తప్పుడు కథనాలు ప్రసారం చేసిన టీ న్యూస్ కు లీగల్ నోటీసులు ఇస్తున్నా.

కృష్ణారావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కూడా లీగల్ నోటీసులు పంపిస్తున్నా.

వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పకపోతే కోర్టు ద్వారా క్షమాపణలు చెప్పిస్తా.

నా భర్త పై ఏ భూమి గురించి ఆరోపిస్తున్నారో ఆ భూమిని 2019 లోనే అమ్మేశారు.

మాధవరం కృష్ణారావు వెనుక గుంటనక్క ఉంది.

సెయింట్ గోబల్ సంస్థకు ఆ గుంటనక్క చేసిన మేలును కేంద్ర దర్యాప్తు సంస్థలకు కంప్లైంట్ చేస్తా.

కాంగ్రెస్ తెచ్చిన హిల్ట్ పాలసీకి బీజం వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.

వాళ్లు కిటికీలు తెరిస్తే వీళ్లు డోర్లు తెరిచారు.

ప్రభుత్వం లీజుకు ఇచ్చిన భూమిని బీఆర్ఎస్ హయాంలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మారు.

జనం బాటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అక్రమాలు, దాష్టీకాలు బయటపడుతుంటే వాటిని ప్రజలకు చెబుతున్నా.

దాంతో నాపై కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ తో ఆర్థిక ప్రయోజనాలు అంటూ తప్పుడు ప్రచారాలు.

బీఆర్ఎస్ వేసిన దొంగదారులను రేవంత్ రెడ్డి రహదారులుగా మార్చారు.

ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయటానికి సిగ్గు లేదా?

నన్ను పార్టీ నుంచి పంపించిన తర్వాత కూడా మీ కళ్లు చల్లబడలేదా?

నా మీద తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను. నన్ను కొడితే రెండు కొడుతా.

(తెలంగాణ జాగృతి భవన్, హైదరాబాద్)

“ఆడబిడ్డనని బెదిరిస్తే ఊరుకుంటుందని అనుకుంటున్నారేమో.. కుదరదు బాస్. సామాన్య ఆడబిడ్డ చాకలి ఐలమ్మ ఎలా కొట్లాడిందో మనకు తెలుసు. ఆమె స్పిరిట్ తో నేను కూడా కొట్లాడుతాను. ఎవరేమన్నా ఊరుకోను. పదేళ్లలో నా భర్త గురించి ఎప్పుడైనా విన్నారా? చాలా అయ్యింది…ఇక ఊరుకోం.”

అధికారంలో ఉన్నన్నాళ్లు విచ్చల విడిగా దోచుకుని తప్పులు బయటపెడుతున్న తనపై సోషల్ మీడియాలో ఆరోపణలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ అగ్ర నే తల పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిప్పులు చెరిగారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తానంటూ హెచ్చరించారు. హైదరాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాడ్లాడారు. తాను సీఎం అయ్యాక అక్రమార్కుల భరతం పడతానని స్పష్టం చేశారు.

” ఒక ఆడబిడ్డగా 20 ఏళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తిని. 19 ఏళ్లుగా జాగృతి సంస్థను ప్రజాహితం, ప్రజల కోసం నడుపుతున్నా. జనం బాటలో భాగంగా తెలంగాణ మొత్తం పర్యటిస్తున్నాను. బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలకు సంబంధించిన అంశాలు ప్రజలు నా దృష్టికి తెస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అక్రమాలు. దురాగతలు, దాష్టీకాలు బయటపడుతున్నాయి. ఏ మొహమాటం లేకుండా తెలంగాణ ఆడబిడ్డల పౌరుషంతో నేను వాటిని ప్రజలకు చెబుతున్నా. దీంతో చాలామంది అక్రమాల పుట్టలు, పాపాల పునాదులు కదులుతున్నాయి. అందుకే నేను కాంగ్రెస్ తో అంటకాగి ఉన్నానని.. ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నాననే ప్రచారం మొదలు పెట్టారు. నేను జనంబాట కోసం బయటకు రావటంతో సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ చేశారు. ఏవీ రెడ్డి అనే వ్యక్తితో నా భర్త ల్యాండ్ లావాదేవీలు చేసి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందారంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. 

అలా నాకు కాంగ్రెస్ తో ఏదో అవినాభావ సంబంధం ఉందన్నట్లు ప్రయత్నం చేస్తున్నారు. ఈ వెకిలి ప్రయత్నాలు చేసే గుంట నక్కలను హెచ్చరిస్తున్నా. నేను ఇంకా మీ బాగోతాలు బయట పెట్టటం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు టాస్ మాత్రమే వేశా. ఇంకా టెస్ట్ మ్యాచ్ ముందుంది. “

అధికారాన్ని వాడుకోలేదు

మీలా వసూళ్లు చేయలేదు

“బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేను గానీ నా భర్త గానీ ఏదైనా ఫేవర్ అడిగామా? కేసీఆర్ గారిని, కేటీఆర్, హరీష్ రావు గారిని మేము ఏదైనా ప్రయోజనం అడిగితే చెప్పమనండి. ఊరుకుంటూ ఉంటే వెకిలి ప్రయత్నాలు చేస్తున్నారు. మొరిగే వాళ్లు మొరిగితే నేను ఊరుకోను. సిగ్గు ఉంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. 

బీఆర్ఎస్ లో పైసా ప్రయోజనం మేము పొందలేదు. నీతి, నిజాయితీ ఉంది. కనుకే కుండ బద్దలు కొట్టి మాట్లాడుతున్నా. నాకు ఏ పార్టీతో, ఎవరితో అండర్ స్టాండింగ్ లేదు. మీ లెక్క ఉద్యమం పేరు చెప్పి వసూళ్లకు మేము పాల్పడలేదు. ఏయే స్టూడియోల ముందు ధర్నాలు చేసి…ఎలా వసూలు చేశారో చెబితే సిగ్గు పోతుంది. అమెరికా నుంచి రాగానే నేను ఉద్యమంలో నా భర్త వ్యాపారంలో ఉన్నారు. నేను ఉద్యమంలో నా నగలు కుదవ పెట్టి ఉద్యమం చేశాను. అందుకే నాకు అంత పౌరుషం. ఇంకా నేను మీ చిట్టాను తెరవనే లేదు. నా మీద తప్పుడు కథనాలు ప్రసారం చేసిన టీ న్యూస్ కు నోటీసులు ఇస్తున్నా. 

ఒక శాటిలైట్ ఛానల్ ఏదైనా కథనం ప్రసారం చేసే ముందు కనీసం తెలుసుకోరా? నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. టీ న్యూస్ పబ్లిక్ గా అపాలజీ చెప్పాలి. ఏలేటీ మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావుకు కూడా నోటీసులు ఇస్తున్నా. 

పబ్లిక్ గా వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలి. లేదంటే కోర్టు ద్వారా క్షమాపణలు చెప్పిస్తాం. నేను బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయగానే సడెన్ గా సోషల్ మీడియాలో నాపై ప్రచారం మొదలవుతుంది. దాన్ని ఏలేటీ మహేశ్వర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతారు. అసలు ఇదేమైనా పొలిటికల్ ఇష్యూనా? నా మీద మాట్లాడితే ఆయనకు ఏమీ వస్తుందో తెలియదు. ఒక ఫొటో ఉన్న కాపీతో నా భర్త, ఏవీ రెడ్డి వ్యాపారం అని అంటున్నారు. హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ, ఏలేటీ, మాధవరం కృష్ణారావు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.”

తప్పు చేయకుంటే భయమెందుకు

“ఆడపిల్ల బయటకు వచ్చి అన్ని మాట్లాడుతుంటే భయమవుతుందా?  నేను భయపడే పిరికి పందను కాదు. అన్ని ట్రాన్స్ పరెంట్ గా సమాధానం చెబుతా. నా మీద వచ్చిన ఆరోపణలకు నేను వివరణ ఇస్తున్నా. మీరు కూడా మీ మీద వచ్చిన అన్ని ఆరోపణలకు సమాధానం చెప్పండి. 

నా భర్త మీద చేసిన ఆరోపణలకు సంబంధించి అన్ని వివరాలు చెబుతా. రెండు సర్వే నంబర్లకు సంబంధించి ల్యాండ్ అది. 2010/2, 2010/ 3 అనే సర్వే నంబర్ లో ఉన్న ల్యాండ్ కు 1975 నుంచి కూడా పట్టాలు, పాస్ బుక్కులు ఉన్నాయి. అది పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్. మొత్తం 16 ఎకరాలైతే వారి నలుగురు కొడుకులకు 4 ఎకరాలు వచ్చాయి. అక్కడే టేకం షా అనే కంపెనీకి 35 ఎకరాలు ప్రైవేట్ వ్యాపారుల ల్యాండ్ ఉంది. ఏదైతే 16 ఎకరాల భూమి ఉందో అందులో నా భర్త వేరే వాళ్లు ఉన్నారు. 

ఈ ల్యాండ్ కు సంబంధించి దాదాపు 9 ఏళ్ల పాటు వివాదం నడిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అది ప్రైవేట్ ల్యాండ్ అని పాస్ బుక్కులు ఇచ్చింది. టేకం షా కంపెనీ వాళ్లు 2019 లో కాంప్రమైజ్ అయ్యారు. అప్పుడే ల్యాండ్ అమ్మేసి మేము బయటకు వచ్చేశాం. దాంతో మాకు సంబంధం లేదు. 2022 లో అక్కడే 12 ఎకరాల్లో నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. పట్టా, ప్రభుత్వ భూమి అయితే ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? దానికి సంతకం పెట్టింది కేటీఆర్ గారే. అంటే కేటీఆర్ గారు తప్పు చేశారని కృష్ణారావు గారు అంటున్నారా? 2023 అక్టోబర్ లో ఎన్నికలకు వెళ్లే ముందు 5 ఎకరాలకు ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమిగా మార్చుకునే అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చింది కూడా కృష్ణారావు గారు  మీ చుట్టానికే? దీనికి మీరు సమాధానం చెప్పాలి. నిన్న గాక మొన్న అదే ప్రాంతంలో ఆరు ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎవరెవరికి సపోర్ట్ చేసిందో.. కాంగ్రెస్ వాళ్లు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు.”

బీఆర్ఎస్ లో అక్రమార్కులు గుంటనక్క సంగతి చెప్తా

“మీ గుంపులో ఉండే పోచంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏవీ రెడ్డితో వ్యాపారం చేస్తున్నారు. పొద్దున లేస్తే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కేటీఆర్ తో ఉంటారు. ఆయన ఫామ్ హౌస్ లో పందెం కోళ్లు అన్నారు. కానీ ఏం చర్యలు తీసుకోలేదు? ఎవరికి ఎవరితో బంధుత్వాలు, వ్యాపారులు ఉన్నాయో చెప్పండి? ఆడబిడ్డను కదా ఏమీ చేయను అనుకుంటే తోలు తీస్తా. కృష్ణా రావు చాలా చిన్న మనిషి. ఆయన వెనుక గుంట నక్క ఉండి ఆడిస్తున్నాడు. ఈ ప్రెస్ మీట్ కచ్చితంగా ఆ గుంట నక్క వింటుంది. వారి సంగతి కూడా చెబుతా. కృష్టా రావు గురించి నేను మాట్లాడటం మొదలు పెట్టాక ఆయన బాధితులు చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు. ప్రణీత్, ప్రణవ్ రావు అనే  కన్ స్ట్రక్షన్ కంపెనీ కి కృష్ణారావు కుమారుడు డైరెక్టర్. వాళ్లు 70 ఎకరాల్లో వెంచర్ స్టార్ట్ చేశారు. అందులో ఏ టు జడ్ అక్రమాలే. చెరువు భూమి, అసైన్డ్ ల్యాండ్ ను కూడా కబ్డా చేశారు. వాళ్లే తమ వెంచర్ లో 10 ఎకరాల చెరువు ఉందని చెప్పారు. ఈ తర్వాత కొన్ని సంవతర్సాలకు అదే చెరువు ఆరు ఎకరాలకు వచ్చింది. నాలుగు ఎకరాలు మింగి అందులో 8 విల్లాలు కట్టారు. పైగా వెంచర్ చుట్టు కాంపౌండ్ వాల్ కట్టారు. ఇప్పుడు ఆ చెరువు విల్లా వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఊరి వాళ్ల చెరువు లోపల వేసుకోవటానికి మీ అయ్యా జాగీరా? ఎక్కడికి అక్కడ వీళ్లు కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని చేసుకున్నారు. నిజంగా రేవంత్ రెడ్డికి సంబంధం లేకపోతే ఈ అంశంపై విచారణ చేయండి. 

సర్వే నంబర్ 307 భూమితో నాకు సంబంధం లేదు

కృష్ణారావు నువ్వు, కేపీ వివేకానంద కలిసే ఆ భూమిని కబ్జా పెట్టారు. గాజుల రామారంలో పేద ప్రజలకు దొంగ రిజిస్ట్రేషన్లతో భూములు అమ్ముతున్నారు. మాలాంటి వాళ్లు మాట్లాడితే హైడ్రా వెళ్లి కూలగొడుతుంది. పాపం పేదవాళ్లకు అన్యాయం చేస్తారు. వాళ్ల మీద కూడా మీరు డబ్బులు ఏరుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో బోలెడన్నీ చెరువులు బ్యూటిఫికేషన్ కు ఇచ్చారు. అందులో కొన్ని జెన్యూన్ గా బ్యూటిఫికేషన్ కూడా చేశారు. కానీ కృష్ణారావు కుమారుడికి కూడా ఉస్మాన్ కుంట చెరువు డెవలప్ మెంట కోసం ఇచ్చారు. ఆ చెరువులో నాలుగు ఎకరాలు మింగారు. దీనికి కృష్ణారావు సమాధానం చెప్పాలి. 

మీ మీద మేము దాడి చేస్తాం అంటున్నారంట. మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి కాదు మీరు. మీ వెనుక ఉన్న గుంటనక్కకు చెబుతున్నా. సెయింట్ గోబల్ అనే కంపెనీకి మీ ఫేవరేట్ బిల్డర్ కు గుంటనక్క సిఫారస్ చేసి భూమి కట్టబెట్టారు. అందులో ఉన్న కీలకమైన అధికారి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాడు. నేను ఆధారాలతో మాట్లాడుతున్నా. కచ్చితంగా ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇస్తా. నా భర్త ఎప్పుడు కూడా ప్రభుత్వ భూమి జోలికి పోలేదు. ప్రైవేట్ ల్యాండ్ లో వ్యాపారం చేశాడు. “

నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు

“జనంబాటకు వెళ్తున్న నా మైండ్ ఖరాబ్ చేసే ప్రయత్నం చేయవద్దు. నేను మీ లాగా వెన్నుచూపే మనిషిని కాదు. 

పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నన్ను నిజామాబాద్ కు మాత్రమే పరిమితం చేశారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన ఊరు- మన ఎంపీ పేరుతో ప్రజల్లోనే ఉన్నా. 

తెలంగాణ ప్రజల కోసం పార్లమెంట్ లో పిచ్చి లేసినట్లు ఫైట్ చేశాం. ఢిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్ లో మాత్రమే నేను ఎక్కువగా ఉండేది. నేను ఢిల్లీలో కొట్లాడుతుంటే….కేసీఆర్ గారి పేరు చెప్పుకొని ఏసీలో ఉండి పది కొక్కుల్లాగా ప్రజల సొమ్ము తిన్నారు. నా గురించి తప్పుగా మాట్లాడితే ఒక్కొక్కడి కాళ్లు విరగ్గొడతా. ఇంటి అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారు.. సిగ్గు ఉండాలి. నన్ను పార్టీ నుంచి పంపించేసిన తర్వాత కూడా మీ కళ్లు చల్లబడటం లేదా? 

అసలు కాంగ్రెస్ తెచ్చిన హిల్ట్ పాలసీ కి బీజం వేసింది ఎవరు? లీజుకు ఇచ్చిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మలేదా? దానిపై సంతకం చేసింది కేటీఆర్ కాదా? 

ఆ పాలసీకి మీరు కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ వాళ్లు డోర్లు తెరిచారు. మీరు మాత్రం దోచుకోండి. జనానికి కనీసం హాస్పిటల్స్, స్కూల్స్ కూడా కట్టకండి. మాలాంటి వాళ్లు వీటి మీద ప్రశ్నిస్తే భయపెట్టేలా ఆరోపణలు చేయండి. నా మీద, నా భర్త మీద బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారంలో ఇసుమంత కూడా నిజం లేదు. నా మీద ఎలాంటి ఆరోపణలు వచ్చిన సరే నేను కచ్చితంగా జవాబు చెప్తా. 

అలాగే ఎవరి మీద ఆరోపణలు వస్తే వాళ్లు కూడా సమాధానం చెప్పాలి. విజ్ఞతకే వదిలేస్తున్నా అంటే ప్రజలు అన్ని గమనిస్తారు. మీరేమీ పెద్ద నాయకులు కాదు.  జనం మీకు సరైన సమయంలో బుద్ది చెప్తారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. 

బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగాయి. 

ప్రభుత్వం నుంచి లీజుకు ఇచ్చిన వాటిలో సెలెక్టివ్ గా ప్రైవేట్ వ్యక్తులకు ధారాధాత్తం చేశారు. వాటిపై సంతకాలు పెట్టింది ఎవరో చెప్పాలి? బీఆర్ఎస్ నాయకులు అక్రమాలు చేశారని చిత్రీకరించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 

కానీ గెలిచిన తర్వాత మాత్రం ఏమీ చేయటం లేదు. 

బీఆర్ఎస్ వేసిన దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మార్చుతున్నది. సీఎం అయ్యాను నా కడుపు నిండింది అన్నట్లుగా ఉంది ఆయన వైఖరి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. 

దేవుడు కరుణించి నేను ముఖ్యమంత్రి అయితే 2014 నుంచి జరిగిన అన్యాయాలను వెలికి తీస్తా. నేను తప్పు చేస్తే కచ్చితంగా క్షమాపణ చెబుతా. జనం బాట ప్రారంభించిన రోజే ఉద్యమకారులకు నేను క్షమాపణ చెప్పాను. వారి కోసం నేను ఇంకా ఎక్కువగా ఫైట్ చేయాల్సి ఉండే అని నాకు అనిపించింది. తప్పు చేస్తే కచ్చితంగా సారీ చెబుతాను. తప్పు చేయకపోతే మాత్రం ఊరుకోను. నాకు కేసీఆర్ గారి అంత ఓపిక లేదు. ముందు గీత దాటింది వాళ్లే. నన్ను కొడితే నేను రెండు కొడుతా. మహాత్మాగాంధీకి ఉన్న ఓపిక నాకు లేదు. నేను జనంలో తిరుగుతూ గత పదేళ్లలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నా. అందమైన నగరం అని చెబుతున్నారు కానీ నల్లాల్లో మురికి నీళ్లు వస్తున్నాయి. 

ఆడబిడ్డలకు కనీసం డెలవరీ హాస్పిటల్స్ కూడా లేవు. 

నేను ఐదేళ్లు మాత్రమే ఎంపీగా ఉన్నాను. రెండోసారి నన్ను ఓడగొట్టారు. వద్దంటే కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ ఓడిన చోటే మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఓడిన చోట ప్రజల అభిమానం తిరిగి దక్కించుకుంటా అంటే కుదరనివ్వలేదు. 

స్థానిక ఎమ్మెల్యే లు నా కాళ్లలో కట్టెలు పెట్టేవారు

నియోజకవర్గం ఎమ్మెల్యేలు నన్ను కలిస్తే వారిని బెదిరించే వారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులు తెలుసో లేదో కేసీఆర్ గారే చెప్పాలి. నేను చేసిన ఆరోపణలపై కేటీఆర్ గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి? అమెరికా నుంచి వచ్చిన నాటి నుంచి కూడా నాకు పార్టీ సహకారం లేదు.”