గ్రూప్ -1 తరహాలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర

యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోలతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది

ప్రతి నోటిఫికేషన్ కు ఏదో ఒక జీవో అడ్డం పెట్టి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు

జీవో నంబర్ 104,  జీవో నంబర్ 29, జీవో నంబర్ 46, జీవో నంబర్ 81 లను వెంటనే రద్దు చేయాలి

 -తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

గ్రూప్ -1 తరహాలో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులను తమవారికి కట్టబెట్టడానికి కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోల పేరుతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నదని కవిత మండిపడ్డారు. ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ వేసినా సరే దానికి ఒక జీవో అడ్డంకిగా మారిందన్నారు. ముఖ్యంగా డిగ్రీ లెక్చరర్ల పోస్టుల కోసం వేసిన నోటిఫికేషన్ కు అడ్డుగా జీవో నంబర్ 4 తెచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ లెక్చరర్ల పోస్టుల నియామకాల్లో కుట్ర జరుగుతోందని చెప్పారు. గ్రూప్-1 లో తాము అనుకున్న వారికే ఉద్యోగాలు ఇచ్చేలా ప్రత్యేక ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టి కుట్ర చేశారని గుర్తు చేశారు. సరిగ్గా అదే విధంగా డిగ్రీ లెక్చరర్ల భర్తీ విషయంలోనూ ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే జీవో నంబర్ 4 తో పాటు పీహెచ్డీ చేసిన వారికి 25 మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూకి పది మార్కులంటూ నిబంధనలు తమ వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. అసలు పీహెచ్డీ అడ్మిషన్లే లేకుండా 25 మార్కుల వెయిటేజీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ మూడేళ్లుగా నిర్వహించకపోవటంతో ఎంతో మందికి అన్యాయం జరుగుతున్నదన్నారు. వెంటనే జీవో నంబర్ 4 ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

అడ్డంకిగా ఉన్న జీవో లను రద్దు చేయాలి.

డీఎస్సీ కి జీవో నంబర్ 104,  గ్రూప్స్ కు జీవో నంబర్ 29, పోలీసు ఉద్యోగాలకు జీవో నంబర్ 46, గురుకులాలకు జీవో నంబర్ 81, ఆడబిడ్డలకు  రిజర్వేషన్లు రాకుండా జీవో నంబర్ 4 ను తెచ్చారని కవిత చెప్పారు. గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ ఈ జీవోలను కనీసం సమీక్షించలేదని విమర్శించారు. దాదాపు 40 లక్షల కుటుంబాల్లో విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే…ప్రభుత్వం మాత్రం వారికి న్యాయం చేసే విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇంత మంది కన్నీటి గాథలు ఇలా ఉంటే…సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆటలు ఆడుతుండటం సిగ్గుచేటన్నారు. మూసీ కి 7 వేల కోట్లు కేటాయిస్తూ రివ్యూ చేసే సమయం ఉన్న ప్రభుత్వానికి నిరుద్యోగులకు శాపంగా మారిన జీవో లపై సమీక్ష చేసే సమయం లేదా అని కవిత ప్రశ్నించారు. తెలంగాణ యువతను కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం వాడుకుందన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు చెబితే నమ్మరని రాహుల్ గాంధీతోనే నిరుద్యోగులకు హామీ ఇప్పించారని గుర్తుచేశారు. జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, అంగన్ వాడీ జీతాలు, గర్భీణులకు ఇచ్చే డబ్బులు, కిట్ లు కూడా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిరుద్యోగుల సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల వద్దకు వెళ్లి…ప్రభుత్వంపై పోరాటానికి వారిని సన్నద్ధం చేస్తామని హెచ్చరించారు. 

Kalvakuntla Kavitha speaking at press meet on degree lecturer jobs controversy in Telangana

రేషన్ కార్డులు ఏరి వేసే పైశాచికం మానేయాలి

రేషన్ కార్డుల విషయంలో పేదలకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం పెట్టుకుందన్నారు. 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం ఏరివేత కార్యక్రమం ద్వారా 15 లక్షల రేషన్ కార్డులు తీసేయాలని చూస్తోందన్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో రేషన్ కార్డులు ఏరివేసే కుట్ర చేస్తున్నారని చెప్పారు. పేద ప్రజలకు మేలు చేసే రేషన్ కార్డుల విషయంలో పైశాచిక పనులను మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

కొండగట్టు పనుల్లో ఇంత నిర్లక్ష్యమా!

కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలి 15 మంది గాయపడిన ఘటనపై కవిత విచారం వ్యక్తం చేశారు. హనుమాన్ చిన జయంతి వేడుకల కోసం నాసిరకంగా పందిళ్లు వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కొండగట్టు అంజన్న ఆలయంలో ఉత్సవాల సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించటంతో పాటు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.