జులై 9 నుంచి రెండో విడత “బాయిబాట”
పోస్టర్ ఆవిష్కరించిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్ధన్
(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :
సింగరేణి గనుల పరిరక్షణ, డిపెండెంట్ ఉద్యోగాల సాధన కోసం మెడికల్ బోర్డు నిర్వహణ సహా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 9 నుంచి రెండో విడత బాయిబాట కార్యక్రమం చేపట్టనున్నారు. హెచ్ఎంఎస్ తో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు సింగరేణి బొగ్గు గనులపై పర్యటించనున్నారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాలతో పాటు సత్తుపల్లిలో ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పర్యటించనున్నారు. బాయిబాట రెండో విడత కార్యక్రమం పోస్టర్ ను మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోడ జనార్దన్ బుధవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ మైన్స్ పై గేట్ మీటింగులు నిర్వహించడం, వర్క్ షాప్ ల సందర్శన, సింగరేణి హాస్పిటళ్ల సందర్శన సహా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 15 నుంచి 20 వరకు రామగుండంలోని మూడు ఏరియాలు, మందమర్రి, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాల్లో మొదటి విడత బాయిబాటలో భాగంగా కవిత పర్యటించారు.
కవిత పర్యటనతో బీఆర్ఎస్ వెన్నులో వణుకు
-తెలంగాణ రక్షణ సేన నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్ధన్
కవిత చేపట్టిన “బాయిబాట” కార్యక్రమంతో బీఆర్ఎస్ లో వెన్నులో వణుకు పుట్టిందని చెప్పారు. అందుకే సింగరేణి పరిరక్షణ సంస్థ పేరుతో హరీష్ రావు కొత్త డ్రామా మొదలు పెట్టారన్నారు. హరీశ్ రావు ఎన్ని డ్రామాలు చేసిన కార్మికుల నమ్మరని అన్నారు. సింగరేణి సంస్థ నష్టపోయిందే బీఆర్ఎస్ హయాంలో అని బోడ జనార్థన్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంస్థ గురించి పట్టించుకోని హరీష్ రావు…ఇప్పుడు కార్మికులపై దొంగ ప్రేమ నటిస్తున్నాడని విమర్శించారు. మీ జిమ్మిక్కులు కార్మికుల ముందు పనిచేయవన్నారు. సింగరేణికి ప్రభుత్వం 50 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉండి ఏం చేశావని ప్రశ్నించారు. సింగరేణి సొమ్ము వందకోట్లు సిద్దిపేటకు తరలించి కార్మికులకు అన్యాయం చేశావంటూ విమర్శించారు. మీరు చేసిన అక్రమాల కారణంగానే సింగరేణి బెల్ట్ లో ఉన్న 13 నియోజకవర్గాల్లో కార్మికులు బీఆర్ఎస్ ను ఓడించారన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్ని డ్రామాలు చేసిన సరే కార్మికులు మిమ్మల్నిపట్టించుకోరన్నారు. కవిత గారు కార్మికుల కోసం పోరాటం చేస్తుంటే అడ్డుపడాలని చూస్తే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. సింగరేణి కార్మికులను ఓట్లు అడిగే నైతికత హరీష్ రావుకు లేదన్నారు.

కవితతోనే సింగరేణి కార్మికులు
సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు కవిత చేపట్టిన “బాయిబాట” మొదటి విడత కార్యక్రమం సక్సెస్ అయ్యిందని బోడ జనార్దన్ చెప్పారు. హెచ్ఎంఎస్ సహకారంతో గత 40 ఏళ్లుగా ఎప్పుడు లేని విధంగా గేట్ మీటింగ్ లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మెడికల్ బోర్డు, అలియాస్ పేర్ల వివాదం విషయంలో కార్మికులకు అండగా ఉంటామని కార్మికులకు కవిత హామీ ఇచ్చారని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో కార్మికులు అందరూ కవితతోనే ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, ఇస్మాయిల్, వీరన్న, వేణు మాధవ్, హెచ్ఎంఎస్ నాయకుడు సారయ్య తదితరులు పాల్గొన్నారు.








