ఆటో డ్రైవర్ల పొట్ట గొడుతున్న సర్కార్
ఆటోలను కూడా ప్రభుత్వమే నడపాలనుకోవడం దారుణం
ఇప్పుడు ఆటో నడుపుతున్న వారికే లాస్ట్ మైల్ కనెక్టివిటీలో అవకాశం ఇవ్వాలి
ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడితే ఊరుకోం..ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం
-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత
ఆటో డ్రైవర్లతో కవిత సమావేశం
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్)
లాస్ట్ మైల్ కనెక్టవిటీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆటోరిక్షాలను నడపాలనే ఆలోచనను పునరాలోచించాలని కోరారు. తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో కవిత సమావేశమయ్యారు. ఆర్టీసీ ప్రవేశపెట్టబోయే ఆటోలతో తమ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడనున్నదని ఆటో డ్రైవర్లు ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ఎక్కిన వాళ్లు తాము దిగాల్సిన స్టేజీకి చేరుకున్నాక ఆటో బుక్ చేసుకుంటే సరిపోతుంది.. కానీ ఆ ఆటోలను కూడా ప్రభుత్వమే నడిపే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని.. వాళ్లు కనీసం ఈఎంఐ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఈవీ ఆటోల పేరుతో భారీగా ఆటోలను తెచ్చి ప్రభుత్వమే వాటిని నడిపి ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టబోతున్నదని వివరించారు. వన్ స్టేట్, వన్ పర్మిట్ విధానం తీసుకువస్తామని హామీ ఇచ్చిన విషయంపై ప్రభుత్వం మాట్లాడటం లేదని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఇస్తామని మాట తప్పారని దుయ్యబట్టారు. ఉల్లంఘనల పేరుతో అటోలపై చలాన్ల మీద చలాన్లు వేస్తూ వాళ్లపై అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. ఇప్పుడున్న ఆటో డ్రైవర్లతోనే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఆటోలు నడిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆటో యూనియన్లతో ప్రభుత్వం చర్చించాలని కోరారు. వారికి మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలని సూచించారు. లేదంటే తెలంగాణ రక్షణసేన ఊరుకోదని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లతో కలిసి ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తామని ప్రకటించారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ లోనూ ఈవీ ఆటోలు తెస్తామని చెబుతున్నారని కవిత తెలిపారు. ప్రభుత్వం చెప్తున్న లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈవీ ఆటోలను అసలు రోడ్డు మీదికే రానివ్వమని స్పష్టం చేశారు. మూడు రంగులు వేసిన ఈవీ ఆటోలతో ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడతామంటే ఊరుకోమన్నారు. చెత్త కలెక్ట్ చేసే ఈవీ ఆటో డ్రైవర్లు 30 వేల మంది ఉన్నారని, వాళ్లను కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నదని కవిత చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అందరూ ఆటో డ్రైవర్లకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఆటో డ్రైవర్లతో కలిసి ఉద్యమిస్తామని కవిత ప్రకటించారు.









