పట్టాలిచ్చి19 ఏళ్లైనా స్థలాలు కేటాయించరా?
అదే స్థలాన్ని మార్కెట్ యార్డుకు కేటాయిస్తారా.. ఇది అన్యాయం
-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :
మొయినాబాద్ మున్సిపాలిటీలోని హిమాయత్ సాగర్ రెవెన్యూ గ్రామ పేదలకు 19 ఏళ్ల కింద ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇప్పటికీ వారికి స్థలాలు కేటాయించకపోవడం అన్యాయమని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. స్థలాలు కేటాయించాలని కోరుతూ పట్టాదారులు 75 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ‘‘ఎక్స్’’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 19 ఏళ్ల క్రితం పేదలకు పట్టాలిచ్చిన స్థలంలో ఇప్పుడు మార్కెట్ యార్డ్ నిర్మాణానికి ప్రయత్నిస్తుండటం దారుణమన్నారు. 19 ఏళ్ల క్రితం పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి, నేటికీ వారికి స్థలాలు కేటాయించకపోవడం బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల చేతగాని తనానికి నిదర్శనమన్నారు. 75 రోజులుగా దీక్ష చేస్తున్న పేదల పోరాటాన్ని గుర్తించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌సాగర్ రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 151లో 2007లో 290 మంది పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. వారికి ఇప్పటి వరకు స్థలాలు చూపించకపోవడంతో వారు ఇండ్లు నిర్మించుకోలేకపోయారని తెలిపారు. తమ స్థలాలు కేటాయించాలని కోరుతూ పట్టాదారులు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చుట్టూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల చుట్టూ తిరిగినా వారి గోడు పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే సర్వే నంబర్ లోని స్థలంలో మార్కెట్ యార్డు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తమకు కేటాయించిన స్థలంలో మార్కెట్ నిర్మించవద్దని, తమకు స్థలాలు చూపిస్తే ఇండ్లు నిర్మించుకుంటామని 75 రోజులు పేదలు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వారికి తెలంగాణ రక్షణసేన అండగా ఉంటుందని, పేదలకు ఇండ్ల స్థలాలు చూపించే వరకు ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.








