కవిత నిరవధిక నిరాహార దీక్ష
(ఖమ్మం)
వెలుగుమట్ల బాధితుల సమస్య పరిష్కారమయ్యేంతవరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కోనసాగిస్తామని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వం స్పందించే వరకు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అనూహ్యంగా ఆమె చేపట్టిన దీక్షతో పోలీసులు, అధికారపక్ష నేతలు ఉలిక్కి పడ్డారు. బాధితుల పక్షాన వారు ఆశ్రయం ఉంటున్న అంబేద్కర్ భవన్ లోనే దీక్ష చేపట్టారు. వెలుగుమట్ల బాధితులకు సోమవారం సంఘీభావం తెలిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాధితులతో కలిసి జెడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి ఆందోళన చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ఆందోళన చేసినందుకు 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి సాయంత్రం స్టేషన్ నుంచి విడుదల చేశారు.
భూదాన్ భూమిని పేదలకు ఇవ్వాలన్న కవిత
ఆందోళన ముగిసిందని పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఖమ్మం అంబేద్కర్ భవన్ కు చేరుకొని వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు కవిత. జాగృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ సంయుక్తంగా వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా దీక్షకు దిగారు. ఏ పార్టీ, ఏ సంస్థ కూడా చెప్పనంత బలంగా వెలుగుమట్ల బాధితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చామని కవిత వెల్లడించారు. ప్రత్యేకించి వారి సమస్యలు, ఆకాంక్షలను రాష్ట్రస్థాయిలో వినిపించామని బలంగా నమ్ముతున్నట్లు వివరించారు. ఈ సమస్య పరిష్కరమయ్యే వరకు కూడా రకరకాలుగా ఆందోళన చేస్తామని భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. అదే విధంగా బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చారో అక్కడే వాళ్లకు ఇళ్లను కట్టించాలని డిమాండ్ చేశారు.
అది ప్రభుత్వ భూమి కాదని, భూదాన్ ద్వారా సేకరించిన భూమి కాబట్టి భూదాన్ భూమి అంటేనే పేద ప్రజలకు పంచాల్సిన భూమి అని స్పష్టం చేశారు. బాధితులకు ఇళ్లు కట్టించే వరకు తమ పోరాటం వివిధ రూపాల్లో కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు.








