తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

శుక్రవారం ఉదయం తన భర్త అనిల్ తో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న కవిత ఉదయం బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ తాను నాలుగు సంవత్సరాలుగా పడుతున్న మనో వేదన స్వామి వారి దయతో తీరిపోయిందన్నారు. సత్యం, న్యాయం, ధర్మం మావైపు ఉందని నేను చెప్తూ వచ్చాను.. స్వామి వారి దయతో కంప్లీట్ గా క్లీన్ చిట్ వచ్చిందని వెల్లడించారు. అందుకే కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నానని తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పని చేయడానికి రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. ఆ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు, దయ ఉండాలని కోరుకున్నానన్నారు. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని, బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలు, ప్రజలు బాగుండాలని స్వామి వారిని కోరుకున్నట్లు కవిత తెలిపారు.