విద్యార్థుల విజయాన్ని సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు

యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని మీరే ఊరేగింపులు చేస్తారా?

తెలంగాణ యువతకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర మీది

ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణ యువత మిమ్మల్ని గద్దె దించటం ఖాయం

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

విద్యార్థుల విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించటం సిగ్గుచేటని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. 36 రోజుల పాటు అలుపెరగకుండా విద్యార్థులు చేసిన పోరాటంతోనే కేంద్రం దిగివచ్చిందని అన్నారు. కేంద్రమంత్రి రాజీనామా చేయటంతో పాటు వారి అన్ని డిమాండ్లకు కేంద్రం అంగీకరించటం వెయ్యి శాతం విద్యార్థుల విజయమేనని చెప్పారు. ఈ మేరకు ఆదివారం వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడ విద్యార్థులు నిలదీస్తారోననే భయంతోనే, నగర వీధుల్లో ఊరేగింపులు చేస్తూ డ్రామాలు ఆడారన్నారు. ఏనాడు తెలంగాణ యువత, విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి, ఇప్పుడు 21 ఏళ్లకే యువత పార్లమెంట్‌లో ఉండేలా బిల్లు తెస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందు ఎన్నికల సమయంలో యువతకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ హమీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 21 ఏళ్లకే యువత పార్లమెంట్ కు వెళ్లే బిల్లు తెస్తానని చెప్పటం సంతోషమేనని కవిత అన్నారు. కానీ అసెంబ్లీలో ఏ బిల్లు పెట్టినా, కేంద్రం వద్ద ఆ బిల్లు పాస్ కాకుండా అంతర్గతంగా లాలూచీ పడుతున్న మీ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసని కవిత అన్నారు. ముఖ్యంగా బీసీ బిల్లు విషయంలో ఎలా మోసం చేస్తున్నారో బీసీలు గమనిస్తున్నారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అట్టహాసంగా 1000 కోట్లు ఇస్తామని ప్రకటించి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. కొవ్వొత్తులు పట్టుకుని వీధుల్లో ఊరేగింపులు చేసినంత మాత్రాన మీ చరిత్రను, వైఫల్యాలను యువత మర్చిపోదన్నారు. ఇకనైనా యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేదంటే యువత మిమ్మల్ని గద్దె దించటం ఖాయమని చెప్పారు.