-కల్వకుంట్ల కవిత

అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్న ప్రభుత్వం

(హైదరాబాద్)

అక్రమ మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చేస్తున్న ప్రయత్నాలను నిలిపి వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాల నియామకాలకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలువురు ఆమె దృష్టికి తెచ్చిన సందర్భంగా కవిత స్పందించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి యువత నిర్వేదంలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్స్ వేస్తుందా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. 

ప్రభుత్వ ఉద్యోగాల కోసం గ్రామాల నుంచి ఎంతో మంది యువకులు హైదరాబాద్ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నాని వివరించారు. వేల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రైయినింగ్ తీసుకుంటున్నారని కవిత చెప్పారు. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత ఉద్యమంలో బలంగా కొట్లాడిందని గుర్తు చేశారు. కానీ తెలంగాణ వచ్చాక చిన్నపాటి ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. ఒక క్రమపద్దతిలో పరీక్షలు నిర్వహించలేదని విమర్శించారు. పైగా ఒకే విద్యార్థి రకరకాల ఉద్యోగాలకు పరీక్ష రాయకుండా ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించారని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే న్యాయం జరుగుతుందని యువత భావించిందని వెల్లడించారు. 

Kalvakuntla Kavitha warns against backdoor recruitment of backlog government jobs in Telangana

అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో యువత గ్రామాల్లో తిరిగి ఓటర్ల కాళ్లు పట్టుకొని మరీ కాంగ్రెస్ కు ఓటు వేయించిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ వస్తుందని నమ్మారని, కానీ ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో కూడా స్పష్టత లేని పరిస్థితి ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు స్టేట్ లెవల్ పోస్టులను కూడా ప్రొవిజన్ అనే చిన్నపదాన్ని పట్టుకొని పరీక్షలు లేకుండానే ఉద్యోగం ఇచ్చారని కవిత తెలిపారు. లక్షన్నర జీతం ఉన్న ఉద్యోగాలను బోయినపల్లి సరితతో పాటు చాలా మందికి వచ్చినట్లు విన్నామని చెప్పారు. ఆ అన్యాయం గురించి తెలిసి మనందరం కూడా తీవ్రంగా బాధపడ్డామని గుర్తు చేశారు. నిర్మల్ లో కూడా జిల్లా స్థాయిలో ఉన్న 44 పోస్టులను పది నుంచి 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై యువత ఫైట్ చేస్తే ఆ రిక్రూట్ మెంట్లను ఆపేశారని చెప్పారు. కానీ అప్పుడు కాంట్రాక్ట్ పద్దతిలో చేరిన వాళ్లు ఇంకా ఉన్నారని, వాళ్లకు న్యాయం జరగలేదన్నారు. ఎందుకంటే అప్పటి బీఆర్ఎస్ నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నారు. ఈ పాలిటిక్స్ ను యువత కచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఉద్యోగాలు అమ్మినా కొన్నా వదలం

ఇప్పుడు మరొసారి ట్రాన్స్ కో, జెన్ కో, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో ఉద్యోగాలు రిక్రూట్ చేస్తున్నారని కవిత చెప్పారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ లాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారని వివరించారు. ఇవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల బ్యాక్ లాగ్ పోస్టులని, గతంలో రిక్రూట్ చేయకుండా ఉన్న పోస్టులే అని తెలిపారు. కానీ ఆ పోస్టులను గతంలో మాదిరిగా అమ్ముకునే అవకాశం ఉన్నట్లు యువత భయపడుతోందని పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు పైరవీలతో పోస్టులను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ నిర్మల్ సహా చాలా జిల్లాల నుంచి యువత మా వద్దకు వచ్చి తమ ఆవేదన చెప్పుకుంటున్నారని కవిత తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పోస్టులు అమ్ముకున్న విషయం కొన్ని చోట్ల రుజువైందని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే జరిగే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. అందుకే ముందే కళ్లు తెరిచి అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ పరిధిలో ఉండే ఈ ఉద్యోగాలను కలెక్టర్లు మెరిట్ ఉన్న అభ్యర్థులకే దక్కేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం ఎవరు చేయవద్దని అభ్యర్థులకు సూచించారు. దేవుని దయతో మేము అధికారంలోకి వస్తే డబ్బులు తీసుకున్న, ఇచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. అడ్డదారిలో ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం చేయకుండా మెరిట్ ఉన్న వాళ్లకు అవకాశం రానివ్వాలని కవిత సూచించారు. మెరిట్ తో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి జాగృతి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పుడే సీరియస్ గా దృష్టి పెట్టి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.