(ఖమ్మం)

ఖమ్మంలోని వెలుగుమట్ల బాధితుల కోసం ఆందోళనకు దిగిన తెలంగాణ జాగృతి అధినేత్రి,  మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత తదితరుల అరెస్ట్ ఖమ్మంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే కవితతో పాటు పలువురు మహిళలను అరెస్టు చేయడంతో పోలీసుల తీరుపై జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసులు దౌర్జన్యం చేయడం పట్ల జాగృతి అధ్యక్షురాలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. బాధితులతో పాటు మహిళా నాయకులపై మగ పోలీసులు దురుసుగా ప్రవర్తించి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు హైదరాబాద్ లో మహిళా కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. 

పోలీసుల దౌర్జన్యం

ఇండ్ల కూల్చివేతతో నిర్వాసితులైన వెలుగుమట్ల బాధితులను సోమవారం ఉదయం ఖమ్మం అంబేద్కర్ భవన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వారితో మట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో వెలుగుమట్ల బాధితులతో కలిసి కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్తూ జెడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఖమ్మం జెడ్పీ సెంటర్ లో ఆందోళన చేస్తున్న వెలుగుమట్ల బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని  అరెస్ట్ చేసే క్రమంలో తోపులాట జరిగింది. పలువురు బాధితులకు గాయాలై సొమ్మసిల్లి పడిపోయారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వెలుగుమట్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఖమ్మం జెడ్పీ సెంటర్ లో ఆందోళన చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఖమ్మం ఆర్ డీవో చర్చలు జరిపారు. కలెక్టర్ వచ్చి వెలుగుమట్ల బాధితులకు అదే స్థలంలో ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పోలీసులతో తోపులాటలో గాయపడ్డ బాధితురాలు లలితను వెంటనే ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు.

అమానుషం

ఖమ్మం జెడ్పీ సెంటర్ లో ఆందోళన చేస్తున్న కల్వకుంట్ల కవితతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే కవితతో పాటు పలువురు మహిళా నాయకులను అరెస్టు చేయడం పట్ల పోలీసుల తీరుపై జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు కల్వకుంట్ల కవిత, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ కు వెలుగుమట్ల బాధితులు, జాగృతి నాయకుల తరలించారు. అంతకుముందు వెలుగుమట్ల బాధితులను కలిసిన సందర్భంగా తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల మీడియాతో మాట్లాడారు. వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందన్నారు. ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఈ ఆడబిడ్డల ఉసురు తగులుతుందని స్పష్టం చేశారు. 

ఇండ్లు అక్కడే కట్టివ్వాలి

“ప్రభుత్వానికి, నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుంది. ఒక ఆడబిడ్డ ఏడిస్తేనే ఇంటికి మంచిది కాదు. అలాంటిది ఇంత మంది ఆడబిడ్డల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. పిల్లల ఎగ్జామ్స్ సమయంలో తల్లితండ్రులు ఎంతో ఆందోళనతో ఉంటారు. కానీ ఎగ్జామ్స్ సమయంలో పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేశారు. మీ ఇళ్లు కూల్చేస్తే చాలా మంది రాజకీయ నాయకులు ఎగ్జిబిషన్ చూసినట్లు చూసి వెళ్లారు. మీ ఆవేదన, బాధ కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ గా మారింది. నన్ను కూడా తొందరగా ఇక్కడకు వెళ్లు అని చాలా మంది చెప్పారు. కానీ నేను ఎక్కడున్నా సరే మహిళలు, పేదల పక్షానే ఉంటా. ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం వచ్చే వరకు వదలి వెళ్లను. నేను ఏదో మిమ్మల్ని చూసి వెళ్లటానికి ఇక్కడకు రాలేదు. మీ సమస్యలు సావధానంగా విని…వాటిని ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించేందుకు వచ్చాను. మీతో పాటు ఇక్కడ విశారదన్ మహారాజ్ కూడా ఉన్నారు. ఆయన పట్టుపడితే వదలరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలతో పాటు జాగృతి కూడా మీకు తోడుగా ఉంది. ఒక పరిష్కారం వచ్చే వరకు కూడా మనం సమస్యను వదలకుండా పోరాటం చేద్దాం. మనల్ని ఓ కొట్టంలోకి తోలినట్లు ఇక్కడకు తీసుకొచ్చి పెట్టేశారు. కనీసం మహిళలకు ప్రత్యేక వసతి లేదు. హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు కనీసం హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. గతంలో మన ఇళ్లు కూల్చేసే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్లు భోజనాలు, హెల్త్ క్యాంప్ లు పెట్టారంట. మంచిదే. వాళ్లు చేసిన పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకపోవటం దారుణం. కలెక్టర్ ఒక్క రోజు కూడా రాలేదని చెబుతున్నారు. ముగ్గురు మంత్రులు ఈ జిల్లాకు ఉంటే ఒక్కరికి కూడా సోయిలేదు. ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు ఈ సమస్యపై మాట్లాడాలి. ముందుగా జిల్లా కలెక్టర్ ఇక్కడకు రావాలన్నది మన డిమాండ్. అదే విధంగా మన ఇళ్లు ఎక్కడ నేలమట్టం చేశారో…అక్కడే కొత్తగా ఇళ్లు కట్టించి ఇవ్వాలి. వేరే చోటకు వెళ్లమంటే వెళ్లేది లేదు. ఇక్కడే ఇళ్లు కట్టించేలా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. 

రాష్ట్రం మొత్తం కూడా పేదల మీద జులుం నడుస్తోంది. పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లు పంపుతూ అన్యాయం గా వ్యవహరిస్తున్నారు. పెద్ద వాళ్ల బిల్డింగుల జోలికి వెళ్లటం లేదు. వాళ్ల బిల్డింగులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. రాహుల్ గాంధీ పట్టుకునే రాజ్యాంగాన్ని ఖూనీ చేసేలా పేదల మీదకు బుల్డోజర్లు వస్తున్నాయి. దానిని ఎదిరించి మీ పక్షాన నిలిచేందుకే ఇక్కడకు వచ్చాం. మనందరం కలిసి ఓ కార్యాచరణ రూపొందించుకొని పరిష్కారం కోసం ప్రయత్నిద్దాం.”

మహిళా కమిషన్ కు ఫిర్యాదు

ఖమ్మంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మహిళా నాయకులు, మహిళల అరెస్టు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకులు మంచాల వరలక్ష్మి, ధరణిరాణి తదితరులు ఫిర్యాదు చేశారు.

Velugumatla victims protest at Khammam ZP Center