19 ఏండ్లుగా ప్రజల్లోనే ఉన్నాను | (భువనగిరి) 

బీఆర్ఎస్ లో జరిగిన తప్పులకు ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను కూడా భాగస్వామినే కాబట్టి నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేసినప్పటికీ ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. భువనగిరిలో బుధవారం మీడియాతో మాట్లాడిన కవిత బీఆర్ఎస్ తో విబేధాల కారణంగా పెట్టిన సంస్థ కాదని, తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమకాలం నుంచి మన భాష, యాస మీద పోరాటం చేశామని గుర్తు చేశారు. 

Telangana Jagruti leader Kavitha speaks on political journey

“నేను తెలంగాణ ప్రజల బాణాన్ని. నన్ను ఎవరో ఆపరేట్ చేసే సీన్ లేదు. బీఆర్ఎస్ లో ఎప్పుడు నేను కీలకంగా లేను. టీచర్ ను కూడా ట్రాన్ ఫర్ చేయించుకోలేకపోయాను. 

నేను పొజిషన్ లో ఉన్న ఐదేళ్లు కూడా నిజామాబాద్ కే పరిమితమయ్యాను. బీఆర్ఎస్ సమయంలోనే ఇక్కడి రైతులకు బేడీలు వేశారని తెలిసింది. అప్పుడు నేను బీఆర్ఎస్ లో ఉన్నాను కాబట్టి ఆ పాపంలో నాకు భాగం ఉన్నట్లే. ఐతే ఓ మంత్రి వాహనాన్ని అడ్డుకున్నందుకు రైతులకు పట్టుబట్టి బేడీలు వేయించారని చెబుతున్నారు. 

ఏదీ ఏమైనా ప్రజలకు అన్యాయం జరిగింది. అందుకు క్షమాపణలు చెబుతున్నా. ఐతే ఇప్పుడు ప్రజలు నా మాట నమ్మకపోవచ్చు. కానీ నా ప్రవర్తనను బట్టి తెలుస్తుంది. కానీ దానికి కొంచెం సమయం పట్టవచ్చు. బీఆర్ఎస్ నుంచి నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో నాకు కూడా కారణం తెలియటం లేదు. ఉరి వేసే వ్యక్తి కి కూడా కారణం చెబుతారు. కానీ నన్ను మాత్రం ఏమీ అడగకుండానే సస్పెండ్ చేశారు. నా ఆత్మగౌరవం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాలేను. నేను ఏ తప్పు చేయలేదు. పార్టీ కూడా నన్ను కారణం అడగలేదు. 2029 లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని భావిస్తున్నా. అప్పుడు కచ్చితంగా మేము బరిలో ఉంటాం. 19 ఏళ్లుగా జాగృతి పేరుతో నేను ప్రజల్లోనే ఉన్నా. ప్రజలకు నేను కొత్త కాదు. బతుకమ్మ, బోనాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా చేసుకునేలా కృషి చేశా. మేము ఓట్ల కోసం రాలేదు. పల్లెల్లో ఓట్లు ఉంటే పట్నంలో జనం బాట చేశాం. ఓట్లప్పుడు మాత్రమే నాయకులు ప్రజల్లోకి వచ్చే సంస్కృతి మారాలి.”