కేంద్రం ముందు రేవంత్ సర్కార్ మోకరిల్లింది

ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్ల ఏర్పాటు నిర్ణయం ఉపసంహరించుకోవాలి

-తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ముందు రేవంత్ రెడ్డి సర్కారు మోకరిల్లిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గృహ విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ఉచిత కరెంట్ ను ఎత్తివేసే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. సోమవారం ఈమేరకు వీడియో సందేశం రిలీజ్ చేశారు. అనంతరం పీపుల్స్ ప్లాజాలో టీజీఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసిన పవర్ ఎక్స్ పో – 2026ను సందర్శించి అక్కడ ప్రదర్శనకు ఉంచిన స్మార్ట్ మీటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కరెంట్ ను దూరం చేయడంతో పాటు లాండ్రీ షాపులు, సెలూన్లకు ఉచిత కరెంట్ ఎత్తివేసే కుట్రలో భాగంగానే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకంలో భాగంగానే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. గతంలో వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రయత్నం రేవంత్ సర్కారు చేసిందన్నారు. అదానీకి లాభం చేయడానికి కేంద్రం స్మార్ట్ మీటర్లు ప్రవేశ పెడుతుంటే రేవంత్ సర్కారు దానికి వంత పాడుతోందన్నారు. దీనిపై ప్రజల మైండ్ వాష్ చేసేందుకే పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శన ఏర్పాటు చేసిందన్నారు.

ఈఆర్సీ వద్ద రైతులు గొడవ చేస్తే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయబోమని చెప్పారని.. గృహ విద్యుత్ కనెక్షన్లకు మాత్రం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని ఇటీవల ట్రాన్స్ కో సీఎండీ చెప్పారని గుర్తు చేశారు. సెల్ ఫోన్ ముందస్తుగా రీచార్జ్ చేసుకున్నట్టుగా ఇకపై కరెంట్ కు ముందస్తు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి స్మార్ట్ మీటర్లతో వస్తుందన్నారు. రీచార్జ్ ఎప్పుడు అయిపోతే అప్పుడు ఆటోమేటిక్ గా ఇండ్లలో కరెంట్ కట్ అవుతుందని చెప్పారు. యూపీలో స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు ఏర్పాటు చేస్తే ప్రజలు ఆగ్రహంతో వాటిని తొలగించి కరెంట్ ఆఫీసుల్లో పడేసి వెళ్తున్నారని అన్నారు. ఇప్పుడున్న మీటర్లతోనే కరెంట్ సరఫరా చేయాలని స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ లు, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసి కరెంట్ సరఫరా బాగుండేలా చర్యలు చేపట్టాలని కోరారు. మన కరెంట్ ను అదానీ చేతుల్లో పెట్టే ప్రయత్నాలను ఇకనైనా విరమించుకోవాలన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తుందని.. ప్రజల కోసం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

అవినీతి అధికారులు సరే.. అవినీతికి మూలకారకుల సంగతేంది?

గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి రూ.వేల కోట్లు కొల్లగొట్టిన అధికారుల గుట్టును ఏసీబీని ఉపయోగించి బయట పెడుతున్న ప్రభుత్వం ఆ అవినీతికి మూల కారకుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో సోమవారం పోస్ట్ పెట్టారు. గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు వందలు, వేల కోట్ల ప్రజాధనం దోచుకోవడానికి వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న వారి సంగతి ఏమిటని ప్రశ్నించారు. అధికారులను ముందు పెట్టి రూ.వేల కోట్లు దోచుకుంటున్న వారి నుంచి ఆ అవినీతిని సొమ్ము కక్కించే వాళ్లు ఎవరు అని నిలదీశారు. అవినీతికి అధికారులను బాధ్యులను చేస్తున్నారని.. వారిని అడ్డుపెట్టుకొని వ్యవస్థలను దోపిడీ చేసే వారిని కట్టడి చేయాల్సిన వాళ్లెవరని ప్రశ్నించారు. తమకు మంచి చేస్తారని నమ్మి ప్రజలు అధికారం ఇస్తే భవిష్యత్ తరాలకు చెందాల్సిన సంపదను కొల్లగొడుతున్న వారిని చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. తన ప్రశ్నలపై పౌర సమాజం సీరియస్ గా చర్చించాలని విజ్ఞప్తి చేశారు.