బకాయిలపై మాట తప్పిన సీఎం – (భువనగిరి)
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో పెద్దల భూములను రక్షించేందుకు పేదల భూములను బలి పెడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి ఊరి బయట నుంచి నిర్మించాల్సిన ట్రిపుల్ ఆర్ ను పట్టణాల మధ్య నుంచి నిర్మిస్తున్నారని విమర్శించారు. నాయకుల స్వార్థం కోసం ఇష్టారీతిగా అలైన్ మెంట్ మార్చారని దుయ్యబట్టారు. జాగృతి జనంబాటలో భాగంగా యాదాద్రి-భువనగిరి జిల్లాలో పర్యటించిన కవిత బుధవారం భువనగిరిలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనంబాటలో తాము పరిశీలించిన సమస్యలను వివరించారు.

రింగురోడ్డుతో పట్టణాలు ముక్కలు
“భువనగరి మున్సిపాలిటీ లో ఉన్న రాయగిరి ప్రజలు ఇప్పటికే ఆరేడు ప్రాజెక్టుల కోసం ఈ ప్రాంతం ప్రజలు తమ భూములు ఇచ్చారు. మళ్లీ ట్రిపుల్ ఆర్ కోసం వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూసేకరణ విషయంలో ఉర్రూతలూగి ఇక్కడి ప్రజలకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆయన ప్రజలకు ఇచ్చిన హామీని మర్చిపోయారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ప్రజలకు మాట ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవటం లేదు. అసలు రింగ్ రోడ్డు అంటే పట్ణణాల చుట్టూ బయట నుంచి వెళ్లేది. కానీ ట్రిపుల్ ఆర్ విషయంలో మాత్రం దాని విరుద్ధంగా చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్ లాంటి ప్రాంతాల్లో ఈ రోడ్డు ఊర్లో నుంచి వెళ్తోంది. ట్రిపుల్ ఆర్ ఉత్తర, దక్షిణ ప్రాంతంలో ఇప్పటికే మూడు నాలుగు సార్లు అలైన్ మెంట్ మార్చారు.
మేము నేషనల్ హై వే వాళ్లను అడిగినప్పుడు వాళ్లు శాటిలైట్ మ్యాప్ ద్వారా సర్వే చేస్తున్నామన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీల్లో ప్రజలకు ఇబ్బంది ఉండదని, దీన్ని మార్చటం సాధ్యం కాదని అన్నారు.
కానీ నాయకుల అవినీతి కోసం ఆలైన్ మెంట్ ను చాలా సార్లు మార్చారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ ఉన్న 8 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈ అవినీతిలో భాగమైన వారి పేర్లు చెబితే నన్ను బద్నాం చేస్తున్నారు. ఇన్నిసార్లు ఆలైన్ మెంట్ మార్చవద్దని హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇప్పుడైనా సరే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని పేదలకు అన్యాయం జరగకుండా చూడాలి. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ ప్రాజెక్ట్ మున్సిపాలిటీల నుంచి పోదు అన్నారు. బీజేపీ ఎంపీలు 9 మంది సంతకం చేసిన తర్వాత కూడా ఆలైన్ మెంట్ మార్చుతున్నారు. దీని పై జాగృతి తరఫున ఉద్యమిస్తాం. బాధిత రైతులతో జనవరి 5 న హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. “
బస్వాపూర్ రైతులకు పరిహారం
“ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ లో బస్వాపూర్ చిన్న చెరువుగా ఉండే. కానీ రీ డిజైన్ లో భాగంగా చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని 5 వేల ఎకరాలు సేకరించారు. 11.7 టీఎంసీ కెపాసిటీ పెంచారు. కానీ నిర్మాణం, నీళ్లు ఇచ్చే విషయంలో ఫోర్స్ ఫుల్ గా పనిచేయలేదు. ఇప్పటి వరకు కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ ఛానెల్స్ పూర్తి కాలేదు. చుక్క నీరు కూడా రాలేదు. పైగా ఊట కారణంగా అక్కడున్న పొలాలకు నీళ్లు వస్తున్నాయి. ఇక్కడి ప్రజలకు సరైన పరిహారం అందలేదు. పైగా 96 ఎకరాలను ఎలాంటి పరిహారం ఇవ్వకుండా తీసుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో కళ్ల ముందు ఇంతటి అన్యాయం జరగుతుంటే చూస్తూ ఊరుకోలేం. కలెక్టర్ చొరవ చూపి 96 ఎకరాల రైతులకు కూడా పరిహారం అందించాలి.”
100 పడకల దవాఖాన
“ఆలేరులో 30 పడకల హాస్పిటల్ ను 100 పడకలుగా మార్చాలని 40 ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ హాస్పిటల్ మాత్రం కట్టించలేదు. అయినా సరే ఈ పార్టీలను భరిస్తున్న ఆలేరు ప్రజలకు మాత్రం నా సెల్యూట్. ఈ ప్రాంతం హై వే కావటంతో హెవీ లోడ్ వెహికిల్స్ వస్తూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. వెంటనే ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ను కట్టాలి. ఆలేరు- జనగాం మధ్యలో కొత్త బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి.”
పట్టాలివ్వరా..?
“మోటకొండూరులో సర్వే నంబర్ 950 లో 600 ఫ్లాట్లు ఉన్నాయి. చామల లక్ష్మీ నరసింహారెడ్డి అనే పెద్ద మనిషి అప్పట్లోనే ఈ భూములకు ఫార్మాలైజ్ చేశారు. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రజలకు పట్టాలు ఇవ్వటం లేదు.
వాళ్లకు పట్టాలు వచ్చే వరకు కూడా జాగృతి తరఫున పోరాటం చేస్తుంటాం. చందుపట్ల కో ఆపరేటివ్ బ్యాంక్ లో 18 వందల మందికి ఋణమాఫీ కాలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాల హయాంలో ప్రకటించిన ఋణమాఫీ వాళ్లకు వర్తించలేదు. ఎందుకని అడిగితే కలెక్టర్, అధికారులు ఎవరు సమాధానం చెప్పటం లేదు.
సౌత్ ఆఫ్రికాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న సుదగాని ప్రవీణ్ కుటుంబంతో మాట్లాడాం. ఉగ్రవాదులతో ఐదారు రోజుల్లో చర్చలు జరుపుతామని చెబుతున్నారు. బాలి అంబాసిడర్ తో ఈ అంశాన్ని నేనే ఫాలో అప్ చేస్తాను. “
ఫ్లెక్సీకే స్టేడియం పరిమితం
“భువనగిరిలో లింగం హోటల్ వద్ద ఛాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించాం. డాక్టర్లు, సాప్ట్ వేర్ ఇంజనీర్లు, విద్యా వేత్తలు మాతో మాట్లాడారు. ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలని వారంతా బలంగా కోరుకుంటున్నారు.
ఇక సీఎస్ఆర్ ఫండ్స్ రూ. 3 కోట్లతో స్టేడియం నిర్మాణం అని చెప్పారు. కానీ ఫ్లెక్సీ మాత్రమే ఉన్నాయి. స్టేడియం లేదు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు దీనిపై సమాధానం చెప్పాలి. స్టేడియం కోసం రాయగిరిలో పది ఎకరాలు కేటాయించారు. కానీ స్టేడియం పనులు ప్రారంభం కాలేదు.
ఇక్కడి యువమిత్రులు ఆగ్రహంతో విప్లవం తెచ్చే వరకు ప్రభుత్వం స్పందించదేమో? స్వర్ణకారుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. పెద్ద షాపులు వచ్చిన తర్వాత వారికి గిరాకీ లేకుండా పోయింది. మట్టెలు, పుస్తెల కోసం మాత్రం స్వర్ణకారుల వద్దకు వెళ్లే పరిస్థితి వచ్చింది. దొంగ బంగారం పేరుతో కూడా స్వర్ణకారులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి ఎస్పీతో స్వర్ణకారులను ఇబ్బంది పెట్టవద్దని చెప్పాను. ఈ విషయంలో స్వర్ణకారులను ఇబ్బంది పెడితే వాళ్లు సైనెడ్ మింగి ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఇక జియాపల్లిలో క్రషర్ కారణంగా అక్కడ ఇళ్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పోచంపల్లిలో 3500 జియో ట్యాగ్ మగ్గాలు ఉన్నాయి. మొత్తంగా 9 వేల మంది మంది చేనేత కార్మికులు ఉన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేనేతలకు ఇచ్చే రూ. 24 వేలు ఎగ్గొట్టింది. బీసీ ఋణాలను చేనేతలకు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. మేము ఒత్తిడి పెడితే రూ. 33 కోట్లు రిలీజ్ చేశామన్నారు. కానీ ఒక్క పైసా రాలేదు. వెంటనే రూ. 50 కోట్ల నిధులు విడుదల చేసి చేనేత లకు ఋణమాఫీ చేయాలి. “
దేవాదులపై నిర్లక్ష్యం
“ఒక్కొక్కటిగా క్షేత్రస్థాయిలో తెలుసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనబడుతోంది. భువనగిరి లో లక్షకు పైగా ఎకరాలకు నీళ్లిస్తామని లక్ష్యం పెట్టుకొని ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. దేవాదుల నుంచి 62 వేల ఎకరాల లక్ష్యం పెట్టుకుని 12 ఏళ్లలో 12 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. అంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 16 జిల్లాల్లో మేము కాల్వలను పరిశీలిస్తే అసలు సరైన మెయింటెనెన్స్ లేదు. దీంతో టెయిల్ ఎండ్ వరకు నీళ్లు వెళ్లే పరిస్థితి ఉండదు. ఆంధ్రాలో కాల్వల మెయింటెనెన్స్ ను ఎమ్మెల్యేలు కచ్చితంగా బాగుండేలా చూస్తారు. కానీ మన ప్రజాప్రతినిధులకు అసలు కెనాల్స్ గురించి తెలుసో లేదో? జూలూరు- రుద్రవల్లిలో లెవల్ కల్వర్టు పొంగితే బీబీ నగర్- పోచంపల్లి రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఈ బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని మంత్రి కోమటి రెడ్డిని కోరుతున్నా. “
కాల్వ కలుషితం కానివ్వద్దు
” సీఎం రేవంత్ అంటేనే ఆర్ఎస్ఎస్ సీఎం. ఇంటర్ నల్ గా ఆయన బీజేపీతో కుమ్మక్కు అయ్యారు. ఇక్కడ డ్రై పోర్ట్ కోసం 3 వందల ఎకరాలు తీసుకున్నారు. కానీ ఇందులో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం 65 ఎకరాల్లో పర్మిషన్ ఇస్తారంట. దీంతో బునాదిగాని కాలువ కలుషితం అవుతుంది. మూసీని కూడా ఇలాగే పరిశ్రమలకు పర్మిషన్లు ఇచ్చి కలుషితం చేశారు. ప్రభుత్వం వచ్చి అన్ని కొత్తగా నిర్మిస్తామని చెబుతోంది. కానీ పాత వాటిని, పాత స్కూళ్లను ముందు రిపేర్ చేయాల్సి ఉంది. ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ యూనివర్సిటీని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేయాలి. ప్యూచర్ సిటీ లో దీన్ని పెట్టాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు. ఆ ఆలోచన విరమించుకోవాలి. తుర్కపల్లి గ్రీన్ ఇండస్ట్రీ పార్క్ కోసం 93 ఎకరాలు తీసుకున్నారు. చుట్టు పక్కల 61 ఎకరాలను నోటిఫై చేయటంతో అక్కడ రైతుల భూములకు ధర రావటం లేదు.
కలెక్టర్ ఈ విషయంలో అక్కడి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి.
జాగృతి ఏ జిల్లాలో పర్యటించినా అక్కడి సమస్యలు పరిష్కారమయ్యే వరకు వెంటపడున్నది. పటిష్ఠమైన క్యాడర్ ను నిర్మించి ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం.”
మాట తప్పిన సీఎం
” ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలి చెల్లిస్తామని కౌన్సిల్ లో సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే చెల్లించాలని మేము భువనగిరిలో ఆందోళన చేపట్టాం. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా పేద విద్యార్థులకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. ఫీజు కట్టని విద్యార్థులను కాలేజీల్లో యాజమాన్యం అవమానిస్తోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మండలిలో నేను ప్రభుత్వాన్ని నిలదీశాను. దానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ గత ఏప్రిల్ నుంచి నెల నెలా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. కానీ అన్ని మాటలు తప్పినట్లే ఈ విషయంలోనూ మాట తప్పారు.”
భువనగిరిది ఘనచరిత
“సాయుధ రైతాంగ పోరాటం, భూదాన్ ఉద్యమానికి నెలవైన భువనగరి కోటను ఎన్నో సార్లు ఎందరో ఆక్రమించాలని భావించనప్పటికీ ప్రజలు మాత్రం మంచి పరిపాలన అందించే వారికే అవకాశం ఇచ్చారు. భువనగిరి జిల్లాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎవరెస్ట్ ఎక్కిన వారికి కూడా భువనగిరి కోట మీద ట్రైయినింగ్ ఇచ్చారు. మొల్లమాంబ అంటే నాకు ప్రత్యేక అభిమానం. మహిళలు చదువుకోలేని సమయంలో కవిగా రామాయణం రాసి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆలేరు, భువనగిరి ప్రాంతంలో నీటి కరువు చాలా ఉండేది. తెలంగాణ వస్తే నీటి పారుదల రంగం ముందుకు పడుతుందని ఆశతో ఇక్కడ ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమించారు. తెలంగాణ వచ్చాక మేము పార్లమెంట్ లో ఎయిమ్స్ కావాలని ఫైట్ చేశాం. మనకు నిమ్స్ నే ఎయిమ్స్ గా మార్చారు. దేశంలోనే తొలి బ్రౌన్ ఫీల్డ్ ఎయిమ్స్ ఇది. దాదాపు 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎమర్జెన్సీ మందులు లేని పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి రూ. 750 కోట్లు వచ్చినప్పటికీ భవన నిర్మాణాలను కాంట్రాక్టర్ లేట్ చేస్తున్నాడని చెబుతున్నారు. దీని పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంట్రాక్టర్ ను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నా.
ఎయిమ్స్ ద్వారా చాలా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ జాబ్స్ లో స్థానికులకే 80 శాతం వచ్చేలా మంత్రి కృషి చేయాలి.”








