కళ్లు మూసుకున్న కమ్యునిష్టులు
కార్మికుల బాధలు గాలికి వదిలిన యాజమాన్యం
-కల్వకుంట్ల కవిత
మణుగూరులోని PK OCP 2 లో కార్మికులతో సమావేశం అయిన తెలంగాణ రక్షణసేన చీఫ్
(తెలంగాణ రక్షణసేన, మణుగూరు)
కార్మికుల సమస్యలపై పోరాడాల్సిన కమ్యునిష్టులు కళ్లముందు దారుణాలు జరుగుతున్నా స్పందించకపోవడం విచారకరమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత విమర్శించారు. రష్యాలో వాన పడితే కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడతారని చమత్కరించే వాళ్లు.. కానీ ఇప్పుడు ఢిల్లీలో కేంద్రం లేబర్ చట్టాలను పూర్తిగా మార్చి వేసినా సరే గల్లీలో కూడా వాళ్లు మాట్లాడటం లేదని ఆరోపించారు. యూనియన్లు ఉండవు, కార్మికులకు హక్కులు ఉండవని అంటున్నా సరే కమ్యూనిస్టులు పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు. మణుగూరులోని PK OCP 2 లో కార్మికులతో శుక్రవారం కవిత సమావేశమయ్యారు. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యక్రమం ఉందంటూ టీఆర్ఎస్ ఫ్లెక్సీలను పోలీసులు తొలగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య దేశమన్న సోయి మర్చి పోయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్ మైనస్, పబ్లిక్ హాలిడేస్ కు సంబంధించిన అంశంలో కార్మికులకు క్షమాపణ చెప్పారు. మీకు మేలు జరగుతుందని భావించినప్పటికీ ఏటా కార్మికులు రెండున్నర లక్షల రూపాాయలు నష్టపోతున్నారని తెలిసిందని చెప్పారు. కచ్చితంగా తప్పులను సరిచేసుకుంటామని, ఎన్ మైనస్, అదే విధంగా పబ్లిక్ హాలిడేస్ లో గతంలో ఎలా ఉండేదో అలాగే ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఓపెన్ కాస్టులో ఎక్కువగా ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు ఉంటారని, వారి సమస్యల పరిష్కారం కోసం కూడా వర్క్ చేస్తున్నామన్నారు. అండర్ గ్రౌండులో పనిచేసే వారు సర్ ఫేస్ కు వస్తే వాళ్లకు పేమెంట్ తగ్గిస్తున్నారని కవిత తెలిపారు. కానీ గతంలో తాము అధికారంలో ఉండగా సర్ ఫేస్ కు వచ్చి వర్క్ చేసినా పేమెంట్ తగ్గించకుండా చూశామని గుర్తు చేశారు. మళ్లీ అదే విధానం కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నియామకాల్లో కొర్రీలు
సింగరేణిలో కొత్తగా ఏ గని ప్రారంభించకుండా కూడా 3 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కవిత వెల్లడించారు. వాటిని డిపెండెంట్ ఉద్యోగాల కోసం అప్లయ్ చేసుకున్న వాళ్లకు ఇవ్వవచ్చని సూచించారు. కానీ మెడికల్ బోర్డు పెట్టటం లేదని, తాము హైదరాబాద్ లో సింగరేణి భవన్ ను ముట్టడిస్తే అప్పుడు మెడికల్ బోర్డు పెట్టారని చెప్పారు. కానీ 2 వేల మంది అప్లయ్ చేసుకుంటే 54 మందిని మాత్రమే చూసి వారిలో నలుగురికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని కవిత తెలిపారు. ఇప్పటికే అన్ ఫిట్ అయిన వాళ్లు 700 మంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని తెలిపారు.
2 వేల మంది డిపెండెంట్ ఉద్యోగాలను పూర్తిగా పెండింగ్ పెట్టారని వివరించారు. ఇక రిటైర్ మెంట్ కు దగ్గర ఉన్న వాళ్లు కూడా డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో బాధపడుతున్నారన్నారు. కానీ డిపెండెంట్ ఉద్యోగాల కోసం రిటైర్ మెంట్ కు దగ్గర ఉన్న వాళ్లు బాధపడవద్దని సూచించారు. మీరు ఏ రోజైతే అప్లయ్ చేసుకుంటారో ఆ తేదీనే మేము ప్రామాణికంగా చేసుకునేలా చేస్తామని స్పష్టం చేశారు. మెడికల్ బోర్డు నెలకు రెండుసార్లు పెట్టకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించానని,
దాంతో కార్మిక యూనియన్లతో 15, 18 తారీఖుల్లో మెడికల్ బోర్డు పెడతామంటూ లీకులు ఇస్తున్నారని కవిత చెప్పారు. మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారన్నది సింగరేణి యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఉద్యోగం కోసం చదువుతో సంబంధం లేదని, 3 వేల వరకు అలియాస్ పేర్ల విషయంలో పెండింగ్ ఉందని చెప్పారు. వాటిని వెంటనే ప్రాసెస్ చేయాలని కోరారు. ఇక కేంద్రం మనకు 17 గనులు కేటాయించాల్సి ఉంటే ఒకటి మాత్రమే కేటాయించిందని తెలిపారు. మిగతావి కూడా సింగరేణికి కేటాయించాల్సిందేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
అదే విధంగా ఐటీలో పెర్క్స్ ను కూడా తొలగించాలని, లేదంటే కార్మికులకు చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అవసరమైతే ఢిల్లీలో కూడా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్లను ఓపెన్ చేసి సంస్థను బతికించాలని సూచించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
సేఫ్టీ విషయంలో సింగరేణి కార్మికులతో యాజమాన్యం చెలగాటం ఆడవద్దన్నారు.
కార్మికుల సేఫ్టీకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అధికారులకు మద్దతు
మణుగూరులో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సింగరేణి అధికారులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణిలో అటు కార్మికులే కాక, ఇటు ఆఫీసర్లు కూడా బాధపడుతున్నారన్నారు. ఆఫీసర్లకు పీఆర్పీ, పే రివిజన్ జరగాల్సి ఉందన్నారు.
ప్రతి సందర్భంలో పే రివిజన్, పీఆర్పీ బకాయిల కోసం ధర్నాలు చేసే పరిస్థితి ఉండవద్దన్నారు. రెగ్యులర్ జరిగే వ్యవహరాల్లో ప్రభుత్వం జోక్యం ఉండకుండా ఒక విధానం ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే సంస్థ బతుకుతుందని స్పష్టం చేశారు.
సింగరేణి యాజమాన్యం కార్మికులు, ఆఫీసర్లకు మంచి జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ఆఫీసర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని కవిత గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కూడా వాళ్ల సమస్యలపై రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కూడా రోడ్లపైకి వస్తున్నారేంట్రా అని ఒక యువ ఆఫీసర్ ను వాళ్ల అమ్మ అడిగిందని చెప్పారు. అంటే ఇలాంటి పరిస్థితి రావటానికి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతే కారణమని తెలిపారు. పీఆర్పీ అమలు చేయాలని హెచ్ఎంఎస్ నేత రియాజ్ ముందుగా ఆఫీసర్లకు మద్దతు తెలిపారని వివరించారు. ఆఫీసర్ల డిమాండ్ల సాధన విషయంలో టీఆర్ఎస్ వారికి మద్దతుగా ఉంటామన్నారు. పే రివిజన్, పీఆర్పీ సహా కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
అడ్డగింత
శుక్రవారం ఉదయం మణుగూరు లోని PK OCP 2 సందర్శనకు వెళ్లిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అడ్డుకున్నారు. OCP సందర్శనకు అనుమతి లేదని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసుల తీరుపై టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్బంధాన్ని దాటి OCP లోకి వెళ్లి కార్మికులతో సమావేశం అయి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.








