కృష్ణాను చెరబట్టిన ఏపీ గోదావరిని కొల్లగొట్టాలని కుట్రలు చేస్తున్నది
జీఆర్ఎంబీ మీటింగ్ వేదిక తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నాలు
ఇప్పటికే అనుమతులిచ్చిన ఏడు ప్రాజెక్టుల పర్మిషన్ లను రివ్యూ చేయాలనడం దుర్మార్గం
ఇంత జరుగుతున్నా నది జలాల పంపిణీపై అవగాహన లేని ముఖ్యమంత్రి గప్ చుప్ గా ఉంటున్నాడు
టీఆర్ఎస్ ప్రశ్నించే వరకూ అధికార, ప్రతిపక్షాలకు సోయే లేదు
-తెలంగాణ రక్షణసేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :
కృష్ణా నదిని చెరబట్టిన ఏపీ ఇప్పుడు గోదావరి నీళ్లను కొళ్లగొట్టేందుకు కుట్రలు చేస్తోందని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు చేసిన అన్యాయం చాలదన్నట్లుగా రాష్ట్రం వీడిపోయిన తర్వాత కూడా కూడా ఏపీ నాయకులు అవే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నదిలో 273 టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకునేందుకు ఏపీ కుట్రలు చేస్తోందన్నారు. ఈ నెల 18 న గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్ వేదికగా తెలంగాణ నీటి హక్కులను లాక్కునే కుట్రలకు తెరలేపిందని అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా నీళ్ల వాటా విషయంలో ఏపీ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు గతంలో ఎప్పుడో ఇచ్చిన ఏడు ప్రాజెక్ట్ ల అనుమతులను కూడా రివ్యూ చేసి రద్దు చేయాలంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖలు రాసిందని చెప్పారు. ఇంత జరుగుతుంటే నీళ్ల విషయంలో సోయి లేని ప్రభుత్వం, నదీ జలాల పంపిణీ పై అవగాహన లేని ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండిపోయారని అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సైతం ఈ అంశంలో గప్ చుప్ అయ్యిందని మండిపడ్డారు. ఏపీ కుట్రలను పది రోజుల క్రితమే గమనించి తమ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ముందుగా హెచ్చరించారని నవీన్ చెప్పారు. ఆ తర్వాత సోయిలోకి వచ్చిన బీఆర్ఎస్ తామే ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉండి కృష్ణా నీళ్లను ఏపీ ప్రభుత్వం దోచుకెళ్తుంటే కిక్కురుమనని బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మరని చెప్పారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎంతదూరమైన కొట్లాడుతామని, క్రెడిట్ చోరీ ప్రయత్నాలు చేయకుండా నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేస్తామని నవీన్ చెప్పారు.
తెలంగాణ నీటి హక్కులపై ఏపీ కుట్రలు
నీటి హక్కుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం మళ్లీ పావులు కదుపుతోందని నవీన్ మండిపడ్డారు. గతంలో తెలంగాణకు చేసిన అన్యాయం చాలదన్నట్లుగా మళ్లీ అవే కుట్రలు చేస్తున్నారని వివరాలతో సహా బయటపెట్టారు. గతంలో కృష్ణా నీళ్లలో పెద్ద ఎత్తున అన్యాయం చేస్తే ఇప్పుడు గోదావరి నీళ్లపై కన్నేశారన్నారు. గోదావరి నదిలో 273 టీఎంసీల నీళ్లపై అక్రమంగా హక్కులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నవీన్ చెప్పారు. ఇందుకోసం ఈ నెల 18 న జరగనున్న గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్ వేదికగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ నీటి హక్కులను లాక్కునేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. పైగా గతంలో ఎప్పుడో తెలంగాణ ప్రాజెక్ట్ లు ఏడింటికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖలు రాసిందని ఆయన చెప్పారు. తుమ్మిడి హెట్టి, కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం, చౌట్ పల్లి హన్మంత రెడ్డి ప్రాజెక్ట్, చనాకా కొరాట బ్యారేజ్, మోడికుంట వాగు, కడెం – గూడెం లిఫ్ట్, సీతమ్మ సాగర్ – సీతారామ ఎత్తిపోతలకు ఇచ్చిన అనుమతులపై రివ్యూ చేయాలని, సమ్మక్క సాగర్ బ్యారేజీకి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలో పేర్కొన్నదని తెలిపారు. వీటిలో చాలా ప్రాజెక్ట్ లు దాదాపు పూర్తయ్యాయని వాటికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ లేఖలు రాసే అధికారం ఏపీకి ఎక్కడిదని ప్రశ్నించారు. పోలవరం, ధవళేశ్వరం ప్రాజెక్ట్ లకు అనుమతులు రద్దు చేయాలని కోరితే ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తుందా అని నిలదీశారు. ఏపీ చెప్పిన అభ్యంతరాలను జీఆర్ఎంబీ తన ఎజెండాలో పెట్టటం అన్యాయమని నవీన్ అన్నారు. ఏపీకి హక్కుగా వచ్చే 480 టీఎంసీ లు వాళ్లు వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని కానీ తెలంగాణ నీటి హక్కులపై పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
ముఖ్యమంత్రి స్పందించకపోవటం దుర్మార్గం
నీళ్ల సోయి లేని కాంగ్రెస్ ప్రభుత్వం, నదీ జలాల పంపిణీ పై అవగాహన లేని ముఖ్యమంత్రిగా కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రంలో కలిసే నీళ్లను ఏపీ వాడుకుంటే నష్టమేమిటని ముఖ్యమంత్రి మాట్లాడటం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. కృష్ణా, పెన్నా బేసిన్ లోని ప్రాజెక్ట్ లకు 250 టీఎంసీలు తరలించేలా ఏపీ ప్రభుత్వం గోదావరి – బనకచర్ల లింక్ చేపడుతుందని, దానికి తెలంగాణ సీఎం వంత పాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని చిన్న ప్రాజెక్టులపై ఏపీ విషం చిమ్ముతుంటే.. మన ప్రభుత్వం ఏపీ అక్రమ ప్రాజెక్టుల విషయంలో ఉదారంగా వ్యవహరించడం మన హక్కులను కాలరాయడమేనన్నారు. ఇన్నాళ్లు గోదావరి నీళ్లను ఎత్తిపోసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మేల్కొని నీళ్లను ఎత్తిపోస్తామని చెబుతోందన్నారు. కానీ ఏపీ చేస్తున్న కుట్రల కారణంగా గోదావరి నదిలో కూడా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయమే మళ్లీ ఇప్పుడు జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఏపీ కుట్రలను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు ఏపీ మాటలు విని తుమ్మడిహెట్టి పై జీఆర్ఎంబీ ఏ విధంగా అభ్యంతరం చెబుతుందని ప్రశ్నించారు. ఏపీ చేస్తున్న అన్యాయన్ని ముందుగా గుర్తించి ప్రభుత్వాన్ని హెచ్చరించింది టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవితేనని గుర్తు చేశారు. తాము హెచ్చరించిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చి రివ్యూ మీటింగ్ లు నిర్వహించటం మొదలు పెట్టారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
క్రెడిట్ చోరీకి బీఆర్ఎస్ యత్నం
తెలంగాణకు ఏపీ ఇంత అన్యాయం చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిన బీఆర్ఎస్ గప్ చుప్ గా ఉందని నవీన్ అన్నారు. పది రోజుల క్రితమే టీఆర్ఎస్ ఈ అంశాన్ని వెలుగులోకి తేవడంతో మేల్కొన్న బీఆర్ఎస్ నాయకులు అప్పుడు ఈ అంశంపై మాట్లాడటం స్టార్ట్ చేశారన్నారు. పైగా తమ కారణంగానే ప్రభుత్వంలో కదలిక వచ్చిందంటూ క్రెడిట్ చోరీకి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కృష్ణా నీటిలో అన్యాయం జరగటానికి బీఆర్ఎస్ కారణం కాదా అని నవీన్ ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పేరుతో పెద్ద ఎత్తున ఏపీ మన నీటిని దోపిడీ చేస్తుంటే ఏడాది పాటు కిక్కురుమనకుండా కూర్చుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. ఏపీ నీటి దోపిడీకి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా వత్తాసు పలుకుతుందన్నారు. బీఆర్ఎస్ క్రెడిట్ చోరీ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఎన్ని డ్రామాలు చేసిన మీ నిజ స్వరూపం ప్రజలకు తెలుసని అన్నారు.
కేంద్రానికి జల విధానం లేదా?
ఏపీ తానా అంటే కేంద్రం తందానా అంటుందని నవీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి గురించి అభ్యంతరం చెబితే జీఆర్ఎంబీ తన అజెండాలో ఆ అంశాన్ని ఎలా పెడుతుందని ఆయన ప్రశ్నించారు. గోదావరి నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారని నిలదీశారు. ఓ వైపు తుపాకుల గూడెం వద్ద నుంచి గోదావరి, కృష్ణా రివర్ లింక్ చేపట్టాలని అంటూనే మళ్లీ ఏపీ చెప్పిన అభ్యంతరాలపై సమాధానం చెప్పాలని ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. అసలు కేంద్రానికంటూ ఒక జలవిధానం లేదా అని నవీన్ అడిగారు. తెలంగాణ నీటి విషయంలో వచ్చే హక్కులను కేంద్రమే కాపాడాలని కోరారు.
తెలంగాణకు అన్యాయం జరగనివ్వం
నీటి హక్కుల విషయంలో ఏపీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమని నవీన్ చెప్పారు. తెలంగాణ ప్రాజెక్ట్ లపై ఏపీ చెప్పిన అభ్యంతరాల మాదిరిగానే ఏపీ ప్రాజెక్ట్ లపై తాము అభ్యంతరం చెబుతామన్నారు. ఒక పార్టీగా అదే విధంగా పౌర సమాజం నుంచి కూడా లక్షలాదిగా కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాస్తామన్నారు. నీటి హక్కుల విషయంలో క్రెడిట్ చోరీ పై దృష్టి పెట్టకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తామన్నారు.








