-కల్వకుంట్ల కవిత
- కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- అరికెపూడి గాంధీపై వేటు వేయాలి
- మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరపున సింహం గుర్తుపై పోటీచేస్తున్నాం
- 12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ
(తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్)
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ బద్ద వ్యతిరేకి అని తెలంగాణ జాగృతి అధినేత్రి, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్న ఓసీ జేఏసీ నేత బుట్టంగారి మాధవ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం ఆ పార్టీ వైఖరిని వెల్లడిస్తున్నదని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యే గాంధీని నిజామాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా నియమించడం పట్ల కూడా కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీసీలను మోసం చేసిన బీఆర్ఎస్
బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవ్ రెడ్డికి బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి సహా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయి. ఎన్నో రోజులు పోరాటం చేసి, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి 42 శాతం రిజర్వేషన్ల బిల్లు వచ్చేలా చేశాం. కానీ బుట్టంగారి మాధవ్ రెడ్డి సహా మరొక వ్యక్తి దీనిపై పిటిషన్ వేశారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అంటే ఈ కేసును బీఆర్ఎస్ వేయించిందా? బీసీల రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమా? ఈ మాధవ్ రెడ్డి అనే వ్యక్తి హరీష్ రావుకు దగ్గర మనిషి. హరీష్ రావు పర్సనల్ లాయర్ ఈ కేసు వేయించారు. అప్పుడు దీని వెనుక ఉన్నది హరీష్ మాత్రమే అని అనుకున్నా. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వటం కారణంగా దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉన్నట్లు అర్థమవుతోంది. తెలంగాణలో 56 శాతం ఉన్న బీసీల నోటికాడి బుక్క గుంజుకునే ప్రయత్నం చేసిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు? బీఆర్ఎస్ అసలు బీసీల విషయంలో చిత్తశుద్ధి లేదు. పార్టీ పరంగా కూడా వాళ్లు మీటింగులు పెట్టలేదు. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరమ్ పేరుతో మాత్రమే మీటింగులు పెట్టారు. జనగణన విషయంలో కూడా ముందు కన్ ఫ్యూజ్ చేశారు. తర్వాత మళ్లీ జనగణన చేయాలంటూ డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో అంతా రోడ్లపైకి వస్తే కానీ వాళ్ల మీటింగులు కార్యరూపం దాల్చలేదు. అందుకే బీసీలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైఖరిని గమనించాలని కోరుతున్నా. బుట్టంగారి మాధవ్ రెడ్డిని నాయకుడిని చేసింది జాగృతియే. 2010 వరకు మాతోనే ఆయన ఉండేది. ఆ తర్వాత కమ్యూనిటీ తరఫున పోరాటాలు చేసుకుంటామని వెళ్లిపోయారు. జాగృతి 20 ఏళ్ల సంస్థ. ఎంతో మందిని లీడర్లుగా చేసింది. ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఉన్నట్లు అన్ని చోట్ల మా వాళ్లు ఉన్నారు. కానీ బుట్టంగారి మాధవ్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ తో కలిశారు. హరీష్ రావు ఆయనను తప్పుదోవ పట్టించి కేసు వేయించారు.

బీఆర్ఎస్ పార్టీ మాధవ్ రెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలి. బీసీల నోటికాడ ముద్ద లాక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తికి బీఆర్ఎస్ రాజముద్ర వేసినట్లుగా పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక బీసీలకు ఏటా 20 వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెడతామని కాంగ్రెస్ చెప్పింది. కానీ గత రెండు బడ్జెట్లు కలిపి 7వేల కోట్లు కూడా నిధులు కేటాయించలేదు. త్వరలోనే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పుడు బీసీ సబ్ ప్లాన్ పై కసరత్తు చేయాలి. బీసీ సబ్ ప్లాన్ సహా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సవరించుకోవటానికి ఈ బడ్జెట్ మంచి అవకాశం. ఆ తర్వాత ఒక్క బడ్జెట్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వచ్చే బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ ఉంటుంది.
ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరికేపూడి గాంధీని నిజామాబాద్ ఎన్నికలకు ఇంఛార్జిగా పంపారు. పార్టీ పరంగా లెటర్ ఇచ్చి మరీ ఆయనను కాంగ్రెస్ ఇంఛార్జిగా వేసింది. నిజానికి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఆయనకు ప్రతిపక్షాలకు ఇచ్చే పీఏసీ ఛైర్మన్ పదవి కూడా ఉంది. స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించిన ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావులను కాంగ్రెస్ ఇన్ ఛార్జీ లుగా నియమించారు. అంటే ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ ఘోరంగా హేళన చేస్తోంది.
ప్రజలు ఎవరినీ నమ్మాలో, ఎవరినీ నమ్మొద్దో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే మాలాంటి సంస్థలు ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. రాహుల్ గాంధీ పట్టుకునే రాజ్యాంగం మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీని ఇంఛార్జీగా తీసివేయాలి. అదే విధంగా స్పీకర్ ఇప్పుడైనా సరే గాంధీ మీద అనర్హత వేటు వేయాలి.
12న ఆత్మగౌరవ సభ
ఉద్యమకారుల విషయంలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చాక కూడా మోసం చేసాయి. బీఆర్ఎస్ ఉద్యమకారులను మోసం చేసిందన్న కారణంతో వారంతా కూడా కాంగ్రెస్ కు ఓటు వేశారు. కానీ కాంగ్రెస్ కూడా వారికి న్యాయం చేయటం లేదు. ఉద్యమకారులకు ఇస్తామన్న భూమి కోసం మేము కరీంనగర్ లో భూపోరాటం చేశాం.
ఈ నెల 12 న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పెడుతున్నాం. ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ వాదులు హాజరై విజయవంతం చేయాలి.
రేవంత్ మర్యాద తప్పారు
ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయన్నది ప్రజలు గమనించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను ఎలా మోసం చేశాయో చూశాం. బీజేపీ గురించి మాట్లాడుకోవటం కూడా వృథా. ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో మున్సిపల్ ఎన్నికల్లో మేము సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాం. మా మాదిరిగానే ప్రశ్నించే సీపీఎం, న్యూ డెమాక్రసీ సహా ప్రశ్నించే స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నా. ఉద్యమంలో మనందరికీ ఒక పేజీ ఉంటే కేసీఆర్ గారికి పుస్తకమే ఉంటుంది. చరిత్రను ఎవరూ చెరిపివేయలేరు. రేవంత్ రెడ్డికి కూడా చరిత్ర ఉంది. కానీ రేవంత్ రెడ్డి తనది మంచి చరిత్రనా కాదా అర్థం చేసుకోవాలి. నేను కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడటం లేదు. రాజకీయంగా ఆయన విధానాలను విభేదిస్తా. అయితే తెలంగాణలో మర్యాదపూర్వకమైన రాజకీయాలు ఉండాలని నేను కోరుకుంటున్నా. విమర్శలు చేసేప్పుడు ఒక లైన్ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి అన్ని లైన్లు దాటి విమర్శలు చేశారు. ఒక జాతిని విమర్శించటం అనేది ఎవరూ హర్షించరు.
చిన్న చేపలే బలి
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అనే చిన్న చేపను పట్టుకొని పెద్ద చేపలను వదిలేసే ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. డీఎస్పీగా ఉన్న ఆయనకు డిమోషన్ ఇచ్చారంటే ఏమైనా ఆధారాలు దొరికాయోమో? ఐతే గతంలో కూడా చాలా మందికి తప్పుదారిలో ప్రమోషన్స్ ఇచ్చారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులను ఇబ్బంది పెట్టకుండా రాజకీయాలు ఉండాలి. ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్ మాదిరిగా సాగదీస్తున్నారు. ఎప్పుడు తుది దశకు తెస్తారో చెప్పాలి.








