కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు హరీశ్ కుట్ర
మంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రా వ్యాపార సంస్థలతో రూ. వేల కోట్ల పాల వ్యాపారం
గుంటనక్క, గుంపు మేస్త్రీ మధ్య లండన్ లో లలూచీ
లండన్ మీటింగ్ వివరాలు ఒక్కొక్కటిగా బయటపెడతాం
అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంధ్రా రేవంత్ రెడ్డి
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :
బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్క (హరీశ్ రావు) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన మాదిరిగా కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు హరీష్ రావు తెరవెనుక కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. మెదక్ ఎమ్మెల్యేలతో ఇటీవలే రహస్య మంతనాలు సాగించాడని…కేసీఆర్ వారసత్వం కేటీఆర్ కు రావద్దని వారితో అన్నాడని చెప్పారు. అటు బీజేపీతోనూ, ఇటు గుంపు మేస్త్రీ తోనూ హరీష్ రావుకు లాలూచీ ఉందన్నారు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్రా ఏజెంట్ గా మారడని విమర్శించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల బాగు కోసం పనిచేయకుంటే ఊరుకోమని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునే కుట్ర
చేరదీసి రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు హరీష్ రావు సిద్ధమయ్యాడని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కపెడుతూ బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవాలని కుట్ర చేస్తున్నాడన్నారు. తాను ఏదీ ఆధారాలు లేకుండా మాట్లాడనని…ఇటీవలే మెదక్ జిల్లా ఎమ్మెల్యేలలతో హరీష్ రహస్య మంతనాలు నిర్వహించాడని కవిత చెప్పారు. ఆ సమావేశంలో ఉన్న ఎమ్మెల్యే ఒకరు తనకు ఈ విషయాలు చెప్పారన్నారు. ఎన్టీఆర్ మాదిరిగానే కేసీఆర్ గొప్ప వ్యక్తి అని కానీ కేసీఆర్ వారసత్వం కేటీఆర్ కు రావద్దని ఆ మీటింగ్ లో హరీష్ రావు కామెంట్లు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునేందుకు అటు గుంపు మేస్త్రీతో ఇటు బీజేపీ తో దోస్తానా చేస్తున్నాడన్నారు. బీజేపీ తో హరీష్ రావు దోస్తీకి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయన్నారు. రాజ్ పుష్ప స్కైవాక్ ఓపెన్ విల్లాస్ లో బీజేపీ ముఖ్యనేతతో హరీశ్ రావు తరచూ సమావేశం అవుతున్నారన్నారు. పాలల్లో పసుపు, మిరియాలు వేసుకోని తాగే ఆ నేత గురించి గూగుల్ చేస్తే తెలిసిపోతుందన్నారు. ఆయనతో మీటింగ్ ఉన్న రోజు హరీష్ రావు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నాడని చెప్పారు. ఇప్పుడు తాను బీఆర్ఎస్ లో లేనని ఆ పార్టీ ఎటు పోయిన సరే తనకు సంబంధం లేదని కవిత అన్నారు. కానీ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న గుంటనక్క గురించి ప్రజలకు తెలియాలనే ఈ విషయం బయటకు చెబుతున్నానన్నారు.
లండన్ లో గుంటనక్క, గుంపు మేస్త్రీ లాలూచీ
బీజేపీ తో మాత్రమే కాకుండా గుంపు మేస్త్రీతోనూ ఈ గుంటనక్కకు లాలూచీ ఉందన్నారు. ఇటీవలే వీళ్లు లండన్ లో రహస్యంగా సమావేశమై అగ్రిమెంట్ చేసుకోని లాలూచీ పడ్డారని చెప్పారు. ఒకవేళ గుంటనక్కతో గుంపు మేస్త్రీకి ఎలాంటి లాలూచీ లేకపోతే ఆయన్ను క్విడ్ ప్రో కో కింద అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. హరీశ్ రావు హెల్త్ మినిస్టర్ గా ఉన్న సమయంలో నారాయణ, చైతన్య కాలేజీలకు నెలకు రూ. 5 కోట్ల పాలు పోశారన్నారు. 8 ఏళ్ల పాటు ఆ రెండు సంస్థల ద్వారా రూ. 960 కోట్లు దండుకున్నారన్నారు. అంతేకాకుండా కామినేని, యశోద, కిమ్స్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కు కూడా పాలు సరఫరా చేశారన్నారు. ఇదంతా క్విడ్ ప్రో కో కిందకు రాదా అని కవిత ప్రశ్నించారు. గతంలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అంశంలో హరీష్ పేరు ఎత్తిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. కచ్చితంగా వీరి మధ్య లండన్ లో లలూచీ అయ్యిందన్నారు. ఆ లాలూచీ కి సంబంధించిన వివరాలను టీఆర్ఎస్ తరఫున ఒక్కొక్కటిగా బయటపెడతానని కవిత చెప్పారు.

రేవంత్ రెడ్డి ఆంధ్రావాళ్ల చేతిలో బందీ
అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రావాళ్ల చేతిలో బందీ అయ్యారని కవిత మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఆంధ్రా ఏజెంట్ గా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మణ పరిషత్ కు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ను ఆంధ్రావాళ్లను నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మణ పరిషత్ ఛైర్మన్ గా ఉన్న బసవరాజు శ్రీనివాస్ అనే వ్యక్తి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అన్నారు. తెలంగాణను ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ బ్రహ్మణులలో అర్హులు లేరా అని ప్రశ్నించారు. తెలంగాణ వాదులను, దళితులను ఇష్టానుసారంగా తిట్టిన వ్యక్తికి బ్రహ్మణ పరిషత్ ఛైర్మన్ పదవి ఇచ్చి దాన్ని రౌడీలకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. అటు యాదగిరి గుట్ట బోర్డు మెంబర్లలో ఆంధ్రా హీరో భార్యకు పదవి కట్టబెట్టారని విమర్శించారు. తెలంగాణ వాళ్ల పైసలతో కట్టిన గుడిలో ఆంధ్రావాళ్లకు పెత్తనం ఎలా ఇస్తారన్నారు. జనసేనకు చెందిన ఓ ఎంపీ కుమారుడు 6 కోట్ల కారు వేసుకుని ఒడిశాకు చెందిన 25 ఏళ్ల అమ్మాయిని గుద్ది చంపితే ముఖ్యమంత్రి పట్టించుకోలేదని కవిత గుర్తు చేశారు. ఆతని మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తండ్రి పేరు లేదని, అందులో ఎన్నో కాలమ్ లు ఖాళీగా పెట్టారని మండిపడ్డారు. వేరే కేసులలో కూడా ఇదే విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని, డీజీపీని ప్రశ్నించారు. ఇలాంటి డొల్ల ఎఫ్ఐఆర్ ను నమోదు చేసినందుకు పోలీసులు సిగ్గుపడాలని కవిత వ్యాఖ్యానించారు. అదే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ప్రగతి భవన్ బారికేడ్లను గుద్దితేనే అతని జీవితాన్ని ఆగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణకు చెందిన మైనార్టీ నాయకుని కుమారుడైనందుకే అలా చేశారన్నారు. కానీ ఆంధ్రా నాయకుల కొడుకు యాక్సిడెంట్ చేస్తే పట్టించుకోరా అని నిలదీశారు.
అంతటా ఆంధ్రా పెత్తనమే
రెడ్ కో ఛైర్మన్ గా, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ గా అటు ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లలో కూడా ఆంధ్రా పెత్తనమే ఉందన్నారు. బయోకాన్ లో తెలుగు మాట్లాడినందుకు 2 వందల మందిని తీసేస్తే ఈ ముఖ్యమంత్రి మాట్లాడడని కవిత అన్నారు. తెలంగాణ జలాలు ఆంధ్రా నాయకుల దోచుకుంటే కూడా ముఖ్యమంత్రికి సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ కూడా కాంట్రాక్టులన్నీ ఆంధ్రా వాళ్లకే ఇస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రా ఏజెంట్ గా మారారన్నారు. తెలంగాణ ఇందుకోసమో తెచ్చుకున్నామా అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం అమెరికా టూర్ కు కేంద్రం పర్మిషన్ ఇవ్వకపోతే ఆయనకు తెలంగాణ గుర్తుకు వచ్చిందన్నారు. కానీ తెలంగాణకు ఇన్ని నష్టాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే వెంటనే బ్రహ్మణ పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు గా తెలంగాణ వారిని నియమించాలన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి పనిచేయాలని సూచించారు.
వ్యవస్థీకృత నేరాలు చేసిన బీఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ పూర్తిగా కాంప్రమైజ్ అయ్యిందని కవిత అన్నారు. పాల వ్యాపారం కోసం హరీష్ రావు, ఆంధ్రా దోస్తులు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందని ఇక తామే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అంటోందని కవిత చెప్పారు. కానీ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిందని కవిత చెప్పారు. ఇరిగేషన్, పాలు వ్యాపారం ఒకరు, రియల్ ఎస్టేట్ ఒకరు, ఇసుక దందాను ఒకరు పంచుకున్నారన్నారు. నేరాలను వ్యవస్థీకృతంగా చేసిన బీఆర్ఎస్ కు మళ్లీ అవకాశం ఇద్దామా అంటూ ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని చెప్పారు. పారదర్శకమైన, అవినీతి లేని, కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు తాము వచ్చామని కవిత చెప్పారు. తమ పార్టీకి అవకాశం ఇస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తామని చెప్పారు.








