విద్యార్థుల రక్తం చూసిన బీజేపీకి బుద్ధి చెప్పాలి

నీట్ పేపర్ సరిగా నిర్వహించటం చేతకాక విద్యార్థులపై దాష్టీకమా?

అది ప్రపంచం ముందు భారత్ తలదించుకునే ఘటన

-తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, బంజారాహిల్స్)

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. 

విద్యార్థినులను రోడ్లపై పరుగెత్తించి రక్తం వచ్చేలా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆందోళన చేపడితే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. ఈ సంఘటనతో ప్రపంచ దేశాల ముందు భారత్ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెచ్చారని యూనియన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ ఎగ్జామ్ సరిగా నిర్వహించడం చేతగాని కేంద్ర సర్కార్ విద్యార్థులపై జులుం ప్రదర్శించిందని కవిత విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీతో 25 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని, 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. ఈ సంఘటనలకు బాధ్యత ఎవరిదన్నారు. విద్యార్థుల చావులకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు.  విద్యార్థులపై పోలీసుల దాష్టీకం చూసి దేశం మొత్తం నిశ్చేష్టంగా మారిందన్నారు. విద్యార్థులు చిందించిన ప్రతి రక్తం బొట్టుకు, వారిపై విరిగిన లాఠీలకు దేశం మొత్తం కచ్చితంగా ఓటు రూపంలో జవాబు చెబుతుందని కవిత స్పష్టం చేశారు. చనిపోయిన 21 మంది విద్యార్థులకు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ చేసిన వాళ్లను గుర్తించి వాళ్లపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలన్నారు. విద్యార్థులు లేకుండా ఏ దేశం ముందుకు సాగడం కష్టమని చెప్పారు. అలాంటి విద్యార్థులను చావబాదిన మీకు కచ్చితంగా దేశ ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.