-కల్వకుంట్ల కవిత

జగిత్యాల ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వటమంటే రాజ్యాంగాన్ని అవమానించటమే 

(హైదరాబాద్) 

సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ బహిరంగసభలో అన్ని మర్యాదలను అతిక్రమించి మాట్లాడారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. వెలమజాతిని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు కామెంట్లు చేయడం దారుణమన్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకునేటప్పుడు ఏ భేద భావం లేకుండా అందరినీ గౌరవిస్తానని ప్రమాణం చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు మాటిచ్చారని చెప్పారు. కానీ అవన్నీ మరిచి పోయి ఒక జాతిని టార్గెట్ చేయటం సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇలా ఒక జాతిపై విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. సీఎం ఇలాంటి వైఖరిని మార్చుకోవాల్సి ఉందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారని కవిత చెప్పారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఆయన కాంగ్రెస్ లో చేరిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. గాంధీ భవన్ లో అఫిషీయల్ గా మీటింగులకు హాజరవుతున్నారని వివరించారు. జగిత్యాలలో 30 మంది మున్సిపల్ అభ్యర్థులకు కాంగ్రెస్ బీ ఫామ్ లు స్వయంగా సంజయే ఇచ్చారని వెల్లడించారు. 

అలాంటి వ్యక్తికి అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వటం సరికాదని స్పష్టం చేశారు. సంజయ్ కి నీతి, నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించారు. రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కటం..భవిష్యత్ తరాలకు మంచిది కాదని కవిత చెప్పారు.  వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.