గద్వాల జిల్లా గుడ్డెందొడ్డిలో బహిరంగసభ
సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి రాజకీయ వేదికగా అవతరించబోతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇప్పుడున్నవి రెండే కులాలు..పైసులున్నోడు, లేనోడు. ఈ అంతరాలు తగ్గించేందుకే జాగృతి జనం మధ్యకొచ్చిందని స్పష్టం చేశారు. జాగృతి జనంబాటలో భాగంగా ఆదివారం రాత్రి గద్వాల జిల్లా గుడ్డెందొడ్డి బహిరంగసభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జనం కోసం ఉద్యమించిన రంజిత్ లాంటి నాయకుడుకి ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన సమయమొచ్చిందన్నారు.





సమర్థ నాయకుడు రంజిత్
” గడీల రాజకీయానికి మంగళం పాడాలి. నడిగడ్డ హక్కుల కోసం కష్టపడ్డ వ్యక్తి
టైగర్ లాంటి రంజిత్ ప్రజల కోసం కొట్లాడుతున్నరు. అతని వెనుక జాగృతి అండగా ఉంది. అతనికి ప్రజలు వెన్నంటి ఉండండి..అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు. జనాన్ని మోసం చేసే అలాంటి నాయకులు వద్దు. బంగ్ల రాజకీయం వద్దు. 70 ఏండ్ల నుంచి గద్వాలలో ఒకే కుటుంబాన్ని ఎన్నుకుంటున్నం. రోడ్లు లేవు, బస్సులు లేవు. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది. “
ప్రశ్నిస్తే బహిష్కరించారు
” బీఆర్ఎస్ హయాంలో ఒక్కసారి కూడా గ్రూప్ వన్ వెయ్యలేదు. ఉన్నదున్నట్లు మాట్లాడితే నన్ను పార్టీ నుంచి బయటకు పడేశిన్రు. ప్రజల్లో ఉందామనుకున్నాను. అందుకే గ్రామాల్లో పర్యటిస్తున్నాను.
అంతటా సమానమైన అభివృద్ధి జరగాలి.
హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్లే గ్రామాలన్నీ వెలగాలి. విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. ఇవి రెండూ అందితే జనాలకు మిగతావన్నీ సాధించుకునే శక్తి వస్తది.”








