-కల్వకుంట్ల కవిత గారు

  • రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దనుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు?
  • సేవాలాల్ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, సంఘ సంస్కర్త కూడా

 (జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్)

ట్రైబల్స్ ను క్రిమినల్ ట్రైబ్స్ అని అవమానించిన బ్రిటిష్ వాళ్లను ఖడ్గం ఎత్తి పోరాటం చేసి తమ స్వాభిమానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సంత్ సేవాలాల్ ను యావత్ దేశం గుర్తించి గౌరవించాలని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన ఆధ్మాత్మిక గురువు మాత్రమే కాదు, సంఘసంస్కర్త కూడా అని వివరించారు. బంజారాలకు, ఆదివాసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లొల్లి పెట్టిస్తున్నాడని ఆరోపించారు. గోర్ బోలి భాషను కచ్చితంగా 8 వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఘనంగా సేవాలాల్ 287 వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. భోజుమహారాజు, భిక్షు మహరాజ్, శివరాజ్ మహారాజ్ తదితర 20 మంది ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు హాజరయ్యారు. వారితో కలిసి కవిత బోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ ఆధ్మాత్మిక గురువులు పరలోకం గురించే చెబుతారు.. కానీ సేవాలాల్ ఇహలోకం కూడా ఎలా ఉండాలో చెప్పేవారని తెలిపారు. 

సేవాలాల్ జాతీయ గురువు

సేవాలాల్ దేశ వ్యాప్తంగా బంజారా జాతి మేలు కోసం కృషి చేశారు. ఆయన జీవిత పాఠ్యాంశం దేశ వ్యాప్తంగా పుస్తకాల్లో ఉండాలన్నది మా డిమాండ్. సేవాలాల్ స్వాభిమానం, సామాజిక న్యాయం ఉండాలన్నారు. బంజారా జాతి మేలు కోసం పోరాడిన సేవాలాల్  పాఠ్యాంశం దేశ వ్యాప్తంగా ఉండాలి. తండాల్లో ఎక్కువ మంది పేదవాళ్లే ఉంటారు. గతంలో  సూర్యాపేట దగ్గర బంజారాలు ఆడబిడ్డలను అమ్ముకున్న పరిస్థితి చూశాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినప్పటికీ పేదరికం మాత్రం ఇంకా పోలేదు. పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రత్యేక కార్యాచరణతో ప్రత్యేక ఫండ్ ను కేటాయించాలి. తండాలను గ్రామపంచాయితీలుగా చేసుకున్నప్పటికీ సరైన వసతులు మాత్రం లేవు. ఈ పరిస్థితి మారాలంటే ముఖ్యమంత్రి ప్రతి తండాకు రూ. 25 లక్షలు ఇవ్వాలి. తండాల్లో రేషన్ షాపులు, గ్రామపంచాయితీ, అంగన్ వాడీలు కట్టాలి. అయితే యువమిత్రులు తండాల్లో వెలుగులు నింపేలా నాయకత్వం చేపట్టాలి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వారు పోటీ చేయాలి. లీడర్ షిప్ కావాలనుకునే యువత గ్రామాల్లో ఉండాలి.

3 కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలి

ఈ ముఖ్యమంత్రి ప్రతిసారీ బంజారాలకు మిగతా ఎస్టీ జాతులకు లొల్లి పెట్టిస్తున్నారు. బంజారాలు, ఆదివాసీల మధ్య పంచాయితీ పెట్టే పని సీఎం బంద్ చేయాలి. బంజారాలు మంచి పొజిషనల్ లో ఉండాలి. రాజకీయాల్లో వారి రిప్రజేంటేషన్ ఉండాలి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాలకు 5 సీట్లు అంటున్నారు. అందులో అసలు లాజిక్ లేదు. పట్టణాల్లో బంజారాల జనాభా 6 శాతం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. 2011 జనాభా లెక్కలతో కంపేర్ చేస్తున్నారు. అది సరికాదు. 3 వందల సీట్లలో బంజారాలకు 5 సీట్లు మాత్రమే అంటున్నారు. ఎస్టీలందరు బాగుపడే ఆలోచన చేయాలి. నిజానికి జీవో 33 ప్రకారం పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ రెండేళ్లలో అడ్మిషన్లు, ప్రమోషన్లు, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు ఇచ్చారా? శ్వేత పత్రం విడుదల చేయాలి?  స్వాభిమానం అంటే మన సాంస్కృతిక ప్రతీకలు రాజధానిలో ఉండాలి. ముఖ్యమంత్రి అచ్చంపేట అడవుల్లో 20 ఎకరాల్లో సేవాలాల్ గారి స్మారకం పెడతామంటున్నారు. హైదరాబాద్ లో కూడా సేవాలాల్ విగ్రహం పెట్టాల్సిందే. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బంజారాలు లేని మంత్రివర్గం ఉండేది కాదు. కానీ ఈ ప్రభుత్వంలో దారుణంగా లంబాడీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు. వెంటనే వారికి మంత్రి పదవి ఇవ్వాలి. అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.12 లక్షలు అన్నారు. కానీ ఎవరికీ రాలేదు. కాంట్రాక్టులలో ఎస్టీలకు అవకాశం ఇస్తామని చెప్పి చేయలేదు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జాగతో పాటు రూ.6 లక్షలు ఇస్తామని అన్నారు. కానీ ఉన్న ఇళ్లనే గుంజుకునే పరిస్థితికి తెచ్చారు. ఇక అసైన్డ్ భూముల విషయంలో కూడా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే ముందుగా అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు. అసైన్డ్ భూముల విషయంలో చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోలేదు. అసైన్డ్ భూముల విషయంలో సీఎం ఒక స్టాండ్ తీసుకోవాలి. పోడు పట్టాలు పంపిణీ వెంటనే చేయాలి. సేవాలాల్ పేరుతో, ఆదివాసీల పేరుతో, ఎరుకల తెగ పేరుతో ఏర్పాటు చేస్తామన్న మూడు కార్పొరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలి. ఐటీడీఏలలోనే ఉద్యోగాల నియామకాలు చేపడతామని హామీ ఇచ్చి వాటిని పట్టించుకోవటం లేదు. నల్కొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ లో ఐటీడీఏలు పెట్టాలి. విద్యాజ్యోతి పేరుతో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో అబద్దాలు చెప్పించారు. పదో తరగతి పాసైతే రూ.10 వేలు,  ఇంటర్ కు రూ.15 వేలు, డిగ్రీ కి రూ.25 వేలు, పీజీకి రూ. 1లక్ష, ఎంఫిల్ కు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. ఎస్టీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఈ ముఖ్యమంత్రి నెరవేర్చలేదు. సీఎంకు విజ్ఞత వచ్చేలా, మతిమరుపు పోయేలా సేవాలాల్ చేయాలని కోరుకుంటున్నా.

బంజారాలకు జాగృతి అగ్ర తాంబూలం

అన్ని పార్టీలు బంజారా శాఖను పెట్టుకుంటాయి. కానీ జాగృతి మాత్రం మెయిన్ బాడీలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా బంజారా బిడ్డకు అవకాశం ఇచ్చింది. వెనుకబడిన జాతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ జాగృతిలో బంజారా, ఆదివాసీ అని రెండు శాఖలను పెట్టుకున్నాం. రెండు వర్గాల హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం.  మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చాలా సీట్లు వస్తే, బీఆర్ఎస్ కు కొన్ని సీట్లు వచ్చాయి. జాగృతి తరఫున మేము ఒక్క మున్సిపాలిటీ గెలుచుకున్నాం. కానీ ఆ సీటును కూడా లాక్కునేలా ముఖ్యమంత్రి  ప్రయత్నిస్తున్నారు. ఇన్ని సీట్లు వచ్చాక కూడా ఇంకా అగడు ఎందుకు ముఖ్యమంత్రి గారు? అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం, అడిగే వాళ్లు ఉండకూడదా? కాంగ్రెస్ నాయకులరా మీకన్నా కూడా ప్రతిపక్షం వారినే సీఎం ముందు కలుస్తున్నాడు? మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు నిధులు రాకపోతే ఓటర్లకు మీరిచ్చిన హామీల సంగతేంటీ? ఇట్ల ప్రతిపక్షాలు ఉండకుండా చేసే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఏ పార్టీలో గెలిచినా సరే బీఆర్ఎస్ లోకి చేర్చుకొని వెగటు పుట్టేలా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేస్తోంది. వారికి కూడా ప్రజలు బుద్ధి చెబుతారు. ప్రతిపక్షాలను, అడిగే వారిని ఉండనివ్వాలని చెబుతున్నా. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ మీటింగ్ ను మొక్కుబడిగా ఒక్కసారి మాత్రమే పెట్టారు. వారికి పనికి వచ్చే పనులు ఏమీ చేయటం లేదు. సేవాలాల్  ఇచ్చిన సందేశం ప్రకారం మనం సమాజంలో ముందుకు పోవాలి. కచ్చితంగా మీ దయతో జాగృతి ముందుకు వెళ్తుందన్న నమ్మకం ఉంది.