• ఏ ఇంట్లో పుట్టినా సరే మహిళలపై వివక్షే
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై క్రైమ్ రేటు 22 శాతం పెరిగింది 
  • ఎక్సర్ సైజ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయి మెంట్ నినాదాన్ని ఫాలో అవ్వాలి 
  • మహిళలు లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదు

-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

(తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయం, బంజారాహిల్స్)

వయసుతో సంబంధం లేకుండా మహిళలంతా రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అన్నింటా మహిళకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవం రోజే కాదు.. ప్రతి రోజూ మహిళలను గౌరవించేలా పరిస్థితులు మారాలన్నారు. స్టాండ్ విత్ హర్ కాదు.. “గివ్ హర్ స్పేస్” అనేది జాగృతి నినాదమని ప్రకటించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలతో కలిసి కవిత కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా *గివ్ హర్ స్పేస్* పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం కవిత మాట్లాడారు.

Kavitha speaks at Telangana Jagruthi Women’s Day celebrations

అన్ని చోట్లా వివక్షే

” ఏ ఇంట్లో పుట్టినా సరే మహిళలపై వివక్షే. మాట్లాడితే నీవు తెలివి లేని దానివి అని అంటారు. భర్త, తండ్రి, అన్న అందరూ మనల్ని అలాగే అంటారు. బయటకు వెళితే కూడా చిన్న వాడైనా తమ్ముడిని వెంట పంపిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ స్టాండ్ విత్ హర్ అనే ఒక ప్రొగ్రామ్ చేశారు. “స్టాండ్ విత్ హర్” అంటూ మహిళలను అవమానించారు. మహిళలతో మగవాళ్లు నిలబడితేనే భద్రతనా? మహిళలకు, చిన్న పిల్లలకు రక్షణ ఇవ్వటం ఈ ప్రభుత్వానికి చేతకాదా? రాజకీయాల్లో మహిళలు ఉన్నదే 0.0003 శాతం. మాకే నిలబడే జాగ లేదు. ఇంకా మీరు మాతో పాటు నిలబడేదేంది? సర్పంచ్, ఎమ్మెల్యే, మంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి వెనుక మగవాళ్లే ఉంటారు. “స్టాండ్ విత్ హర్” కాదు.. “గివ్ హర్ స్పేస్” అనేది మా జాగృతి నినాదం. పురుషులు ఉంటనే ఆడవాళ్లు ముందుకు వెళ్తారన్నట్లుగా ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మగ, ఆడ అనే ప్రభుత్వం ఉండదు. మా రక్షణ మీ బాధ్యత. మీరు వేసే భిక్షం కాదని ప్రభుత్వ పెద్దలు గుర్తు పెట్టుకోవాలి. “

ఈ క్యూబ్

“మహిళలు కచ్చితంగా మూడు “ఈ” లను గుర్తుపెట్టుకోవాలి. కచ్చితంగా మహిళలు ఎక్సర్ సైజ్ చేయాలి. పిల్లలకు తినిపిస్తూ వారు మిగిల్చిన ఫుడ్ అస్సలే తినవద్దు. మిగిలిపోయిన ఫుడ్ తినటానికి మనమేమైనా చెత్త బుట్టలమా? మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కచ్చితంగా పౌష్టికాహారం తినాలి. ఆరోగ్యంపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. లేదంటే మన కుటుంబానికే ఇబ్బంది. పోలీసులు, మిటలరీ వాళ్లకు ఎక్సర్ సైజ్ అవసరమో లేదో తెలియదు కానీ మహిళలకు మాత్రం ఎక్సర్ సైజ్ అవసరం. ఈ ఎడ్యుకేషన్ ఏదో ఫార్మాలిటీ కోసం ఎడ్యుకేషన్ ఉండకూడదు. సమాచారం, లోక జ్ఞానం కోసం నిరంతరం చదవుతూ ఉండాలి. న్యూస్ పేపర్లు టాప్ టు బాటమ్ చదివి సమాచారాన్ని తెలుసుకోవాలి. మనకు కావాల్సింది మాత్రమే చదవటం కాదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మనం లిమిటెడ్ గా తెలుసుకుంటాం కాబట్టే మనల్ని మగవాళ్లు తక్కువ చేసి మాట్లాడతారు. ఇంకొకటి ఎంప్లాయి మెంట్. కచ్చితంగా మన డబ్బు మనమే సంపాదించుకోవాలి. భర్త, పిల్లల సంపాదనపై మనం ఆధారపడవద్దు. మన దగ్గర పైసలు ఉంటేనే మనకు పవర్ ఉంటుంది. ఎక్సర్ సైజ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ ఈ మూడు మాత్రం కచ్చితంగా ఫాలో అవ్వాలి. జాగృతి మహిళలు కచ్చితంగా తమ డబ్బులు తామే సంపాదించుకోవాలి. “

ప్రతిరోజూ మహిళా దినోత్సవమే

“మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళలను గుర్తిస్తూ ఆర్టికల్స్, స్టోరీస్ రాస్తూ గొప్పగా మాట్లాడుతుంటారు. ప్రొగ్రెసివ్ గా ఉండే మగవాళ్లు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతారు. కానీ ప్రధాన స్రవంతిలో ఉన్న మీడియా, న్యూస్ పేపర్లు, రాజకీయపార్టీలకు చెబుతున్నా.. అదే విధంగా పురుషులు కూడా గుర్తు పెట్టుకోవల్సింది…ప్రతి రోజూ మహిళల దినోత్సవమే. ప్రతిరోజూ మహిళల దినోత్సవంలా ఉండేలా పరిస్థితులు మారాలి. ఇళ్లు, స్కూల్, హాస్పిటల్ ఏది నడవాలన్నా మహిళలు ఉండాల్సిందే. జయశంకర్ సార్, కేసీఆర్  లాంటి వాళ్లు ఈ నేలపై నడిచారంటే వాళ్ల తల్లులే అందుకు కారణం. కొత్తతరం వచ్చి సమాజ సేవ చేయాలంటే మహిళలే కారణం. ఆధిపత్యం అనేది ఏ రూపంలో ఉన్నా సరే మహిళలు సహించవద్దు. సామాజిక, పురుషాధిక్యతను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే ఉండొద్దు. 

వంటింటికి మహారాణి మహిళలే అంటారు. కానీ వంటింటి పాత్రలపై కూడా పురుషుల పేర్లే ఉంటాయి. “

50 శాతం వాటా కావల్సిందే

“నిజమైన హక్కులు, సమానత్వం, స్వాతంత్రం, స్వేచ్ఛ మహిళలకు ఇంకా రాలేదు. 

బిడ్డను మోసేది మనం. కానీ ఆ బిడ్డలకు పేరు పెట్టే స్వాతంత్రం కూడా మనకు లేదు. 

సచివాలయంలో, అంగన్ వాడీలో మహిళా ఉద్యోగులున్నారు. డాక్టర్లు, లాయర్లు, వ్యాపార వేత్తలు, విద్యార్థి, యువజన సంఘాల్లోనూ మహిళలు ఉన్నారు. సమాజానికి సేవ చేస్తామనే మహిళలు చాలా మంది ఉన్నారు. కానీ పొలిటికల్ పార్టీలు వారికి అవకాశం ఇవ్వటం లేదు. 

జాగృతిలో మాత్రం మహిళలకు చాలా పెద్ద ఎత్తున అవకాశాలు ఇవ్వబోతున్నాం. ఆడబిడ్డలు ఇంకా అవగాహన పెంచుకునేందుకు లీడర్ ప్రొగ్రామ్ ద్వారా శిక్షణ ఇస్తాం. మనకు 33 శాతం కాదు 50 శాతం వాటా ఉండాలి. ఐతే ముందుగా 33 శాతం అయినా సరే ఒక అడుగు ముందుకు పడాలని అంగీకరించాం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సాధించటంలో దేశ చరిత్రలోనే జాగృతి పేరు సువర్ణాధ్యాయంగా నిలుస్తుంది. 

జాగృతి అక్కాచెల్లెళ్లు ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయటం కారణంగానే మహిళా బిల్లు వచ్చింది. 

అయితే పోస్ట్ డేటేడ్ అన్నట్లుగా జనగణన కావాలంట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా మహిళా బిల్లు అమల్లోకి రావాలి. “

కుళ్లును ఊడ్చేద్దాం

“అగ్రకులాల, రిజర్వేషన్లు ఉన్న కులాల మహిళలే కాదు.. అన్ని కులాల్లోని మహిళలు రాజకీయాల్లోకి రావాలి. పెద్ద ఇల్లు, చిన్న ఇల్లు, పెద్ద కులం, చిన్న కులం కాదు. మహిళలమంతా ఒక్కటే కులం. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరూ రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాలను క్లీన్ చేయాలంటే చీపురు పట్టే మనమే రావాల్సిన అవసరముంది. మహిళా దినోత్సవం అనేది జాగృతి సంస్థకు మహిళా శక్తిని నిర్మించే రోజు కావాలి. మహిళలకు నిజమైన స్వాతంత్రం కావాలంటే మహిళా ఆర్మీ, సైనిక శక్తిని నిర్మించాల్సిన అవసరముంది. వ్యాపారవేత్తలు, సైంటిస్టులు, రాజకీయ నాయకులుగా మహిళలు ఎదగాలి. పురుషులు మనల్ని ఏదైనా అనాలంటే భయపడే స్థాయిలో ఎదగాలి. బతుకమ్మ, బోనాలతో సాంస్కృతిక విప్లవం తెచ్చి తెలంగాణ ఉద్యమంలో మహిళలు పాల్గొనేలా చేశాం. మహిళలు లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు. అదే విధంగా సామాజిక తెలంగాణ ఏర్పాటులో కూడా మహిళలదే కీలక పాత్ర కావాలి. అగ్రకులాలు, ఎస్సీ, ఎస్టీ మహిళలు మాత్రమే కాదు.. అన్ని కులాల మహిళలు రాజకీయాల్లోకి రావాలి. మహిళ దినోత్సవాన్ని చూసి కొంతమంది పురుష దినోత్సవం కావాలని అడుగుతున్నారు. అదే విధంగా మహిళల చట్టాల్ని పలుచన చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు ఇంకా సమానమైన హక్కులు రాలేదు. పరిపూర్ణమైన 50 శాతం హక్కులు వచ్చిన తర్వాత చట్టాలు మార్చే ఆలోచన చేయండి. అంతవరకు చట్టాలు మార్చుతామంటే ఊరుకునేది లేదు.”

రాష్ట్రంలో మహిళకు భద్రత ఏది..

“రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై క్రైమ్ రేటు దారుణంగా పెరిగింది. 

22 శాతం క్రైమ్ రేటు పెరిగితే సీఎం, డీజీపీ ఏం చేస్తున్నారు? నాగర్ కర్నూల్ లో చంటి బిడ్డ చనిపోతే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. క్రైమ్ రేటు తగ్గించేందుకు పోలిసింగును పెంచాల్సిన అవసరముంది. ఫ్రీ బస్ కాదు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. కేరళ రాష్ట్రాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు 99 రోజుల సమీక్ష అనే కార్యక్రమం చేస్తారంట. 

అసలు కాంగ్రెస్ చేసిన 99 మోసాలను ఎండగడతాం. కాంగ్రెస్ మొదట మహిళలనే మోసం చేసింది. రూ. 2500 ఇస్తామని చెప్పి పత్తా లేకుండా పోయింది కాంగ్రెస్ సర్కార్. ముందు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.”