ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రభుత్వం కూలడం ఖాయం

ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడుతాం

గ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పేట్ వేసి ఆహ్వానిస్తున్నరు

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్ మాల్

-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్)

ఎప్పుడు కడతారో తెలియని ఇంటిగ్రేటేడ్ స్కూళ్ల కోసం గ్రామాల్లోని స్కూళ్లను మూసేసే కుట్ర చేస్తున్నారని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పైగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లలో గోల్ మాల్ జరిగిందని విమర్శించారు. సోమవారం మీడియాకు పంపిన సందేశంలో కవిత విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చేస్తున్న అవకతవకలపై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. విద్యా కమిషన్ రిపోర్ట్ పేరుతో 27 వేల స్కూళ్లను 4 వేలకు కుదించే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. దీన్ని తెలంగాణ రక్షణసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉందని గుర్తు చేశారు. తాజాగా యంగ్ ఇండియా ఇంట్రిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో ఒక్కో స్కూల్ కు రూ.146 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని వివరించారు. మొత్తం 72 స్కూళ్లకు గాను సగానికి పైగా మేఘా, కేఎంవీ అనే సంస్థలకే ఇచ్చారని చెప్పారు. వాళ్లు 5 శాతం ఎక్సెస్ కోట్ చేయటంతో ప్రభుత్వంపై 6 వందల కోట్లకు పైగా భారం పడనున్నదని కవిత తెలిపారు. 72 స్కూళ్ల కోసం దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం తెలిపిందన్నారు. కానీ వచ్చే రెండున్నరేళ్లలో ఈ స్కూళ్ల నిర్మాణం పూర్తి అవటం సాధ్యం కాదని వివరించారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి కనీసం మూడేళ్లకు పైగా పడుతుందని తెలిపారు. పైగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం బాధ్యత రెండు సంస్థలకే ఇచ్చారని వెల్లడించారు. అంటే స్పష్టంగా టెండర్లలో రింగ్ అయ్యారని తెలిసిపోతున్నదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీకి చెందిన వెలుగు పేపర్ లోనే ఈ విషయాన్ని రాశారని గుర్తు చేశారు. టెండర్లలో జరిగిన గోల్ మాల్ పై ముఖ్యమంత్రి కచ్చితంగా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.

ఆ రెండు సంస్థలకే టెండర్లు

రెవెన్యూ డివిజన్ లో స్కూల్ నిర్మిస్తే మళ్లీ విద్యార్థులు వెళ్లేందుకు బస్సులు పెట్టాల్సి వస్తుందని కవిత చెప్పారు. ఆ బస్సులను కూడా ప్రభుత్వం మేఘా సంస్థకే ఇస్తారని స్పష్టంగా తెలుస్తున్నదని చెప్పారు. బడ్జెట్ స్కూళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వాటిని చంపేస్తున్నారని విమర్శించారు. ప్రతి ఊళ్లో గుడి ఎంత ముఖ్యమో బడి కూడా అంతే ముఖ్యమని కవిత చెప్పారు. కానీ స్కూళ్లు ప్రారంభమై నెల గడిచినప్పటికీ  యూనిఫాం డ్రెస్సులు పంపిణీ చేయలేదని విమర్శించారు. ఇక మధ్యాహ్న భోజనంలో పెట్టే గుడ్డుకు ఆరు రూపాయలే ఇస్తున్నారని తెలిపారు. బయట గుడ్డు రేటు 8 రూపాయలు ఉందని తెలిపారు. ప్రభుత్వం మూడు రోజులు కాకుండా ఐదు రోజులు గుడ్డు పెట్టాలని, గుడ్డు ధరను 8 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. పిల్లలకు పెడతామన్న బ్రేక్ ఫాస్ట్ కూడా పెట్టడం లేదన్నారు. మొత్తంగా తెలంగాణ గ్రామాల్లోకి రెడ్ కార్పేట్ వేసి కార్పోరేట్ స్కూళ్లను ఆహ్వానిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేస్తామంటే తెలంగాణ రక్షణసేన ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని కవిత హెచ్చరించారు. మొత్తం స్కూళ్లను కుదిస్తామని చెబుతున్నారని, మరి ఉన్న టీచర్లను ఏం చేస్తారు.. కొత్తగా టీచర్ల రిక్రూట్ మెంట్ చేయరా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల జోలికి వస్తే ప్రజలు ఈ ప్రభుత్వాన్నే పడగొడుతారని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో ఎక్కడో, ఏదో ఊర్లో స్కూల్స్ పెడితే ఆడ పిల్లలు నష్టపోతారని చెప్పారు. వారి తల్లితండ్రులు దూరంగా ఉండే స్కూళ్లలో పిల్లలను చేర్పించరని, అందుకే ఊళ్లలోనే స్కూళ్లు ఉండాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు దీని కోసం పోరాడాలని కవిత పిలుపునిచ్చారు.