కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం

కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నది కవిత  ఒక్కరే

ఆత్మ విమర్శ లేకనే బీఆర్ఎస్ కు ఈ దుర్గతి

-టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి

(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్)

రాష్ట్రంలో అటు అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ లను ప్రశ్నిస్తూ ప్రజల కోసం పనిచేస్తోంది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి చెప్పారు. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా నిర్వహించటం లేదంటూ టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత చేస్తున్న విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నాయన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే కవిత గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దిగజారి వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 31 న నిజామాబాద్ లో టీఆర్ఎస్ నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ లో కవిత గారు మాట్లాడిన అంశాలపై సమాధానం చెప్పటం చేతకాక ఆమె కాంగ్రెస్ కోసం పనిచేస్తుందంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని నవీన్ ఆచారి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై ఈ రాష్ట్రంలో కవిత గారు మాత్రమే పోరాటం చేస్తున్నారని చెప్పారు. కవిత గారి ఆరోపణలపై ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని…దాని వల్ల బీఆర్ఎస్ కే నష్టం జరుగుతుందని నవీన్ ఆచారి చెప్పారు. 

కవిత గారి ఓటమిపై రివ్యూ ఎందుకు చేయలే?

నిజామాబాద్ లో జరిగిన పాంచజన్య సంకల్ప సభలో కవిత గారు చేసిన ఆరోపణలపై రివ్యూ చేసుకోవాల్సిన బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని నవీన్ ఆచారి మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీగా కవిత గారు ఓటమి పాలైనప్పుడు ఓటమికి కారణమేమిటంటూ ఎందుకు రివ్యూ చేసుకోలేదని ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పెద్దలు ఎందుకు రివ్యూ నిర్వహించలేదో చెప్పాలన్నారు. నాటి నుంచే బీఆర్ఎస్ పతనం మొదలైందని ఆ తర్వాత నుంచే ఆ పార్టీకి వరుసగా పరాజయాలు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ప్రశాంత్ రెడ్డి ఇంఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడే కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఓడిపోయారన్నారు. అప్పుడే నిజాయితీగా పారదర్శకంగా రివ్యూ చేసుకోని ఉంటే బీఆర్ఎస్ కు ఈ గతి పట్టి ఉండేదని కాదని నవీన్ ఆచారి చెప్పారు. కవిత గారి ఓటమికి కారణమైన నేతలే ఇప్పుడు ఆమె గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాల్కొండ నుంచి పెద్ద ఎత్తున కవిత గారిపై పోటీ చేసిన రైతులతో ప్రశాంత్ రెడ్డి మాట్లాడి వాళ్లను పోటీ నుంచి ఎందుకు తప్పించలేని నవీన్ ఆచారి ప్రశ్నించారు. కవిత గారు ఓడిపోయిన తర్వాత ఆ రైతులను పార్టీలోకి తీసుకోని వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇప్పించలేదా అని ప్రశ్నించారు. అప్పుడు కవిత గారిని కుట్ర చేసి ఓడించిన వాళ్లే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ కోసం పనిచేస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కవిత గారు మాత్రమే పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, వెలుగుమట్ల బాధితులకు అండగా కవిత గారే ఉన్నారని గుర్తు చేశారు. ప్రజల కోసం పోరాటం చేయాల్సిన బీఆర్ఎస్ ఆ బాధ్యతను మరిచినందుకే బీఆర్ఎస్ ను కవిత గారు ప్రశ్నిస్తున్నారన్నారు. 

కేసీఆర్ మాటకు వ్యతిరేకంగా విమర్శలా?

కవిత గారిని పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాత ఆమె అడిగిన ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో కవిత గారి పాత్ర ఏమీ లేదని స్వయంగా కేసీఆర్ గారే చెప్పిన తర్వాత కూడా నిరంజన్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు లాంటి నాయకులు ఆమెను లిక్కర్ రాణి అంటూ ఎలా సంబోధించారని నవీన్ ఆచారి ప్రశ్నించారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినప్పుడు స్పందించినట్లుగా లిక్కర్ పాలసీ అంశంలో కవిత గారికి పార్టీ ఎందుకు అండగా లేదని ప్రశ్నించారు. ఆ రోజు బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేదీ లేదని కవిత గారు కచ్చితంగా చెప్పటం కారణంగానే ఆమెపై కుట్ర చేసిన కేసులతో ఇబ్బంది పెట్టిన విషయం బీఆర్ఎస్ నేతలకు తెలియదా అని నవీన్ ఆచారి నిలదీశారు. పైగా షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేయటం ఏం న్యాయమన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ కవిత గారికి ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పలేదని మాట్లాడారని…కానీ వారికి నోటీసులు ఇవ్వకుండానే సస్పెండ్ చేశారని తెలుసుకోవాలని సూచించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు చేసిన యాక్సిడెంట్ విషయంలో పోలీసుల అత్యుత్సాహంపై కవిత గారు మాట్లాడారని నవీన్ ఆచారి గుర్తుచేశారు. తప్పును తప్పు అంటూ రాజకీయాలను హుందాగా చేస్తున్న కవిత గారి పై చిల్లర కామెంట్లు చేస్తున్నారన్నారు.ఈ అన్ని అంశాలపై ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది పోయి…ప్రశ్నించిన కవిత గారిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యక్తిగత విమర్శలకు దిగటం సిగ్గుచేటన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ సోషల్ మీడియా దిగజారి వ్యక్తిగత విమర్శలు మాని…రాజకీయంగా ఎదుర్కోవాలని సూచించారు. జెన్ జీ కాలంలో ఇలాంటి చౌకబారు రాజకీయాలను బీఆర్ఎస్ మానుకోవాలన్నారు.

పసుపు బోర్డుతో పైసా ప్రయోజనం లేదు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులను వంచించారన్నారు. పసుపు బోర్డు తో రైతులకు  పైసా ప్రయోజనం లేదన్నారు. ప్రజలను ఏమార్చి గోడకు బోర్డు వేశారే తప్ప ఏమీ చేయలేదన్నారు. నాలుగేళ్లకు ఒకసారి పెరిగే పసుపు ధరను తాము పెంచినట్లు గొప్పలు చెప్పుకుంటారని విమర్శించారు. దమ్ముంటే ఏటా పసుపు రైతులు కోరినట్లు మద్దతు ధర ఇస్తారా చెప్పాలంటూ నిలదీశారు. ఇకనైనా రైతులను మోసం చేసే కుట్రలను అర్వింద్ మానుకోవాలన్నారు.  

నిజామాబాద్ ప్రజల గుండెల్లో కవితమ్మ

నిజామాబాద్ ప్రజల గుండెల్లో కవితమ్మకు సుస్థిరం స్థానం ఉందని నవీన్ ఆచారి అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా తన ప్రాంతానికి ఆమె చేసిన సేవలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరన్నారు. కవిత గారిపై జిల్లా ప్రజలకు ఎంత అభిమానం ఉందో మొన్నటి పాంచజన్య సంకల్ప సభ తో అర్థం చేసుకోవచ్చన్నారు. పార్టీ పెట్టిన 4 నెలల తర్వాత నిజామాబాద్ కు వచ్చిన కవిత గారు సొంత ప్రజలను చూసి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. ఆమె కంటితడి పెట్టుకోవటం చూసి మహిళలంతా ఆవేదన చెందారని చెప్పారు. ఈ అభిమానం ప్రజల గుండె లోతుల నుంచి వచ్చిందని చెప్పారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో పసుపు బోర్డు కోసం, జిల్లా సమస్యలు, తెలంగాణ సమస్యలపై ఆమె అలుపెరగని పోరాటం చేశారన్నారు. అందుకే ఈ ప్రాంత ప్రజలకు కవిత గారిపై ఎనలేని ప్రేమ ఉందన్నారు. పాంచజన్య సంకల్ప సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ నవీన్ ఆచారి కృతజ్ఞతలు చెప్పారు.