మాట తప్పిన వారికి ఓటేస్తే అనర్థాలు, మోటకొండూరులో జనంతో మమేకం


అన్ని కులాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండే సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాటతో ఎన్నో కఠినమైన సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నామని వెల్లడించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకున్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..ఇది మంచి పరిణామం కాదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో ఇండ్ల పట్టాలు రాని వారితో ఆమె  సమావేశమయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గ్రామస్తులతో మాట్లాడుతూ ఇండ్ల పట్టాల కోసం వారి పక్షాన పోరాడుతానని హామీ ఇచ్చారు.

పార్టీ కాదన్నా ప్రజల్లోనే ఉంటా

“19 ఏళ్లుగా జాగృతి, బతుకమ్మ పేరుతో ఊరురా తిరిగాను. 

బీఆర్ఎస్ పార్టీ కోసం 20 ఏళ్ల పాటు పనిచేసిన.. కానీ కేసీఆర్ సార్ నన్ను పార్టీలోంచి తీసేశారు. ఏం కోపం వచ్చిందో? ఎవరు ఎక్కించి చెప్పారో తెలియదు? కానీ పార్టీలోంచి తీసేశారని నేను ఊరికే ఉండిపోవాలా? మీ మీద భరోసాతో నేను ప్రజల్లోకి వచ్చిన. ఆడబిడ్డలపై నమ్మకంతో మీకోసం కొట్లాడుదామని ముందుకు వచ్చిన. మరి ముందుకు పోదామా.. నాతో పాటు అండగా ఉంటారా? 

తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా?

అప్పుడు 10 వేలు ఉన్న జీతం ఇప్పుడు 15 వేలు అయ్యిందా? మీకు ఇండ్లు ఏమైనా వచ్చాయా? తెలంగాణ వచ్చిన తర్వాత కొందరికే మేలు జరిగింది. నేను సామాజిక తెలంగాణ కావాలని కోరుకుంటున్నా. కుమ్మరి సోదరులు ఇంకా కుండలు చేసుకుంటున్నారు. వారికి ఆసరాగా ఉండాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు. ఎలక్ట్రిక్ వీల్స్  ఇస్తే  వారికి ప్రోత్సహకరంగా ఉంటుంది. “

పరిష్కారం దిశగా సమస్యలు

” అడిగే వాళ్లు ఉంటేనే ప్రభుత్వంలో పనులు అవుతున్నాయి. జాగృతి జనంబాట పేరుతో మేము 15 జిల్లాలు తిరిగాం. అక్కడి చాలా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న గొట్టు సమస్యలకు కూడా పరిష్కారం లభించేలా చేశాం. మంత్రులు, అధికారులే కాదు ముఖ్యమంత్రి కూడా మనం ప్రశ్నిస్తే స్పందిస్తున్నారు. అందుకే అడిగే వాళ్లు ఉండాలి. మనకు ఏ పార్టీతో సంబంధం లేదు. ప్రజల సమస్యల కోసం అన్ని పార్టీలను ప్రశ్నిద్దాం. ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు. ఓట్ల కోసం నేను రాలేదు. ఓట్లు ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలను నిత్యం తెలుసుకోవాలి. రాజకీయ నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని భావించే వ్యక్తిని నేను. మహిళలకు రూ. 2500, తులం బంగారం ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదు. యువతకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయిన సరే మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే గట్టిగా ప్రశ్నించాలి. హామీలు అమలు చేయకపోయినా గెలిపిస్తే…ఇచ్చిన మాట నిలబెట్టుకోకున్నా గెలిపిస్తారన్న భావన వస్తుంది. మోటకొండూరులో 950 సర్వే నంబర్లో 650 మందికి భూములు వచ్చే వరకు పోరాటం చేస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వాళ్లు భూములు ఇస్తామని చెప్పి మాట తప్పారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి ఆ తర్వాత అడిగిన పాపాన పోలేదు. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినయ్. ఇప్పుడు ఏ ఎన్నికలు కూడా లేవు. 

ఇప్పుడు జరగాల్సింది ప్రజల సమస్యలపై పోరాటం. 

ఇవ్వాళ భువనగిరి జిల్లాలో పర్యటిస్తే చాలా సమస్యలు ఉన్నాయి. కనీసం 100 పడకల హాస్పిటల్ కూడా ఇక్కడ లేదు. ఎమర్జెన్సీలో వైద్యం కావాలంటే హైదరాబాద్ కు పంపిస్తున్నారు. సరైన సమయానికి వైద్యం అందక ఎంతో మంది చనిపోతున్నారు. నేను ఏ జిల్లాకు వెళ్లినా సరే హాస్పిటల్, స్కూల్ కు వెళ్తున్నా.అక్కడ వైైద్య, విద్య రంగంలో మంచి వసతులు కల్పించాలని కోరుతున్నా. 

నేను చేసే పని మంచిదేనా? తెలంగాణలో విద్య, వైద్యం బాగుపడాలా? వద్దా? తెలంగాణలో విద్య, వైద్య రంగం బాగుండాలని నేను కోరుకుంటున్నా. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మనం పోరాటం చేయాల్సి ఉంది. 

ఇక్కడి దళితుల భూములను కబ్జా చేశారని చెబుతున్నారు. 

దళితుల భూములు కబ్జా చేస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకునేది లేదు.”