-కల్వకుంట్ల కవిత
మణుగూరు కోయగూడెంలో జనంబాట
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం మణుగూరు కోయగూడెం ఓపెన్ కాస్ట్ 2లో నిర్వాసితులైన గొత్తికోయ గూడాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గూడానికి కనీసం రోడ్డు, కరెంట్, తాగునీటి సౌకర్యం, స్కూల్ కూడా లేకపోవడంపై కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి తరఫున ఆదివాసీలను ఆదుకుంటామని, సమస్యలను ప్రభుత్వం, సింగరేణి సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు మణుగూరు ఓసీ 2ను సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి క్యాంటీన్ లో టీ తాగారు. ఓసీ 2 వద్ద తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
” సింగరేణి గని విస్తరణ కోసం మణుగూరు దగ్గరలోని కోయగూడెంలో 2016 లో భూ సేకరణ చేశారు. పూర్తిగా ఈ గూడెం ప్రజల భూమి తీసుకొని వారికి లక్షా 60 వేల ర4పాయల మినిమమ్ ప్యాకేజీ మాత్రమే ఇచ్చారు.
నిర్దాక్ష్యంగా 72 గిరిజన కుటుంబాలను రోడ్డు మీద పడేశారు. దీంతో అడవి ఆధారంగా బతికే ఈ బిడ్డలు వేరే చోటకు వచ్చి బతుకుతున్నారు. దాదాపు 8 ఏళ్లుగా ఇక్కడ ఉంటూ ఇప్పుడిప్పుడే వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ వారికి కనీసం తాగటానికి నీళ్లు కూడా లేని దయనీయ పరిస్థితి. సింగరేణి యాజమాన్యం ఈ బిడ్డలకు నీళ్లు కూడా ఇవ్వకుండా చిత్ర హింసలు పెడుతోంది. ఇది చాలా తప్పు. వారికి అన్యాయం చేయటం సరికాదు. అడవి మూలవాసులు ఈ గిరిజన బిడ్డలే. అక్కడి బొగ్గు తీసుకోవటానికి వారి జీవితాలను ఛిన్నభిన్నాం చేస్తున్నారు.
వీళ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు ఇళ్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్లు పనిచేసుకునే చోట వారికి హక్కులు కల్పించాలి. ఏమీ చేయకుండా 72 కుటుంబాలను రోడ్డు పై వేయటం మంచిది కాదు. రాష్ట్రపతి ముర్ము ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు. అవసరమైతే వారిని కూడా కలిసి ఈ బిడ్డల బాధలు తీర్చామని కోరుతాం. రాష్ట్రపతి, గవర్నర్ వద్దకు వెళ్లి గిరిజన బిడ్డలకు న్యాయం జరిగేలా చేస్తాం. ఈ అడవి గిరిజన బిడ్డలది. వారి హక్కులను కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదు. వీరి సమస్యకు పర్మినెంట్ సొల్యుషన్ రావాలి. దానికోసం జాగృతి తరఫున ఫైట్ చేస్తాం. ఇక్కడ కేవలం 17 మంది మాత్రమే స్కూల్ కు వెళ్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న స్కూల్ ను తీసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బాధలు ఉన్నాయి. ఈ సమస్యలపై సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని హెచ్చరిస్తున్నాం. “


















