ఆదివాసీలకు పౌష్టికాహారం, రక్షిత మంచినీరు అందించాలి*

అడ ప్రాజెక్ట్, ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి

కొమరం భీమ్ వర్ధంతి నాటికి కెరమెరి నుంచి జోడేఘాట్ వరకు డబుల్ రోడ్డు వేయాలి

-తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత

టీఆర్ఎస్ లో పలువురు ఆదివాసీ నాయకుల చేరిక

(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు పౌష్టికాహారం, రక్షిత తాగునీటిని అందించాలని, ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణసేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఆదివాసీ నాయకులు, తెలంగాణ ఆదివాసీ టైగర్ సేన నాయకులు మంగళవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణసేనలో చేరారు. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆదివాసీల ఆరాధ్య నాయకుడు  కొమరం భీమ్ వర్ధంతి నాటికి కెరమెరి నుంచి జోడేఘాట్ వరకు డబుల్ రోడ్డు నిర్మించాలన్నారు. అడ ప్రాజెక్టు, ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టుల కాల్వలు ఆధునీకరించి మొత్తం 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. పోడు సమస్య పరిష్కరించాలని.. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన హక్కుల పత్రాలకు సంబంధించిన భూములు వెంటనే ఆదివాసీలకు అప్పగించాలని కోరారు. ఇందుకోసం ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో జాయింట్ సర్వే నిర్వహించాలన్నారు. ఆదివాసీలకు అండగా ఉండటం కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలు నామ్ కే వాస్తేగా మారిపోవడం దురదృష్టకరమన్నారు. ఆదివాసీ నాయకుడు సోయం బోజారావు గుట్టబండపై మట్టి పోసి పంటలు సాగు చేయడం ఆదివాసీల దుర్భర స్థితిగతులను తెలియజేస్తుందన్నారు. త్వరలోనే ఆదివాసీ ప్రాంతాలను సందర్శిస్తామని, ఆదివాసీలకు ఎళ్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కోట్నక కిషన్ రావ్, పెందోర్ ధర్ము, పెందోర్ దౌలత్ రావ్ తదితరులు టీఆర్ఎస్ లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్ చార్జీ కావేటి సబిత తదితరులు పాల్గొన్నారు.

K Kavitha demands better nutrition, safe drinking water, irrigation and road connectivity for Adivasis in Telangana's Komaram Bheem Asifabad district