కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు.. పచ్చి దోపీడి, లూటీ పాలన
-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కమీషన్లకు అడ్డగా మార్చేశారని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ పనికి 15 శాతం కమీషన్ కావాలంటూ నేరుగా సీఎంఓ నుంచే బెదిరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమంటూ గురువారం ఎక్స్ లో ట్వీట్ చేశారు. తమ అనుచరులకు, ఆప్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు చట్టాన్ని, నిబంధనలను ఏమాత్రం లెక్కచేయటం లేదన్నారు. ఏలాంటి అర్హతలు లేని వారికి కేవలం కమీషన్ల కోసం పనులు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజాపాలన కాదు.. పచ్చి దోపిడీ, లూటీ పాలన.. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఈ అరాచకాలను సహించదని హెచ్చరించారు. ప్రజలకు, వ్యాపారులకు రక్షణగా ఉండాల్సిన ముఖ్యమంత్రి, ఆయన ఆఫీస్ నుంచే ఇలాంటి ఆగడాలు జరగటమేంటనీ ఆమె ప్రశ్నించారు. ప్రజలను దోచుకుంటూ కమీషన్ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్న వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ లూటీకి పాల్పడిన వాళ్లందరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
A 15% commission demand, direct threats from the CMO, and shameless favouritism for cronies! The Congress government has turned the Chief Minister’s Office into a mafia-style collection centre. This isn’t governance. It is blatant extortion. Telangana will not tolerate this loot. Every single perpetrator will be held accountable!
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 15, 2026
మహారాష్ట్ర తరహా మహిళా రైతుల సాధికారత చట్టం తేవాలి
మహిళా రైతుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధంగా ‘మహిళా రైతుల సాధికారిత’ చట్టాన్ని..తెలంగాణలోనూ తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. గురువారం మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా తెలంగాణలో మహిళా రైతుల దయనీయ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ఎక్స్ లో ట్వీట్ చేశారు. కుటుంబాన్ని చూసుకుంటూనే ఉదయం నుంచి రాత్రి వరకు పొలం, పాడి పనులతో తీరిక లేకుండా శ్రమిస్తున్న వారికి కనీస గుర్తింపు దక్కడం లేదన్నారు. గ్రామీణ ఆర్థిక ప్రగతి చక్రానికి ఇరుసుగా ఉన్న మా ఆడబిడ్డల కష్టాలు, త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మహిళా రైతుల సాధికారత చట్టం -2026 ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కూడా చట్టం చేయాలన్నారు. మహిళా రైతులకు, రైతు కూలీలకు చట్టపరమైన గుర్తింపును ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు, సామాజిక భద్రత ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించాలన్నారు. మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా సాగులో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 80 శాతం భాగస్వాములుగా ఉన్న మహిళల శ్రమను గుర్తిస్తూ..వారిని గౌరవించుకుందామని పిలుపునిచ్చారు.








