బస్వాపూర్ రిజర్వాయర్ సందర్శన | (భువనగిరి)

“బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారిలో చాలామందికి పరిహారం చెల్లించకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లాలో జాగృతి జనంబాటలో భాగంగా కవిత బస్వాపూర్ రిజర్వాయర్ ను సందర్శించి నిర్వాసితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.”  

పరిహారం ఎందుకు ఇవ్వలేదు

“ఒరిజినల్ ప్రాణహిత-చెవేళ్ల ప్రాజెక్టులో భాగంగా బస్వాపూర్ వద్ద 0.8 టీఎంసీల చిన్న రిజర్వాయర్ నిర్మించాలని డిజైన్ చేశారు. కానీ రీడిజైన్ లో భాగంగా11.7 టీఎంసీల పెద్ద రిజర్వాయర్ గా ప్రతిపాదించారు. దీని కారణంగా చాలా మందికి ప్రయోజనం కలుగుతుంది. కానీ బస్వాపూర్ గ్రామస్తులు మాత్రం పూర్తిగా వారి పొలాలను కోల్పోయారు. 

రిజర్వాయర్ సమీపంలో ఇళ్లు ఉండటంతో ఊట కారణంగా ఇబ్బంది పడుతున్నారు. పరిహారం కూడా దఫా దఫాలుగా ఇవ్వటంతో పరిపూర్ణంగా న్యాయం జరగలేదని గ్రామస్తులు భావిస్తున్నారు. కొందరికైతే అసలు పరిహారమే రాలేదు. కట్టలో కలిపేసి వారి భూములు తీసుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే అధికారులు స్పందించటం లేదు. కలెక్టర్ గారు ఇక్కడకు వచ్చి ఎవరెవరికీ ఎందుకు పరిహారం రాలేదో స్పష్టం చేయాలి. భూమి కోల్పోయిన కుటుంబంలో ఒకరికి జాబ్ ఇప్పిస్తామని ఎమ్మెల్యే అనిల్ మాట ఇచ్చారు. కానీ హామీ నిలబెట్టుకోలేదు.  సమస్య పరిష్కరించడంలో ఎమ్మెల్యే దృష్టి పెట్టాలి.  ఇంకా చాలా అంశాలను గ్రామస్తులు చెప్పారు. వాటిని ఒక్కొక్కటిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించే ప్రయత్నం చేస్తాం.”