చేనేత కార్మికులకు మద్దతుగా ఉద్యమం, పొలిటికల్ పవర్ మాత్రమే అల్టిమేట్


భూదాన్ పోచంపల్లిలో నేత కార్మికులతో సమావేశం- (భూదాన్ పోచంపల్లి)

చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన మేరకు తక్షణమే ఋణమాఫీ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసినట్లే చేనేత కార్మికులను మోసం చేసిందని దుయ్యబట్టారు. జాగృతి జనంబాటలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో బుధవారం చేనేత కార్మికులతో కవిత సమావేశమయ్యారు. వారి స్థితిగతులు, వృత్తిపర సమస్యలు, అవసరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఋణమాఫీ విషయంలో ప్రభుత్వ తీరును తప్పు పట్టారు.  

ఋణమాఫీ కోసం ఉద్యమం

” ఎన్నికల సమయంలో వెంటనే రుణం తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి చెప్పిన మాటతో నేత కార్మికులు బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఋణమాఫీ చేయటం లేదు. ఋణమాఫీ అవుతుందన్న ఉద్దేశంతో చేనేతలు కిస్తీలు కట్టటం లేదు. దీంతో బ్యాంకుల్లో చేనేత కార్మికుల సిబిల్ స్కోర్ తగ్గే పరిస్థితి వచ్చింది. బ్యాంకులు వడ్డీ మీద వడ్డీ వేస్తూ ఉన్నాయి. తప్పు మీది కాదు. బ్యాంకులది కాదు. 14 నెలలు ఋణమాఫీ ఆలస్యం చేసి చేనేత కార్మికులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. మేము ఒత్తిడి చేస్తే చేనేత ఋణమాఫీకి రూ.33 కోట్లు రిలీజ్ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటన చేసింది.. కానీ ఒక్క చేనేత కార్మికుడికి కూడా మాఫీ కాలేదు. చేనేత ఋణమాఫీ కోసం అవసరమైతే సీఎం ఇంటిని కూడా ముట్టడిద్దాం. థ్రిప్ట్ స్కీం ద్వారా కార్మికుడు రూపాయి జమ చేస్తే ప్రభుత్వం రెండు రూపాయలు జమ చేసేది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చేనేత సమస్యలపై అవగాహన లేదు. అమౌంట్ తగ్గించారు. ముగ్గురు ఉంటే ఇద్దరికే చేశారు. రైతులు, చేనేత కార్మికులు, పేదల వద్ద కోత విధించి ఈ ప్రభుత్వం ఏమి మిగిల్చుకుంటుంది. థ్రిప్ట్ స్కీం యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా.” 

సబ్సిడీ కొనసాగించాలి

“తర్వాతి తరాలు చేనేత వృత్తిని కొనసాగించటం లేదు. 

ఇంకా మగ్గాలను బతికిస్తున్న వారిని చేనేత కార్మికులు కాదు కళాకారులు అనాలి. వారి సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించాలి. తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం నూలు సబ్సిడి అందించింది. ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి చేనేత సమస్యలపై కనీస అవగాహన లేదు. మళ్లీ యార్న్ సబ్సిడీ పునరుద్ధరించాలి. ఆరేళ్లుగా సహకార సంఘం ఎన్నికలు జరగలేదు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. “

కొండా స్ఫూర్తిగా..

” గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ టైగర్ లా రాజకీయాలు చేసే వారు. ప్రభుత్వాలను బెదిరించి మరీ పనులు చేసేవారు. కానీ ఆ తర్వాత పద్మశాలీల నాయకత్వం తగ్గిపోయింది. నేతన్నలకు ఇప్పుడు నేను చెప్పే మాటలు కాస్త కఠినంగా అనిపించవచ్చు. బీఆర్ఎస్ ఒక పద్మశాలీకి మాత్రమే అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ యకుత్ పురా ఒక్క సీటు మాత్రమే ఇచ్చింది. పద్మశాలీల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ మాదిరిగా రాజకీయాలు చేసే వారు రావాలి. చేనేతలు తమ పనులు చేయించుకోవాలంటే ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర జనాభాలో ముదిరాజ్ లు, పద్శశాలీలు ఎక్కువగా ఉంటారు. అయినా సరే పార్టీలు ఎందుకు భయపడతలేవు? ఏ పార్టీలో ఉన్నా సరే పద్మశాలీని నిలబెట్టుకొని గెలిపించుకోవాలి. కమ్యూనిటీలో ఐక్యత లేకపోవటంతోనే ప్రభుత్వాలు భయపడటం లేదు. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో గతంలో కన్నా తక్కువగా బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. అప్పుడు బీసీలు కనీసం ఎక్కడ కూడా ఎన్నికలను బహిష్కరించలేదు. పొలిటికల్ గా ఎదిగితేనే మన మాట ఎవరైనా వింటారు. పొలిటికల్ పవర్ మాత్రమే అల్టిమేట్ పవర్. ఏ పార్టీలో ఉన్నా సరే మీ వాయిస్ గట్టిగా వినిపించే పరిస్థితి ఉండాలి. గతంలో రూ.1200 కోట్ల బడ్జెట్ పెడితే మొన్నటి బడ్జెట్ లో రూపాయి పెట్టలేదు. అయినా సరే అడిగే వాళ్లే లేరు. పొలిటికల్ గా మన రిప్రజేంటేషన్ ఉండాల్సిందే. పద్మశాలీల సంఖ్య అన్ని పార్టీల్లో ఎక్కువగా ఉన్నప్పుడే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుంది. మీ సమస్యలపై ఎప్పుడు ఎక్కడికి రమ్మన్న సరే మీ సోదరిగా వచ్చి పోరాటం చేస్తాం. మీ అడుగులో అడుగు వేస్తూ మీ కోసం ఫైట్ చేస్తా. నేను మొన్న టెస్కోలో చేనేత చీరలు కొనటానికి వెళ్తే అక్కడ ఆంధ్రా సరుకే ఎక్కువగా ఉంది. 

గతంలో ఉన్న టెస్కో లను మూసేశారు. మళ్లీ టెస్కోలను ప్రారంభించాలి. ముంబై, బెంగళూరు, ఢిల్లీలో కేంద్రాలు పెట్టాలి. భగవంతుడు నాకు ఎప్పుడు అవకాశం కల్పించినా నేతన్నల కోసం పనిచేస్తా. బొల్ల శివశంకర్ గారు పద్మశాలీల సమస్యల గురించి నాకు చాలా చెప్పారు. భవిష్యత్ లో ఆయనతో కలిసి పద్మశాలీల సమస్యలపై పోరాటం చేస్తాం. 

పద్మశాలీలు ఆత్మహత్యలు చేసుకోవద్దు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిగా రాజకీయాలు చేయాలి.”