కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎరుకల కాలనీలో ఎరుకుల కుల సంఘం సభ్యులతో శనివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం రాకముందు తమ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయని ఎరుకల కులస్తులు కవితతో మొరపెట్టపకున్నారు. వారి పరిస్థితి తెలుసుకున్న కవిత నిజంగా ఇది చాలా బాధపడాల్సిన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.



ఎంపవర్ మెంట్ స్కీంతో ఒరిగిందేమీ లేదు
“తెలంగాణ వచ్చాక అయిన పరిస్థితి మెరుగు పడాల్సి ఉండే. కొంతవరకు పనులు చేయించుకోగలిగాం. కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇక్కడ ఉన్న చిన్న గుడిసెలు చూశాను. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావల్సి ఉన్నా వారికి దక్కలేదు. ఇందిరమ్మ ఇళ్లు కూడా కొందరికే వచ్చాయని చెబుతున్నారు. కానీ ఇక్కడ ఆడపిల్లలు కొందరు డిగ్రీ వరకు చదివుకున్నారు. నిజంగా 54 శాతమే అక్షరాస్యత ఉన్న చోట మహిళలు చదువుకోవటం సంతోషించాల్సిన విషయం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే చదువు మాత్రం ఆపవద్దు. ఒక్కసారి చదువుకుంటే చదువే మనకు జీవిత కాలం ఉంటుంది. ఆదివాసీ, గిరిజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడైన లోకిని రాజు జాగృతి విభాగానికి అధ్యక్షులు. ఆదివాసీ, గిరిజన విభాగాల్లో ఎప్పుడు కూడా ఎరుకల వారికి అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు. ఏకలవ్యుడిని దేవుడిగా భావించే ఎరుకల వారికి ఉన్న నైపుణ్యం ఆదివాసీ బిడ్డలందరికీ విస్తరించాలి. మేము జాగృతిలో ప్రత్యేకంగా ఆదివాసీ వింగును కూడా ఏర్పాటు చేసుకున్నాం. ములుగు లో ఉన్న నాంచరమ్మ గుడి అభివృద్ధిని రాజు పట్టుబట్టి చేయించారు. మేము కూడా అక్కడకు వెళ్లాం. దానికి కావల్సిన వసతులు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నాంచరమ్మ, ఏకలవ్యుడి పేరు నిలబడేలా అభివృద్ది జరగాలని కోరుకుంటున్నా. తెలంగాణ వచ్చాక ఎరుకల ఎంపవర్ మెంట్ స్కీమ్ అని జీవో వచ్చింది. కానీ ఎవరికీ మేలు జరగలేదు. ఎరుకల కులవృత్తి పందుల పెంపకం, చీపుర్లు అల్లటానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా సరే ఎరుకల ఎంపవర్ మెంట్ స్కీమ్ ను పూర్తి చేయాలి. హైదరాబాద్ లో ఆదివాసీ, గిరిజన భవన్ పూర్తి అయ్యింది. ఒక్కో సమస్యను పరిష్కరించే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తోంది. దానికి మీ అందరి సపోర్ట్ కావాలని నేను కోరుతున్నా.”








