూపర్ ఎల్ నినో వస్తుందని వాతావారణ నిపుణులు హెచ్చరించారని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఏ మాత్రం ముందస్తు ఏర్పాట్లు చేయలేదని, ఇప్పటికే మన దగ్గర 40 శాతం లోటు వర్షపాతం ఉందని చెప్పారు. గోదావరి నదిపై 57 రిజర్వాయర్ల ద్వారా 418 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉంటే 93 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ ప్రభుత్వానికి నీళ్లు, వ్యవసాయం మీద ఏ మాత్రం సోయి లేదని విమర్శించారు. ప్రభుత్వ తప్పిదం కారణంగా మెట్ పల్లి, కోరుట్లలో 2,500 ఎకరాల్లో పంటలు నష్టపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఏడో ప్యాకేజ్ పూర్తి చేయకపోవటంతో ఇబ్రహీంపట్నంలో వేల ఎకరాలు నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని నిందిస్తూ ఇటీవలే ఒక రైతు సూసైడ్ చేసుకున్నాడని, రేవంత్ రెడ్డి  మాటలకు ఒక రిటైర్డ్ ఇంజినీర్ వెక్కి వెక్కి ఏడ్చాడని గుర్తు చేశారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా మనం నీళ్లను ఎత్తిపోసుకోవచ్చని కవిత చెప్పారు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కారణంగా భద్రాచలం మునిగిపోతుందని ముఖ్యమంత్రి అంటున్నాడని చెప్పారు. ఆయనకు నీళ్ల సోయి లేకనే భద్రాచలం మునిగిపోతుందని చెప్పారని ఎద్దెవా చేశారు. రాముల వారి మీద ఒట్టు అని రేవంత్ ఇటీవల మాట్లాడాడని, ఆయన ఆ ఒట్టు పెట్టాడంటే అది ఫట్టే అన్నారు. ఈయన రాముల వారి కల్యాణం రోజు రాముల వారిని దండం పెట్టుకుని డబ్బులు అడిగితే దేవుడే భయపడ్డాడని కవిత చెప్పారు. డబ్బుల సంగతి తర్వాత లక్ష్మణా.. ముందు మన చెప్పులు దాచి ఉంచు అని చెప్పాడని ఎద్దెవా చేశారు. అంటే మన ముఖ్యమంత్రి వస్తే చెప్పులు కూడా దాచుకునే పరిస్థితి ఉందన్నారు. 

Kalvakuntla Kavitha addressing the Telangana Rakshana Sena Panchajanya Sankalpa Sabha in Korutla, Jagityal district

అందరి ఆమోదంతోనే పార్టీ

తాను బీఆర్ఎస్ లో ఎప్పుడైతే అవినీతి సహా బీసీల గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే తనపై కుట్ర చేశారని కల్వకుంట్ల కవిత తెలిపారు. కొన్ని గుంటనక్కలు ఓర్వలేక కుట్ర చేసి తనను బయటకు పంపారని మండిపడ్డారు. ఏ ఆడబిడ్డ అయినా సరే పుట్టినిట్లు, మెట్టినిల్లు, రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకుంటుందని చెప్పారు. కానీ అవినీతిని మాత్రం సహించదని, అవినీతి గురించి మాట్లాడగానే పార్టీ నుంచి పంపించేశారని వివరించారు. అప్పుడు తాను ఇంట్లోనే ఉండాలా.. ప్రజలకు సేవ చేయాలా అని ఆలోచించానని తెలిపారు. చాలా మంది అంతర్జాతీయ ప్రముఖులతో మాట్లాడనని, ఆ తర్వాతే రాజకీయంగా సేవ చేయాలని ముందుకు వచ్చానన్నారు. ఎవరి కోసం పార్టీ పెట్టాలనుకున్నానో వాళ్లందరినీ కూడా అడిగానని కవిత తెలిపారు. అందరూ తెలంగాణ రాకముందు తమ బతుకు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని చెప్పారని వివరించారు. 

చాలా మందికి తెలంగాణ రాకముందు వచ్చిన ఆదాయమే వస్తున్నదని.. కానీ పప్పులు, ఉప్పులు ఇలా అన్నింటి రేట్లు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరి జీవితాల్లో మార్పు రావాలన్న సంకల్పంతోనే పార్టీ పెట్టానని వెల్లడించారు. 

విద్య, వైద్యం మా ప్రాధాన్యం

పేద, మధ్యతరగతి వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉచిత విద్య అనేది మనకు కావల్సి ఉందని తెలిపారు. ఇప్పుడు కూడా ఉచిత విద్య ఉందని..కానీ విద్యార్థులు ఉంటే టీచర్లు ఉండరు.. టీచర్లు ఉంటే విద్యార్థులు ఉండని పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులు చెట్టు కింద కూర్చొని పొద్దు తిరుగుడు పువ్వులా తిరిగి అవస్థ పడుతున్నారని వివరించారు. ప్రభుత్వ విద్య సరిగా లేకపోవటంతోనే ఎంత పేదవారైనా సరే తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలోనే చదివిపిస్తున్నారని వెల్లడించారు. కానీ ప్రైవేట్ లో భారీగా ఫీజులు వసూలు చేస్తుండడంతో  పేదవారిపై భారం పడుతున్నదని తెలిపారు. అందుకోసమే ఎంత పెద్ద స్కూళ్లో చదివినా  ఫీజు టీఆర్ఎస్ ప్రభుత్వమే కడుతుందని మాట ఇచ్చారు. ఇక ప్రభుత్వ వైద్యం విషయం కూడా అంతేనని, సూది ఉంటే దూది ఉండదు.. దూది ఉంటే సూది ఉండదులా మారిపోయిందన్నారు. ఎంత పెద్ద జబ్బైనా సరే తమ ప్రభుత్వం ఉచిత వైద్యం అందించి ఎంత ఖర్చైనా సరే ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. నేను ఉచిత విద్య, వైద్యం ఇస్తానని అనగానే అన్ని పార్టీల్లో ఉన్న అన్నలంతా ఎక్కడి నుంచి ఇస్తావంటున్నారని కవిత చెప్పారు. మీరు అవినీతిని బంద్ చేస్తే చాలు ఉచిత విద్య, వైద్యం అందించవచ్చని వెల్లడించారు. ఇప్పుడున్న బడ్జెట్ లోనే ఉచిత విద్య, వైద్యం అందించవచ్చని స్పష్టం చేశారు. 

ఉపాధి లక్ష్యంగా యువతకు ఋణాలు

 యువతకు తెలంగాాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదని కవిత మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు కూడా ఖర్చుల కోసం వాళ్ల తల్లితండ్రుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాను మాత్రం మన యువతను నమ్ముతానని.. వాళ్లు ఒక్క ఐడియాతో వస్తే వాళ్లకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు వారికి ఋణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక గూగుల్, అమెజాన్, మైక్రోసాప్ట్ లాంటి సంస్థలు స్థాపించేలా చేస్తామని ప్రకటించారు. పెద్ద పెద్ద సంస్థలు స్థాపించిన వారంతా గొప్పవాళ్లేమీ కాదని, వాళ్ల దేశంలో ఆయా ప్రభుత్వాలు వాళ్లను ప్రోత్సహిస్తేనే వాళ్లు ఎదిగారని తెలిపారు. ఇక ఈ ప్రభుత్వం రైతులను కూడా మోసం చేస్తున్నదని, వాళ్లకు ఇచ్చింది తక్కువ, ఎగ్గొట్టింది ఎక్కువ అన్నట్లు ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడని, కానీ 50 శాతం రైతులకు అసలు ఇప్పటికీ ఋణం మాఫీ కాలేదన్నారు. రైతులంటే ప్రభుత్వానికి అంత చులకనగా ఉందన్నారు. వారికి యూరియ కోసం యాప్ పెట్టారని, మనం కొట్లాడితే ఇప్పుడు మీ-సేవ అంటున్నారని కవిత వెల్లడించారు. అంటే రైతులు ఎద్దు, ఎవుసం ఇడిచి పెట్టి మీ-సేవకు పోవాలా అని ప్రశ్నించారు. అందుకే తమ ప్రభుత్వం వస్తే రైతును రాజు చేసి చూపిస్తామని ప్రకటించారు. ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రైతుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 

ఎమ్మార్వో, ఆర్డీవో, పోలీస్ స్టేషన్ ఎక్కడైనా రైతుల కోసం ప్రత్యేక కౌంటర్ ఉంటుందని తెలిపారు. పాంచజన్యంలో ఐదో అంశం సామాజిక న్యాయమని కవిత తెలిపారు. సమాజంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలనేది టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమన్నారు. ఈ ప్రభుత్వం ఫ్రీ బస్ అని మహిళలకు పెట్టినప్పటి నుంచి బస్సును బస్టాండ్ లో కాకుండా కొంత దూరంలో ఆపుతున్నారని తెలిపారు. బస్టాండులో బస్ కోసం వేచి చూస్తున్న వికలాంగులకు ఇబ్బంది అవుతున్నదన్నారు. వికలాంగులకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 

బీసీలకు రేవంత్ అన్యాయం

బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం తెలంగాణ రక్షణసేన పోరాడుతున్నదని కవిత తెలిపారు. తాము రైల్ రోకో చేస్తే 42 శాతం కల్పిస్తామన్నారని వివరించారు. కానీ ఆ బిల్లు ముందుకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయటం లేదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బర్త్ డేలకు, తరచూ ఢిల్లీకి వెళ్లే రేవంత్ రెడ్డి…బీసీ బిల్లు కోసం మాత్రం ఢిల్లీకి వెళ్లటం లేదని విమర్శించారు. తాము ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పోరాటం చేస్తామని, వారి నిధులు వాళ్ల కోసమే ఖర్చు చేయాలని టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నదని వెల్లడించారు. ఇక లంబాడాలు లేని మొదటి కేబినెట్ 70 ఏళ్లలో రేవంత్ ప్రభుత్వమేనని ఇది సిగ్గుచేటన్నారు. మైనార్టీల కోసం కూడా తాము పోరాటం చేస్తామని, క్రిస్టియన్ల కోసం ప్రత్యేక వింగ్ ఉన్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని కవిత తెలిపారు. గతంలో ముస్లింలు చాలా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్లని, కానీ ఇప్పుడు వాళ్ల కుటుంబంలో ప్రతి ఒక్కరూ పనిచేస్తే గానీ కుటుంబం బతకలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. ముస్లింలు రాజకీయంగా, ఆర్థికంగా సాధికారిత సాధించాల్సిన అవసరముందన్నారు. తాము పార్టీ ప్రారంభించగానే చాలా మంది ముస్లింలు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ కొనసాగించేందుకు కలిసి పోరాటం చేద్దామన్నారు. ముస్లింలను టీఆర్ఎస్ పార్టీలోకి ఇంకా పెద్ద ఎత్తున రావాలని ఆహ్వానించారు. సామాజిక న్యాయం కోసం మనమంతా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదీ అడిగినా ఎగ్గొట్టటం, ఎదురుదాడి చేయటమే తమ విధానంగా పెట్టుకున్నారని కవిత ఆరోపించారు. కచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే టీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని కోరారు. 

కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్ లోకి వెళ్లను

తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ లోకి వెళ్లేది లేదని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కోరుట్ల సభ అనంతరం ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ రక్షణసేన వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా నిలబడుతుందని అన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులు, నదీ జలాల విషయంలో ఏమాత్రం సోయి లేని ముఖ్యమంత్రి పాలనలో ఉండటం తెలంగాణ చేసుకున్న దురదృష్టం అన్నారు.

Telangana Rakshana Sena chief Kalvakuntla Kavitha addresses the Panchajanya Sankalpa Sabha in Korutla.

కవితమ్మ ఓటమికి కేటీఆర్ కుట్ర

-డాక్టర్ రఘు

నిజామాబాద్ లోకసభ నియోజకవర్గంలో కవితమ్మను ఓడించింది స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని టీఆర్ఎస్ లో చేరిన డాక్టర్ రఘు అన్నారు. తన ఎంపీ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కానీ అదే ఎంపీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలు కవితమ్మను  ఓడించే కుట్ర చేశారని విమర్శించారు. వారి వెనుక కేటీఆర్ కూడా ఉన్నాడని ఆరోపించారు. అప్పటి నుంచే కవితమ్మను పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కవితమ్మకు సొంత పార్టీ వాళ్లే అన్యాయం చేశారని రఘు తెలిపారు. కానీ కవితమ్మ ఒక ఫైటర్ గా నిరుత్సాహపడకుండా పోరాటం చేస్తున్నారని తెలిపారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఆయన కొడుకు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్, కేటీఆర్ రైతులకు, యువతకు చేసిన అన్యాయం కారణంగా కోరుట్ల నియోజకవర్గం నష్టపోయిందని  అన్నారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కొందామని వారు ప్రయత్నించారని చెప్పారు. వారి కారణంగానే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కాక ఎంతో మందికి ఉపాధి లేకుండా పోయిందని విమర్శించారు. నిజానికి ఆ కుటుంబానికి చిత్తశుద్ధి ఉంటే ముత్యం షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడో ప్రారంభం కావాలని చెప్పారు. గెలిచిన వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించకపోతే ఉరి వేసుకోని చస్తా అని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు దాని ఊసే లేదన్నారు. షుగర్ ఫ్యాక్టరీ వచ్చి ఉంటే ఇక్కడి యువతకు 4 వేల మందికి ఉపాధి దొరికేదని రఘు చెప్పారు. ఉపాధి లేక ఈ ప్రాంతంలోని యువత 40 వేల మంది గల్ఫ్ కు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల కోసం హాస్పిటల్ తెస్తామని చెప్పి దాన్ని కూడా పట్టించుకోలేదన్నారు. విద్యాసాగర్  గెలుపు కోసం కవితమ్మ ఎంత కృషి చేశారో అందరికీ తెలుసన్నారు. కవితమ్మ ఇక్కడకు వస్తే మన బీడీ కార్మికులకు హాస్పిటల్ రావటంతో పాటు చెరుకు ఫ్యాక్టరీ కూడా ఓపెన్ అవుతుందని తెలిపారు. ఆమె సొంతంగా పార్టీ పెట్టుకుంటే కూడా వాళ్లకు నిద్ర పట్టటం లేదన్నారు. కవితమ్మ టీఆర్ఎస్ పార్టీ కారణంగా తమ పార్టీ ఎక్కడ భుస్థాపితం అవుతుందోనని వెయ్యి మందితో ఈసీకి కంప్లైంట్ చేయించారని రఘు అన్నారు. తెలంగాణ రావడానికి కేసీఆర్ తర్వాత కవితమ్మ అంతే కష్టపడ్డారని తెలిపారు. కానీ 12 ఏళ్లలో తెలంగాణలో యువతకు ఉద్యోగాలు లేని, అభివృద్ధి లేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందన్నారు. దాని గురించి ప్రశ్నిస్తే కవితమ్మను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినా సరే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రక్షణసేన ఏర్పాటు చేశాని వివరించారు. ఎక్కడ కష్టాలుంటే అక్కడ ఆమె పోరాటం చేస్తున్నారని తెలిపారు. సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు అయ్యిందంటే కవితమ్మ పోరాట ఫలితమేనన్నారు.