తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత | నిజామాబాద్

అలీ సాగర్ ఎత్తిపోతల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్,  ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోని 48 వేలకు పైగా ఎకరాల్లో అలీ సాగర్ ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారని గుర్తు చేశారు. యాసంగి సీజన్ ప్రారంభమైనా నీటిని విడుదల చేయకపోవడం తో మూడు నియోజకవర్గాల రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. యాసంగి సీజన్ తైబందీ ఖరారు కాలేదనే కారణంతో ఇరిగేషన్ ఇంజనీర్లు నీటిని విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. రైతులు వరి నార్లు పోసుకొని నెల రోజులవుతోందని, తక్షణమే నీటిని విడుదల చేయకుంటే నార్లు ముదిరిపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లున్నా ఎత్తిపోతలు ప్రారంభించక పోవడం సరికాదన్నారు. ఒక్క నవీపేట మండలంలోనే 14 వేల ఎకరాల్లో అలీ సాగర్ కింద యాసంగి పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. యాసంగి వరి నాట్లు వేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు వలస వచ్చారని, నీటి విడుదల లో జాప్యం కారణంగా రైతులతో పాటు వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అలీ సాగర్ ఎత్తిపోతలు ప్రారంభించి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.