పాలమూరును మోసం చేసిన పాలకులు – సీఎం పేరుచెప్పి ఇసుక దోపిడీ
“వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి కచ్చితంగా పోటీ చేస్తుందని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలోనే ఉంటామని స్పష్టం చేశారు. జాగృతి జనంబాటలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన ఆమె సోమవారం గద్వాలలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మైనార్టీల అభివృద్ధికి జాగృతి కట్టుబడి ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలోనూ మన ఊరు-మన ఎంపీ పేరుతో ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు. మా పార్టీ నాయకులే నన్ను కుట్ర చేసి ఓడించినా ప్రజల మధ్యలోనే ఉన్నానని వెల్లడించారు. నా మనసు విరిగేలా చేశారు. మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.”
ప్రాజెక్టులు పూర్తి చేసి మాట్లాడండి
“ప్రభుత్వాలు అబద్దాలు చెప్పటం మానేసి ప్రాజెక్టులు పూర్తి చేయటంపై దృష్టి పెట్టాలి.
నెట్టెంపాడు పనులకు సంబంధించి 99, 102 ప్యాకేజీలు పూర్తి చేయలేదు. జూరాలలో మట్టిపేరుకుపోయి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. వెంటనే మట్టి తీయించాలి. నెట్టెంపాడు తెలంగాణ వచ్చాక పూర్తి కావలసి ఉన్నప్పటికీ పూర్తి కాలేదు. రేలంపాడును బేస్ చేసుకొని గట్టు ప్రాజెక్టు కడుతున్నారు. రేలంపాడే ఫిక్స్ చేయలేదు. ఇంకా గట్టుకు ఎప్పుడు నీళ్లు వస్తాయి? ఆలూరు గ్రామాన్ని కలెక్టర్ విజిట్ చేయాలి. నిజానికి 95 వేల ఎకరాలకు నీళ్లు అంటున్నారు కానీ 70 ఎకరాలకే నీళ్లు ఇస్తున్నారు. గట్టు 1.3 టీఎంసీ కెపాసిటీ పెంచేందుకు దాన్ని ఆపేసి పెట్టారు. కెనాళ్ల వద్ద చెట్లు పెరిగిపోతున్నాయి. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు బడ్జెట్ ఎందుకు ఇవ్వటం లేదు? నెట్టెంపాడు, ఆర్డీఎస్ ను పూర్తి స్థాయిలో వాడుకునేలా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. తెలంగాణ వచ్చాక తుమ్మిళ్ల కొంతవరకు పూర్తి చేసుకున్నాం. కానీ అక్కడ మూడు మోటార్లు ఉంటే ఒక్కటే నడుపుతున్నారు. పూర్తిగా మూడు మోటార్లను ఆన్ చేయాలంటే కాలువలు పెద్దగా చేయాల్సి ఉంది. కానీ అందుకు రైతులు ఒప్పుకోవటం లేదు. వారంతా తక్కువ భూమి ఉన్న రైతులే. ఇక ఈ సమస్యకు పరిష్కారమంటే 40 కిలోమీటర్లు పైప్ లైన్ వేయాల్సి ఉంది. అప్పుడు మాత్రమే మనం ఆర్డీఎస్ పూర్తిగా కెపాసిటీ వాడుకోగలం. కృష్ణానదిలో వాటా కోసం మనం ఫైట్ చేస్తుంటాం. ఏ వివాదం లేని ఆర్డీఎస్ నీళ్లను వాడుకోవటంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి.”




అరుణమ్మకు బాధ్యత లేదా
“గద్వాల్ లో అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉండటం బాధాకరం. దేశ వ్యాప్తంగా అక్షరాస్యత రేటు 80 శాతంగా ఉంటే తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో 76.9 శాతంగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 69 శాతంగానే ఉంది. అందులో గతేడాది మహిళల అక్షరాస్యత 65.9 శాతం ఉంటే 2025 నాటికి 61.1 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా మహిళల ఎడ్యుకేషన్ పెరుగుతుంటే తెలంగాణలో మహిళల ఎడ్యుకేషన్ రోజు రోజుకు తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైజింగ్ తెలంగాణ అంటూ సంబరాలు ఎలా చేసుకుంటున్నారు. ఇక గద్వాల్ లో అయితే పురుషులు 49.8 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. అందులో మహిళల అక్షరాస్యత 39.4 శాతంగా ఉంది. కేతిదొడ్డి మండలంలో అయితే 33.77 శాతం అక్షరాస్యత ఉంటే అందులో మహిళలు 23 శాతమే. ఇక్కడ ఎంపీ అరుణమ్మ ఉన్నా బీజేపీ బేటీ పడావో అంటోంది. మరి ఏం చదివిస్తున్నారో అర్థమైతలేదు. ఆవిడ సొంత జిల్లాలో కేతిదొడ్డి మండలంలో మహిళల అక్షరాస్యత 23 శాతం ఉంటే అరుణమ్మ గారు ఏం చేస్తున్నారు? ఉమ్మడి మహబూబ్ నగర్ మీ సొంత జిల్లా. ఇక్కడ అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మీరు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవటం కారణంగా కూడా ఆడపిల్లలు చదువుకు దూరమవుతున్నారు. పదో తరగతి లో పాస్ అయ్యేందుకు మాస్ కాపీయింగ్ చేస్తారంట? ఇదేమైనా బిహారా? వాళ్లు ఇంటర్ కు వచ్చాక రిజల్టే ఉండదు. మీకు పేరు వచ్చేందుకు రిజల్ట్ చూపించుకుంటారా? కేరళలో 95 శాతం అక్షరాస్యత ఉంటే మన వద్ద మాత్రం మహిళల అక్షరాస్యత 23 శాతం ఉంది.”
గద్వాలది ఘనకీర్తి
“గద్వాల్ అంటేనే వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతంగా చెబుతారు. తుంగభద్ర, కృష్ణానది కలిగిన నడిగడ్డ ప్రాంతంగా ఉన్న జిల్లా ఇది. అన్ని సంస్కృతులు కలిగిన ఇక్కడ భాష అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి మనుషులు ముక్కుసూటిగా ఉంటారు. చాలా మంచి సంస్కృతి కలిగిన నేల. విద్వత్తు కలిగిన ప్రాంతం ఇది. ఎంతో మేధా సంపత్తి కలిగిన నాయకులను ఇచ్చిన ప్రాంతం. సురవరం ప్రతాప్ రెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ, బాగా పుల్లారెడ్డి లాంటి వాళ్లు ఈ ప్రాంతం వాళ్లే. ప్రపంచంలోనే అతి తక్కువ నీళ్లలో ఉండే మహల్స్ ఉంటాయి. నిజాం గారు కట్టిన కొండ కోట కూడా ఇక్కడ ఉంటుంది. తెలంగాణ వచ్చాక దాన్ని మంచి టూరిస్ట్ ప్రాంతంగా ప్రమోట్ చేసుకోవాల్సినా చేసుకోలేకపోయాం. తిరుమలకు పంపించే ఏరువాడ జోరు పంచాలు కూడా మన గద్వాల్ నుంచే వెళ్తాయి. రాజోలి, గద్వాల్ చేనేత పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రాజులు కట్టుకునే చేనేత వస్త్రాలను నేసే వారు గనుక రాజోలి అని పేరు వచ్చింది. ఈ ప్రాంతం పేరు చెప్పగానే ఆడబిడ్డలు ఇష్టపడే పట్టుచీరలు గుర్తుకు వస్తాయి. మన ప్రాంతంలో అద్భుతమైన కళాకారులు, వనరులు ఉన్నాయి. “
ఇసుక మాఫియా సీఎం పేరు చెప్తున్నది
“గద్వాల్ లో జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు బాగాలేవు. ప్రతి ప్రాంతంలో సీఎం బొమ్మ పెట్టుకొని టిప్పర్లతో ఇసుక దందా చేస్తున్నారు. ఎవరైనా అడిగితే పై నుంచి ఫోన్లు వస్తున్నాయి. దీంతో అధికారులు భయపడుతున్నారు. సీఎంకు ఈ దందాతో సంబంధం లేకపోతే వెంటనే దీనిపై చర్య తీసుకోవాలి. ఇసుక మాఫియా కారణంగా జిల్లాలో రోడ్లు ఆధ్వాన్నంగా మారాయి. గతంలో ఇక్కడ నుంచి వలసలు ఉండేవి. మనకు అప్పు ఇవ్వాలంటే ఇక్కడకు వచ్చి మనల్ని కోతుల్ని చూసినట్లు చూసేవారు. వరల్డ్ బ్యాంక్ ఛైర్మన్ ద్వారా చంద్రబాబు అప్పు తెచ్చాడు. ఆ తెచ్చిన డబ్బు ఏమైందో తెలియని పరిస్థితి. వరల్డ్ బ్యాంక్ ఛైర్మన్ ఇప్పుడు వచ్చి చూస్తే ఏడ్చే పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చాక మనం ఇంకా అభివృద్ధి అవుతామని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఒకటే కుటుంబం కదా ఇక్కడ రాజకీయాన్ని ఏలుతోంది? అయితే వాళ్ల బావలు, అల్లుళ్లు, బంధువులు వీళ్లే కదా ఉండేది. గద్వాల్, ఆలంపూర్ లో రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉంది. రోడ్లు బాగాలేకపోవటంతో స్కూల్ బస్సు రాక స్కూల్ కు వెళ్లటం లేదని పిల్లలు చెబుతున్నారు. ఈ రోడ్ల మీద తిరిగే టిప్పర్లు యాక్సిడెంట్ చేసినా అడిగే వారే లేరు. జాగృతి జనంబాట ఏదో మొక్కుబడిగా కాకుండా ఒక అధ్యయనంలా చేస్తున్నాం. గద్వాల్ లో అక్షరాస్యత, నీళ్లు, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏమీ లేదు. ఇక్కడున్న చాలా మంది పిల్లలు గంజాయికి బానిసగా మారారని చెబుతున్నారు. ఇన్నాళ్లుగా మీ కుటుంబాన్నే గెలిపించటం ప్రజలు చేసిన పాపామా? ఏ పార్టీ గెలిచినా అందులో ఉండేది మీరే కదా? గద్దెనెక్కిన తర్వాత ఏం చేస్తున్నారు? తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఈ విధంగా పరిస్థితి ఉంటుందా? “
ఇథనాల్ ఫ్యాక్టరీతో విధ్వంసం
“ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ పెద్ద ధన్వాడలో 14 గ్రామాల ప్రజలు ధర్నా చేస్తున్నారు. అక్కడ రకరకాల పంటలు పండే అద్భుతమైన భూములు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనుమతులిచ్చారు. రైతుల దగ్గర మోసం చేసి ఆ భూములను కొనుగోలు చేశారు. నది రివర్ బెడ్ కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీకి ఎలా పర్మిషన్ ఇస్తారు? కచ్చితంగా పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి. నది సమీపంలో ఫ్యాక్టరీకి అనుమతిస్తే వ్యర్థాలను కూడా నదిలోకి వదులుతారు. మూసీనది విషయంలో ఇదే జరిగింది. ఈ ఫ్యాక్టరీని ఆపేందుకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి రంజిత్ తో పాటు జాగృతి ఫైట్ చేస్తోంది. ఐజా కాటన్ సీడ్ విషయంలో పెద్ద మాఫియానే నడుస్తోంది. కాటన్ సీడ్ పండించే రైతులకు ఏమాత్రం మంచి జరగటం లేదు. వారికి ఇచ్చే డబ్బులను ఏడాదైనా సరే ఇవ్వటం లేదు. కంపెనీకి రైతులకు మధ్య అగ్రిమెంట్ ఉండాల్సి ఉంది. కానీ ఆర్గనైజర్ల వ్యవస్థ పేరుతో రైతులను దోచుకుంటున్నారు. గతంలో రైతు కమిషన్ ఛైర్మన్, కలెక్టర్ వచ్చి రైతులకు మేలు చేస్తామని చెప్పారు. నిజానికి కంపెనీతో రైతులకు అగ్రిమెంట్ చేయించే విషయంలో కలెక్టర్ చొరవ చూపాలి. కంపెనీతో ఒప్పందం ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా జరిగితే అడిగే పరిస్థితి ఉంటుంది. కానీ పూర్తిగా దళారీ వ్యవస్థను రాజకీయ నాయకులే ప్రొటెక్ట్ చేస్తున్నారు. “




ఆంధ్ర కోసం మన భూములా
“కర్నూల్ కోసం గుండ్రెవుల ఎత్తిపోతల పథకం తెస్తున్నారు. ఇందులో మన 24 గ్రామాలు మునిగే పరిస్థితి ఉంది. ఈ 24 గ్రామాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అలా జరగటానికి ఒప్పుకోం. ఒక్క ఇంచు భూమి కూడా తెలంగాణ నుంచి ఇవ్వకుండా జాగృతి పోరాటం చేస్తుంది. “
చేనేతన్నను ఆదుకోవాలి
“తిమ్మప్పవారి స్వామి ఆలయాన్ని తెలంగాణ వచ్చాక కూడా అభివృద్ధి చేయలేదు. గద్వాల్ లో గంగా, జమున తెహజీబ్ ఉంది. ఇక్కడ ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి. ఒకటే కుటుంబానికి 70 ఏళ్లకు పైగా అధికారం ఇస్తే ఏం మార్పు జరిగింది. కొత్త వాళ్లు వస్తేనే అభివృద్ధి జరగుతుంది. అడిగే వాళ్లు కచ్చితంగా ఉండాలి. రాఘవేంద్ర కాలనీలో చేనేత కార్మికులకు మేలు చేయాలి. స్కిల్ డెవలప్ మెంట్ వాళ్లు ఇచ్చిన మెషీన్లు నాసిరకంగా ఉన్నాయి. అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు. ఈ విషయంలో చేనేతలకు మేలు చేయాలని అరుణమ్మను డిమాండ్ చేస్తున్నా. 50 ఎకరాల్లో ఇక్కడున్న చేనేత పార్క్ కు గతంలో వైఎస్ భూమి పూజ చేస్తే తర్వాత కేటీఆర్ చేశారు. ఒక ఇండస్ట్రీ కోసం రెండు సార్లు పూజ చేశారు.. కానీ చేనేతలకు మేలు చేయలేదు. గద్వాల్ లో చేనేత పనిచేస్తున్న 350 మంది 20 ఎకరాల స్థలం కావాలని అడుగుతున్నారు. వారికి ఆ భూమిని ఇస్తే చేనేతలకు మేలు చేసినట్లు అవుతుంది. రాఘవేంద్ర కాలనీలోనే 3500 మందికి ఇచ్చిన పట్టాలను లాక్కొని అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారు. అందులో 500 మంది పేర్లు మాత్రమే రాసుకొని వారికి కూడా మేలు చేయలేదు. అత్తగారు పట్టాలు ఇస్తే…అల్లుడు లాక్కొన్నారు. మళ్లీ ఎన్నికల నాటికి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఈ పట్టాలు ఇప్పిస్తామని చెబుతారు. 3500 మందికి పట్టాల కోసం జాగృతి తరఫున కచ్చితంగా ఫైట్ చేస్తాం.”
గద్వాల్ లో వైద్య సౌకర్యాలు పూర్
“గద్వాల్ లో 300 పడకల హాస్పిటల్ ఉన్నా సరే వైద్యం కోసం కర్నూల్ వెళ్లాల్సిన పరిస్థితి.
అక్కడ ఆరోగ్యశ్రీ వర్తింపజేయకపోవటంతో ప్రజలు ప్రైవేట్ కు వెళ్తున్నారు. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు. ఆయన కాంగ్రెస్ లో ఉంటే సీఎంతో మాట్లాడి హాస్పిటల్ లో సౌకర్యాలు కల్పించాలి. ప్రతిపక్షంలో ఉంటే హాస్పిటల్ లో సౌకర్యాల కోసం ధర్నా చేయాలి. మీరు ఏమీ చేయకపోతే జాగృతి తరఫున ఆ పని మేము చేస్తాం.
గద్వాల్ లో రెండు గురుకులాలను ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ భవనాల్లోనే పెట్టారు. వచ్చే ఫిబ్రవరి నుంచి అద్దె గదుల్లో ఉండవద్దని సీఎం చెబుతున్నారు. కానీ గతంలో పెండింగులో ఉన్న బకాయిలు కట్టాలి. అదే విధంగా గురుకులాలు ఎక్కడ పెడతారో చెప్పాలి. ఈ సీఎంను ప్రశ్నిస్తే డైవర్షన్, కరెప్షన్ అంటూ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏమైనా అంటే కేసీఆర్ ను, కిషన్ రెడ్డిని తిడుతూ డైవర్షన్ చేస్తున్నారు. మీ సొంత మహబూబ్ నగర్ కు కూడా ఏం చేయటం లేదు. విద్యాశాఖ మంత్రిగా గద్వాల్ లో అక్షరాస్యత పెంచటంపై ముఖ్యమంత్రి శ్రద్ధ పెట్టాలి.
గతంలో ఎన్నో హామీలిచ్చిన ప్రియాంక గాంధీ ఎన్నికల తర్వాత ఇటు వైపే రాలేదు. జాబ్ క్యాలెండర్ అన్న రాహుల్ గాంధీ ఫుట్ బాల్ మ్యాచ్ కు వచ్చారే గానీ విద్యార్థుల వద్దకు రాలేదు. ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి చేయాలి. గద్వాల్ యువ మిత్రులు, మహిళలకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ప్రపంచం మారుతోంది. మారుతున్న ప్రపంచంతో పోటీ పడాలంటే మన పిల్లలను చదివించాలి. జనంబాటలో భాగంగా మేము అనేక సమస్యలను పరిష్కరించాం. గద్వాల్ లో కూడా సమస్యపై పోరాటం చేసేందుకు ఇక్కడ పటిష్ఠమైన టీమ్ ను ఏర్పాటు చేస్తాం.”
రాజకీయంగా మైనార్టీలకు ప్రాధాన్యం
“ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంపై స్టడీ చేసేందుకు బీసీ కమిషన్ కు రీసెర్చ్ కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ రిపోర్ట్ కేంద్రానికి వెళ్లింది. కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవటం లేదు. ఈ విషయంలో నేను కేసీఆర్ ను ప్రొటెక్ట్ చేయటం లేదు. ఇప్పుడు ఆయన దారి వేరు.. నా దారి వేరు. మేము మైనార్టీలకు అండగా ఉంటాం. జాగృతిలో మైనార్టీల వింగ్స్ ఏర్పాటు చేశాం. వారికి రాజకీయంగా కూడా రిప్రంజటేషన్ ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను.”








