మహిళలకు ఉపకోటా కావలసిందే
ఫూలే స్ఫూర్తిగా పోరాటం చేస్తం
-కల్వకుంట్ల కవిత
(జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్)
చట్టసభల్లో మహిళా కోటాలో బీసీ మహిళలకు ఉప కోటా కోసం ఫూలే మళ్లీ పుట్టారా అన్నట్లుగా కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీసీ మహిళలకు ఉపకోటా వచ్చే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. మహత్యా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆయనకు కవిత ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఫూలే ఆశయాలను సాధించేలా పోరాటం చేయటమే నిజమైన నివాళి అని చెప్పారు. మహత్మా ఫూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవటమంటే పాలకులకు భయం లేనట్లేనని మండిపడ్డారు. బీసీ ఉపకోటా వచ్చే వరకు కూడా జాగృతి పోరాటం కొనసాగిస్తుందని కవిత చెప్పారు. ఈ దేశంలో మహిళా బిల్లు రావటానికి తెలంగాణ జాగృతి ఉద్యమమే కారణమని కవిత తెలిపారు. మహిళా బిల్లులో బీసీ ఉప కోటా కోసం కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ నెల 16, 17, 18 న మహిళా బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరగనుందని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీల వారితో ఈ అంశంపై మాట్లాడుతాని చెప్పారు. అధికారం, ఎంపీల బలం ఉందని ఇప్పుడు బిల్లు పాస్ చేసుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు.
పోరాట స్ఫూర్తి
ఫూలే విగ్రహాన్ని ఆయన జయంతి రోజు వరకు పూర్తి చేయాలని మనం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చామని, కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇప్పటికీ విగ్రహం ఏర్పాటు చేయలేదని కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు. అసెంబ్లీలో ఫూలే విగ్రహం పెట్టాలని కోరితే ట్యాంక్ బండ్ వద్ద పెడతామని చెప్పారని, ఇది పాక్షిక విజయమేని.. అయినా సరే ట్యాంక్ బండ్ వద్ద ఫూలే విగ్రహం పెట్టాలని కోరామన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా విగ్రహాన్ని పూర్తి చేయలేదని చెప్పారు. అంబేడ్కర్ జయంతి నాటికైనా ఫూలే విగ్రహాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
మహత్మా జ్యోతిరావు పూలే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వెన్ను చూపకుండా పోరాడిన త్యాగధనులని కొనియాడారు. ఏ విప్లవం వచ్చినా సరే త్యాగం పునాదిగా ఉంటుందని కవిత చెప్పారు. సమాజంలో మార్పు తేవాలంటే ముందు ఆ మార్పు మన నుంచే మొదలుకావాలని సూచించారు. మనం చేపట్టే బాట కూడా ముళ్లబాట మాదిరిగానే ఉంటుందని, ముందు మనల్ని ఒప్పుకోరన్నారు. ఫూలేకు కూడా అదే జరిగిందని, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఆయన నమ్ముకున్న తోవను వదలిపెట్టలేదని గుర్తు చేశారు. అందుకే ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయనను మనం గుర్తు చేసుకుంటున్నామన్నారు. పూలే గారికి నిజమైన నివాళి అంటే ఆయన చెప్పిన సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పనిచేయటమేనని కవిత స్పష్టం చేశారు. సమాజంలో మార్పు తెచ్చేందుకు కంకణబద్దులైన మనం వారి అడుగుజాడల్లో నడవాలన్నారు.
ఆటిజన్లకు జాగృతి మద్దతు
విద్యుత్ శాఖలో ఆటిజన్లను రెగ్యులరైజ్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇదే డిమాండుతో వారు ఆందోళన చేపడితే కొత్తగూడెంలో వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని కవిత విమర్శించారు. దీంతో రాష్ట్రంలో ఉన్న ఆటిజన్లు అందరూ కూడా కొత్తగూడెం వెళ్లి నిరసన తెలుపుతున్నారని వివరించారు. వారి నిరసన కార్యక్రమంలో కొత్తగూడెంలో ఉన్న జాగృతి నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఆటిజన్ల పోరాటానికి జాగృతి మద్దతుగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో ఆటిజన్ల జీతాలు పెంచేందుకు ప్రయత్నం చేశా. వారికి నెలకు 40 వేల రూపాయల జీతం వస్తుందంటే అందులో జాగృతి పాత్ర ఉందని కవిత వెల్లడించారు.








