బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీమంత్రి హరీశ్ రావుపై తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత మరోసారి ఫైరయ్యారు. అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తికే అసెంబ్లీలో కీలక బాధ్యతలు చేపట్టడం సరైందని కాదన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తన రాజీనామా విషయం తేల్చుకోవడానికి కవిత శుక్రవారం కౌన్సిల్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా లాంజ్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. 

మ్యాచ్ ఫిక్సింగ్

“పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలకు పాల్పడ్డ హరీశ్ రావును బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమించడం అన్యాయం. ప్రాజెక్టు సోర్స్ పాయింట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ గారే అసెంబ్లీకి వచ్చి చెప్తే బావుంటుంది. హరీశ్ రావు పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్నారు.. ఆయన హౌస్ లో మాట్లాడితే అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. గతంలో రేవంత్ రెడ్డితో ఆయన ఛాంబర్ లో హరీశ్ రావు ప్రత్యేకంగా మాట్లాడుకున్నది అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తికి నీళ్ల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే బీఆర్ఎస్ కు నష్టమే.”

రాజకీయ పార్టీగా జాగృతి

“బీఆర్ఎస్ పై మనసు విరిగింది.. కేసీఆర్ గారు పిలిచినా సరే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళేది లేదు. మొదటి నుండి నేను స్వతంత్రంగా పని చేశాను. కేసీఆర్ గారి డైరెక్షన్లో హరీశ్, కేటీఆర్ పని చేశారు. 

నేను జాగృతి జెండాతో ముందుకు వెళ్ళాను.

తెలంగాణ కు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉన్నది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా పోటీ చేస్తాం. జాగృతి జనంబాటలో ప్రజల కష్టాలను కళ్ళారా చూస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కొత్తగా ఒక్క కరెంట్ పోల్ కూడా తండాలకు ఇవ్వడం లేదు. మిషన్ భగీరథను ఆగం చేశారు. తాగునీటి కోసం ప్రజలు, గిరిజనులు తండ్లాడుతున్నారు.”

రాజీనామా ఆమోదింప చేసుకుంటా

“సెప్టెంబర్ 3 తేదీన నేను నా రాజీనామా చేశాను. నాలుగు నెలలుగా నా రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు.. హౌస్ లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటాను.”

నా రక్తం మరుగుతున్నది

“నిన్న కేసీఆర్ గారిని ఉద్దేశించి సీఎం మాట్లాడిన మాటలు ఆమోద యోగ్యం కాదు. కేసీఆర్ ను ఉరితీయాలి అంటున్నాడు. రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు రెండు సార్లు ఉరి తీయాలి. కేసీఆర్ గారిని ఉరి తీయాలని అంటే నా రక్తం మరుగుతోంది.

పాలమూరుకు తీరని అన్యాయం చేస్తున్నదే రేవంత్. ఉద్యమ నాయకులను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.”