(హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం)

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజాధనంతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాాలని తెలంగాణ జాగృతి నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రెటరీ లింగ్యా నాయక్ కు ఫిర్యాదు లేఖ అందజేశారు. సీఎం ప్రతి ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డం విచారకరమని దుయ్యబట్టారు. ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, నరేందర్ యాదవ్, మరిపెల్లి మాధవి తదితరులు ఉన్నారు.

ప్రజలను మోసం చేయడమే

  • రూప్ సింగ్, జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్

మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో మీటింగ్ పెట్టారు. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ఆ మీటింగులో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని సీఎం కోరారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం. ఈ ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిజంగా ప్రజలను ఓటు వేయాలని కోరేందుకు పార్టీ పరంగా మీటింగులు పెట్టుకోవాలి. ప్రభుత్వ ప్రొగ్రామ్ లో ఇలా ప్రజలను మోసం చేసే విధానాన్ని విరమించుకోవాలి. ఎన్నికల సంఘం కూడా ఇలాంటి ప్రయత్నాలు జరగకుండా చూడాలి. గత సర్పంచ్ ఎన్నికల్లోనూ సీఎం ఇదే విధంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. అప్పుడు మా సంస్థ అధ్యక్షురాలు కవిత స్వయంగా ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. కానీ అప్పుడు ఈసీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవటం దురదృష్టకరం. సీఎం అధికారం దుర్వినియోగంపై మేము చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చింది. దీనిపై సీఎస్ కు లేఖ రాస్తామని ఎన్నికల కమిషనర్ చెప్పారు. ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పని మానుకోవాలని జాగృతి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ప్రతిపక్షం సైలెంటుగా ఉన్నప్పటికీ జాగృతి మాత్రం ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. 

సమాజానికి సీఎం తప్పుడు సంకేతాలిస్తున్నారు

  • సయ్యద్ ఇస్మాయిల్, జాగృతి సీనియర్ నాయకులు

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను మభ్య పెడుతున్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశాం. సీఎస్ దీనిపై లేఖ రాసి చర్యలు తీసుకునేలా ఆదేశాలిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ముఖ్యమంత్రి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్రజాధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను మభ్య పెడుతున్నారు. దీనిపై అధికార యంత్రాంగం, ఈసీ సీరియస్ గా చర్యలు తీసుకోవటం లేదు. అందుకే ముఖ్యమంత్రి ప్రతిసారీ యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. గతంలో టీఎన్ శేషన్ ఎన్నికల నియమావళిని అద్భుతంగా నిర్వహించారు. కానీ ప్రస్తుతం వాటిని అమలు చేయకుండా  నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లోనూ మేము సాక్ష్యాలతో సహా సీఎంపై కంప్లైంట్ చేశాం. అయిన చర్యలు లేవు. ప్రభుత్వ కనుసన్నుల్లో కాకుండా ఈసీ కనుసన్నుల్లో ఎన్నికలు జరగాలి. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రే బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలి. సీఎం హోదాలో ఉండి ప్రభుత్వ కార్యక్రమంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఏం సంకేతం ఇస్తున్నారు. ముఖ్యమంత్రిపై ఈసీ చర్యలు తీసుకోవాలని మేము బలంగా డిమాండ్ చేస్తున్నాం. 

కర్రుగాల్చి వాత పెడతారు

  • నరేష్ ప్రజాపతి, జాగృతి ఆర్గనైజింగ్ సెక్రటరీ

ప్రజాపాలన అని చెప్పే ఈ ముఖ్యమంత్రి ప్రజలను గాలికి వదిలేశాడు. ప్రభుత్వ సొమ్ముతో ఎన్నికల ప్రచారం చేస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి చర్యల కారణంగా ప్రభుత్వంపై నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. గత సర్పంచ్ ఎన్నికల్లో ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. ఈ సారి మాత్రం చర్యలు తీసుకుంటామని సీఎస్ కు లేఖ రాస్తామని ఎన్నికల కమిషనర్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు మేము వివరిస్తాం. మీరు చేసే తప్పుడు పనులకు కచ్చితంగా ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెడుతారు.