కార్మికులకు అన్యాయం చేస్తున్న కూనంనేని
ప్రతినెలా మెడికల్ బోర్డు పెట్టాల్సిందే
2 వేల మందిని మెడికల్ అన్ ఫిట్ చేయాల్సిందే
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, బంజారాహిల్స్, హైదరాబాద్)
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల కోసం అప్లయ్ చేసుకున్న 2 వేల మంది అప్లికేషన్స్ పూర్తయ్యే వరకు మెడికల్ బోర్డు ప్రతి నెల నిర్వహించాల్సిందేనని హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ తరఫున కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అటు అలియాస్ పేర్ల అంశాన్ని కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సింగరేణి కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో మెడికల్ బోర్డు పెట్టాలని తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ చేసిన హెచ్చరికలకు గత నెలలో ప్రభుత్వం స్పందించిందని కవిత గుర్తు చేశారు. కానీ ఒక్క నెల మాత్రమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి మళ్లీ ఈ నెల మెడికల్ బోర్డు పెట్టటం లేదన్నారు. ఇలా చేస్తే ఊరుకునేది లేదని తాము ఇదివరకే హెచ్చరించామని చెప్పారు. అలియాస్ పేర్లతో ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న యువమిత్రులు నిరాహార దీక్ష చేస్తే వాళ్ల దీక్షను కూనంనేని సాంబశివరావు విరమింపజేశారని కవిత తెలిపారు. కానీ కార్మిక యూనియన్లు హక్కులు కోల్పోయేందుకు కారణమైన వ్యక్తే కూనంనేని సాంబశివరావు అని విమర్శించారు.
ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆయన అలియాస్ పేర్ల విషయంలో నిరాహార దీక్ష చేపట్టిన యువమిత్రులకు ఏం హామీ ఇచ్చారని ప్రశ్నించారు. వాళ్ల హక్కులను, వాళ్లకు రావాల్సిన ఉద్యోగాలను ఇప్పిస్తారా.. లేదా చెప్పాలన్నారు. అలియాస్ ఉద్యోగాలకు సంబంధించి గతంలో అన్ని యూనియన్ల నుంచి అఫిడవిట్లు ఇస్తే మీరు మాత్రం ఎగ్గొట్టారని విమర్శించారు. ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్న యువమిత్రుల దీక్షను విరమింపజేసి ద్వంద్వ వైఖరి ప్రదర్శించారని ఆరోపించారు. కూనంనేని వైఖరిని కచ్చితంగా సింగరేణి కార్మికులు, యువమిత్రులు గమనిస్తారని హెచ్చరించారు. అలియాస్ పేర్లు ఉండి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న యువమిత్రులు చేస్తున్న దీక్షకు హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ మద్దతు ఉంటుందని కవిత స్పష్టం చేశారు. అదే విధంగా డిపెండెంట్ ఉద్యోగాల కోసం ప్రతి నెల మెడికల్ బోర్డు పెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు.








