పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి
-కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్)
సామాజిక తెలంగాణ సాధనే ప్రధాన లక్ష్యంగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా తాము స్థాపించబోయే రాజకీయ పార్టీ పని చేస్తుందని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ నెల 25న నూతన పార్టీ ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం మహబూబ్ నగర్, నల్గోండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల కార్యకర్తలు, నాయకులతో ఆమె సమావేశమయ్యారు. బంజారాహిల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పేదల పక్షపాతిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25న మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఉదయం 10 గంటలకు పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తామన్నారు. జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు, నాయకులు సమయానికి చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎక్కడెక్కెడి నుంచి ఎంతమంది కార్యకర్తలు వస్తారనే అంచనాలతో తగినంత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్ సింగ్, ఉపాధ్యక్షులు వరలక్ష్మి, కోట్టాల యాదగిరి ముదిరాజ్, శ్రీకాంత్ రావు, కోల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రంగు నవీనాచారి తదితరులు పాల్గోన్నారు.
చిన్నారి పెద్ద మనసు
తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణకు 20 ఏండ్లుగా కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ రాజకీయపార్టీగా అవతరించబోతున్న సందర్భంగా ఖమ్మం జిల్లాకు చెందిన చిన్నారి సారిక తన ఔదార్యాన్ని చాటింది. తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న పైసలతో పార్టీ ఆవిర్భావ వేడుకకు సంబంధించి పోస్టర్ ను తయారు చేయించింది. సర్వోదయ సామాజిక తెలంగాణ లక్ష్యంగా కవితక్క ఆధ్వర్యంలో ఏర్పడబోయే కోత్త రాజకీయపార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి.. ఉద్యమకారులు, మేధావులు, మహిళలు, విద్యార్థులు సబ్బండ వర్గాల ప్రజలందరికీ ఆహ్వానం అంటూ పోస్టర్ రూపోందించగా కవిత ఆవిష్కరించారు.








