మహిళా కోటాపై కేంద్ర కేబినెట్ నిర్ణయం ఏకపక్షం
మహిళా కోటాలో ఓబీసీ సబ్ కోటా కల్పించాలి
జాగృతి పోరాటాలతోనే మహిళా బిల్లుకు కార్యరూపం
-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
(తెలంగాణ జాగృతి కార్యాలయం – బంజారాహిల్స్)
2027 జనగణన ఆధారంగానే మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహిళా కోటాలో ఓబీసీ సబ్ కోటా కోసం జాగృతి ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. మహిళా కోటాపై కేంద్ర కేబినెట్ నిర్ణయం ఏకపక్షంగా ఉందని విమర్శించారు. మహిళా బిల్లుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కవిత ఒక ప్రకటనలో తప్పు పట్టారు.
మా ఒత్తిడితోనే మహిళాబిల్లు
” మహిళా బిల్లు కోసం జాగృతి మొదలుపెట్టిన పోరాటం ద్వారా యావత్ దేశ మహిళలకు మేలు జరిగే పరిస్థితి వచ్చింది. మనం వెలిగించిన దీపం ద్వారా మహిళా బిల్లుకు ముందడుగు పడింది. ఈ బిల్లు కోసం ఢిల్లీలో నేను చేసిన దీక్షకు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు తరలివచ్చారు. అదే విధంగా 18 పార్టీలను కో ఆర్డినేట్ చేసి వారు దీక్షలో పాల్గొనేలా చేశాం. పార్లమెంట్ లో ఈ అంశంపై ఆయా పార్టీల ఎంపీలు మాట్లాడే విధంగా ప్రయత్నం చేశాం.
మహిళా బిల్లు కోసం జాగృతి ద్వారా కేంద్రంపై రాజకీయ ఒత్తిడి పెట్టాం. ఫలితంగా మహిళా బిల్లు వచ్చింది. ఈ బిల్లు రావటంలో జాగృతి పాత్రను మరవలేం. కానీ బిల్లుకు సంబంధించిన ప్రయోజనం మాత్రం పోస్ట్ డేటెడ్ చెక్ మాదిరిగా ఉందని ఆనాడే నేను చెప్పాను. బీసీ ఆడబిడ్డలకు కోటా లేకుండానే ఈ బిల్లు పాస్ చేశారు. డీ లిమిటేషన్ ను మహిళా బిల్లుకు ముడిపెట్టి పాస్ చేశారు.
దీంతో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, అదే విధంగా ఆ తర్వాత జరిగిన 12 రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలకు బిల్లు ప్రయోజనం రాలేదు. ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నారు. దీని కారణంగా మళ్లీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. 2027 జనాభా గణన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలి. అదే విధంగా ఈసారి జన గణనలో బీసీల లెక్క తీస్తామంటున్నారు. ఆ లెక్క తేలిన తర్వాత బీసీ మహిళలకు కూడా సబ్ కోటా ఇవ్వాలి.
కొన్నిరోజుల్లో ఈ బిల్లు మీద చర్చ పెడతామని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా డ్రాఫ్ట్ బిల్లును ఏ పార్టీకి ఇవ్వలేదు. వెంటనే డ్రాఫ్ట్ బిల్లును అన్ని పార్టీలకు అందజేయాలి. బిల్లు పెట్టే రోజు ఉదయమే బిల్లు ప్రతులను ఇస్తామని చెబుతున్నారు. దీని కారణంగా అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదు. బీజేపీ ఎప్పటిలాగే తమ మోసపూరిత వైఖరి అవలంభించాలని ప్రయత్నిస్తోంది. ఈ బిల్లు విషయంలో 2027 జనాభా లెక్కల వరకు ఆగాలని పోరాటం చేయాల్సి ఉంది. ఇందుకోసం బీసీ బిడ్డలంతా కదలాలి. డ్రాఫ్ట్ బిల్లు అంశంతో పాటు 2011 జనాభా లెక్కలు ఆధారంగా చేసుకుంటామన్న బీజేపీ వైఖరిని ఖండిస్తున్నా. ఈ అంశంపై గతంలో మాతో కలిసి వచ్చిన 18 పార్టీల నాయకులతో నేను మాట్లాడుతాను.
మహిళలందరం మనం సాధించుకున్న ఈ బిల్లులోని హక్కులను కచ్చితంగా సాధించుకోవాలి.”








