ప్రతి ఊరికి సామాజిక తెలంగాణ న్యాయ స్ఫూర్తిని తీసుకెళ్లాలి

ప్రతి గడపకూ పాంచజన్య పథకాలను చేర్చాలి

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) : 

ప్రతి ఊరికి సామాజిక న్యాయ తెలంగాణ సంకల్పాన్ని తీసుకెళ్లాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బుధవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం ఆచార్య జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ప్రతిజ్ఞ తీసుకున్నామని తెలిపారు. సామాజిక న్యాయ తెలంగాణ స్ఫూర్తిని ఇప్పుడు ప్రతి గ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో అత్యధిక జనాభా ఉన్న వాళ్లు అట్టడుగున బతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ సమానత్వం ఎందుకు అందని ద్రాక్షగా మారిందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు.

సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని అన్నారు. మొదటి దశలో అన్ని మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలు నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత ప్రతి గ్రామంలో సభలు నిర్వహిస్తామని తెలిపారు. పార్టీ ప్రధాన ఎజెండా అయిన పాంచజన్య పథకాలను ప్రతి గడపకు చేర్చాలని పిలుపునిచ్చారు. సాధించుకున్న భౌగోళిక తెలంగాణను సబ్బండ వర్గాల అభివృద్ధి, వికాసం, సాధికారత సాధించిన తెలంగాణగా సుసంపన్నం  చేసుకుందామని అన్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తరహాలో మళ్లీ ఉద్యమించాలని.. అందుకోసం పార్టీ క్యాడర్ సమాయత్తం కావాలని అన్నారు. కార్యక్రమంలో  రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.